ప్రజాశక్తి-విజయవాడ: 'ఆడవాళ్లు ఎలాంటి దుస్తులు ధరించినా, అసలు దుస్తులు లేకపోయినా అందంగా ఉంటారు' అంటూ సభ్య సమాజం సిగ్గుపడేలా నిస్సిగ్గుగా వ్యాఖ్యలు చేసిన ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ బాబాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు.ఈ మేరకు సోమవారం నాడు నగరంలోని గవర్నర్ పేట రక్షక భట నిలయంలో పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మచ్చ దురాభవాని, జాతీయ ప్రజా తంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కార్యదర్శి కొప్పరపు శ్రీదేవి మాట్లాడుతూ... మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన యోగా గురువు రామ్‌దేవ్ బాబాపై కేసు నమోదుచేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలాలు స్వంతం చేసుకుని, పతంజలి యోగ ముసుగులో నకీలి సరుకుల వ్యాపారాలు చేస్తూ ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పే రామ్ దేవ్ బాబా అనే సన్యాసి స్త్రీని విలాస వస్తువుగా, అంగాంగ వర్ణనలు చేసే విష సంస్కతిలో మహిళా లోకాన్ని అవమానించే రీతిలో వ్యాఖ్యలు చేయడం అత్యంత దారుణ మన్నారు.ఇటువంటి వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని అతన్ని పోలీసులు అరెస్టు చేసి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సభ్య సమాజం సిగ్గు పడేలాగా నిస్సిగ్గుగా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య నాయకులు మాజీ కార్పొరేటర్లు తమ్మిన దుర్గ , కాజా సరోజ, మహిళా సమాఖ్య నాయకులు ఓర్శు భారతి, దుర్గాసి రమణమ్మ, మూలి ఇందిర, భాగ్యలక్ష్మి, గడ్డం ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-వన్‌టౌన్: ఇటీవల మహిళలపై రామ్‌దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వాలు స్పందించకపోవటం బాధాకరమని ఐద్వా పశ్చిమ సిటీ అధ్యక్షురాలు కుండనాల శేషుమణి తెలిపారు. సోమవారం పశ్చిమ నగర కమిటీ అధ్యక్షురాలు కుండనాల శేషుమణి ఆధ్వర్యంలో 50వ డివిజన్ క్వారీ ప్రాంతంలో స్థానిక మహిళలతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్, ఐద్వా నాయకులు గాదె ఆదిలక్ష్మి, ఐద్వా పశ్చిమ నగర కమిటీ సభ్యులు విక్రమ్ లక్ష్మీ, సీనియర్ నాయకురాలు వి.రమణమ్మ, వి.స్వప్న, స్థానిక మహిళలు పాల్గొన్నారు.










