రామాపురం, సూర్యలంక బీచ్‌లకు కొత్త రూపుకు ప్రతిపాదనలు : పర్యాటక శాఖ రీజినల్ డైరెక్టర్ వాకా శ్రీనివాసరెడ్డి
ప్రజాశక్తి - వేటపాలెం
జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా సూచనలతో స్థానిక ప్రజాప్రతినిధుల చొరవతో రామాపురం, సూర్యలంక బీచ్‌లను మరింత అభివృద్ధి చేసేందుకు పర్యాటక, రెవెన్యూ శాఖల అధికారులు, బ్లూ ఫాగ్ ఆర్కిటెక్ బృందం బీచ్‌లను మంగళవారం సందర్శించారు. పర్యాటక శాఖ రీజినల్ డైరెక్టర్ వాకా శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో అధికారుల బృందం 1500మీటర్ల సముద్ర తీర భౌతిక పరిస్థితిని, జాలర్ల కనెక్టివిటీని, మత్స్యకారులకు అనుకూలమైన వ్యాపార వ్యవహారాలపై పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం టూరిజంపై ప్రత్యేక శ్రద్ద చూపుతుందని అన్నారు. బ్లూ ఫాగ్ గుర్తింపు పొందినట్లయితే అనేక రకాల అంతర్జాతీయ వసతులతోపాటు విదేశీ పర్యాటకుల రాక పెరుగుతుందని అన్నారు. స్వదేశీ పర్యాటకులు కూడా సురక్షితమైన బీచ్‌లకు కుటుంబ సభ్యులతో వెళ్లేందుకు వీలు కలుగుతుందని అన్నారు. తద్వారా టూరిజం, ట్రావెల్, హాస్పిటాలిటి విభాగాలలో ఉద్యోగం వనరులతో పాటు ఆదాయాలు పెరుగుతాయని తెలిపారు. జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని అన్నారు. సూర్యలంక, రామాపురం దేశంలోనే అత్యంత అనువైన బీచ్‌లని అన్నారు. విదేశీ స్థాయి వనరులు, సౌకర్యాలతో ఆహ్లాదకరమైన నీటి ఆటలు, వినోదాలు ఏర్పాటు చేస్తూ కొత్త రూపం కల్పించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తుందన్నారు. మత్స్యకారుల అభివృద్ధే ధ్యేయంగా రామాపురం, సూర్యలంక బీచ్లను విదేశీ స్థాయికి పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. మత్స్యకారులకు మార్కెట్ సౌకర్యం, మత్స్య సంపద ప్రదర్శనకు క్రమ పద్ధతిలో షాపులు, పర్యాటకులను ఆకర్షించేలా ముఖ ద్వారం ఏర్పాటు చేస్తామన్నారు. సందర్శకుల వినోదానికి సురక్షిత బోటు షికార్, ఈతకొలను, వాటర్ స్పోర్ట్స్, రోలింగ్, స్కేటింగ్, చిల్డ్రన్స్ పార్కు, స్నానపు గదులు, ఓపెన్ జిమ్ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. స్థానిక దేవాలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. వీటిపై ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్కిటెక్ట్ సుజిత్ కుమార్, బాపట్ల తహసిల్దార్ సుధారాణి, వేటపాలెం తహసిల్దారు అశోక్ వర్ధన్, టూరిజం మేనేజర్ నాయుడమ్మ, రిసార్ట్స్ మేనేజర్ నాగభూషణం పాల్గొన్నారు.










