ప్రజాశక్తి -అరకులోయ రూరల్: మహిళలపై రామ్ దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని స్త్రీలకు క్షమాపణ చెప్పాలని ఐద్వా రాష్ట్ర అద్యక్షురాలు ప్రభావతి డిమాండ్ చేశారు. అరకువేలి యండపల్లివలస గురుకుల మహిళ కళాశాలలో ఐద్వా ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలపై విద్యార్ధులతో ఆదివారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ, స్త్రీలు ఎక్కడ గౌరవించబడతమో అక్కడే దేవతులు కొలువై ఉంటారని పురాణాలు చెప్తున్నప్పటికీ మరోవైపు ప్రముఖులు అను కునేవారే స్త్రీల వస్త్రధారణ పై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.ఇటీవల గరికిపాటి నరసింగరావు స్త్రీల వస్త్ర ధారణపై అసభ్యకరంగా చేసిన వ్యాఖ్యలు మరవక ముందే, మరోవైపు రామ్ దేవ్ బాబా స్త్రీలు విప్పుకున్నా అందంగానే ఉంటారని అసభ్యకర వ్యాఖ్యలు చేయడం స్త్రీ జాతిని అవమానించడమేనని ఆమె మండిపడ్డారు. స్త్రీలకు వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. దేశంలో ప్రజలు ఆకలి, నిరుద్యోగం వంటి అనేక రకాల సమస్యలతో సతమతమవుతుంటే వీరికి ఇవేమి పట్ట లేదన్నారు. రామ్ దేవ్ బాబాపై వెంటనే చట్ట ప్రకారం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర నాయకురాలు వివి జయ, వార్డెన్ సత్యవతి, మహిళా మండల నాయకులు సన్యాసమ్మ, పిడి రవణమ్మ తదితరులు పాల్గొన్నారు.










