అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. పాలక వర్గాల అవకాశవాదం మతతత్వ రాజకీయ పథకాల కారణంగా దశాబ్దాలుగా నలుగుతూ దేశంలో విపరీతమైన కల్లోలానికి, విధ్వంసానికి కారణమైన అయోధ్య వివాదం పరస్పర అవగాహనతో గాని, కోర్టు తీర్పు ద్వారా గాని ముగిసిపోవాలని ప్రతివారూ కోరుకున్నారు. 1980వ దశకం మధ్య కాలంలో ఒకవైపున అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నిర్ణయాలు మరోవైపున ఆరెస్సెస్ బిజెపి సంఘ పరివార్ వ్యూహాలతో ఈ సమస్య రాజకీయాలలో కేంద్ర స్థానం లోకి వచ్చింది. 1984లో రెండు సీట్లకు పరిమితమైన బిజెపి దాని ఆధారంగానే 82 సీట్లకు ఎదిగింది. రాజీవ్ తర్వాత వి.పి.సింగ్ నాయకత్వంలో వచ్చిన లౌకిక ప్రభుత్వాన్ని (కాంగ్రెస్‌తో కలసి) 1990లో కూల్చడానికీ ఎల్.కె.అద్వానీ రథయాత్ర సాధనమైంది. అద్వానీ తదితరుల ప్రత్యక్ష నాయకత్వంలో కరసేవ అంటూ 1992 బాబ్రీ మసీదు కూల్చివేయడానికి నాటి పి.వి ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో భారత దేశ లౌకిక ప్రతిష్ట కళంకితమైంది. కలహాలు, పేలుళ్లలో దేశం తల్లడిల్లిపోయింది. కూల్చివేత నేపథ్యంలో బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజలు చాలా వరకూ ఓడించారు కాని వామపక్షేతర పార్టీలు మతతత్వ రాజకీయాలపై పోరాడకపోగా అధికారం కోసం బిజెపితో రాజీ పడ్డాయి. 1996, 98, 99లో వాజ్‌పేయి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినా బిజెపి ఓట్లు మాత్రం 24 శాతం లోపే. అవి తర్వాత 18 శాతానికి పడిపోయాయి కూడా. గుజరాత్‌లో 2002 మారణకాండ అనంతరం పదేళ్లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోడీ ప్రధాని పీఠమెక్కిన సమయం లోనూ 37 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇవన్నీ రాముడికీ రామాయణానికి సంబంధించిన అంశాలు కాదు. రాజకీయ భారత పర్వాలు. రాముడిని తరతరాలుగా దేశంలో కోట్ల మంది పూజిస్తూనే వున్నారు. రామాయణ పారాయణం చేస్తున్నారు. వారివల్ల అప్పుడూ ఇప్పుడూ సమస్య లేదు. వారి విశ్వాసాన్ని రాజకీయ పాచికగా చేసుకున్న శక్తుల కుయుక్తుల గురించే చర్చ.
ఇన్నాళ్లకు రామ్‌లల్లా తాత్కాలిక గుడారం లోంచి గుడి లోకి వస్తున్నారని మోడీ ఊగిపోతూ మాట్లాడారు. తెలుగువారి భద్రాద్రి నుంచి అయోధ్య లోని ఇతర మందిరాలలో కూడా రాముడు పూజలందుకుంటూనే వున్నాడు. రాజకీయ గుడారంలో ఆయనను బందీని చేసింది బిజెపి ఆరెస్సెస్ నేతలే. రాముడిని మర్యాద పురుషోత్తముడంటారు. రామో విగ్రహవాన్ ధర్మ: అంటారు. మర్యాద అన్నా, ధర్మం అన్నా పద్ధతి. రాజ ధర్మం. ఇప్పుడు రాజులు లేరు గనక రాజ్యాంగ ధర్మం. ప్రభుత్వాధినేతలు మత క్రతువుల్లో అధికారికంగా పాల్గొనరాదనేది లౌకిక రాజ్యాంగ ధర్మం. సుప్రీంకోర్టు తీర్పు ఆలయ నిర్మాణం కోసం ఒక ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేసి బాధ్యత దానికి అప్పగించాలని చెప్పింది. కాని అయోధ్య వేడుకలో వేదికపై ప్రధాని మోడీ, ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్, యు.పి సి.ఎం యోగి, గవర్నర్ ఆనందిబెన్ ఆసీనులయ్యారు. తీర్పు ప్రకారం ట్రస్టుకు వదిలి పెట్టకుండా ప్రభుత్వాధినేతలు, సంఫ్‌ు సంచాలక్‌లు తయారవడం ఆ స్ఫూర్తిని ఉల్లంఘిం చడమే. ట్రస్టు చైర్మన్‌గా వున్న నిత్యగోపాల్‌దాస్ బాబ్రీ విధ్వంసం కేసులో నిందితుడు. బాబ్రీ విధ్వంసం ఘోరమైన నేరమని చెప్పిన సుప్రీం కోర్టు దాని బాధ్యులైన వారికి శిక్షల విషయం వదిలేయడమే గాక వివాద స్థలాన్ని అవతలి పక్షానికి ఇవ్వడమే తీవ్ర విమర్శలకు గురైనప్పటికీ ఏదో ఒక పరిష్కారం అని ప్రజలు సర్దుకున్నారు. అద్వానీ వంటి వారిని ఈ సందర్భంలో దూరం పెట్టడానికి బిజెపి అంతర్గత కారణాలే చెబుతున్నారుగాని గత కళంకాల ముద్రనూ, న్యాయ పరమైన చిక్కులను తప్పించుకోవాలనే వ్యూహం అది. ఈ సమయంలో ప్రధాని ప్రసంగం ఏకీకరణ వైపు, సామరస్య సాధన వైపు కాకుండా ఉద్వేగం రగిలించడానికి, భక్తులను (లేదా ఓటర్లను) ఆకట్టుకోడానికి అంకితమైంది. 'జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ...' అన్న రాముడి మాట ఉటంకించారు. అనేక మతాల వారికి ఇది జన్మభూమి కదా, భారత మాత బిడ్డలందరూ హిందువులే కాదు కదా. రాజ్యాంగ పరంగా మోడీ వారందరికీ ప్రధాని కదా! 'రామో విగ్రహవాన్ ధర్మ:' అన్నప్పుడు రాజ్యాంగ ధర్మాన్ని కూడా పాటించవద్దా? ఒక ఆలయ శంకుస్థాపనకు అధికారిక హోదాలో ప్రధాని హాజరయ్యేట్టయితే రేపు మరో గుడికి లేదా మసీదుకు, చర్చికి, గురుద్వారాకు కూడా వెళతారా? ఇదే వేడుకలో యు.పి ముఖ్యమంత్రిని 'అయోధ్యలో మసీదు శంకుస్థాపనకు వెళతారా?' అని అడిగితే 'నన్ను పిలవరు...నేను వెళ్లను' అని జవాబివ్వడం యాదృచ్ఛికం కాదు. ఇక కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ దేశ, రాష్ట్ర పాలకులు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం ఏం సంకేతాలిస్తుంది?
రాముడు ఈ దేశ సంస్కృతికి ప్రతీక అని ప్రధాని ప్రకటించారు. అలాంటప్పుడు బిజెపి వారికే ఉత్సవం ఎందుకు పరిమితమైంది? ఇతర పార్టీల వారినీ లేదా సంస్థల వారిని ఎందుకు విశ్వాసం లోకి తీసుకోలేదు? హిందువుల విశ్వాసం అన్నప్పుడు పరివార్ మాత్రమే మందిర నిర్మాణ బాధ్యత తీసుకోవాలని కోర్టు చెప్పలేదే? కనుకనే కట్టేది రామ మందిరమా లేక బిజెపి, ఆరెస్సెస్ దుర్గమా అని కొందరు పరిశీలకులు ప్రశ్న వేశారు. మీడియా అంతా రామమయం శీర్షికలిచ్చిందిగాని అక్కడంతా మోడీ మయమే! 370వ అధికరణం రద్దుకు ఏడాది గడచిన రోజునే అయోధ్య శంకుస్థాపన ముహూర్తం ఊరికే పెట్టలేదు. కాశ్మీర్‌ను, రాముణ్ని కూడా మేమే విముక్తి చేశామన్నది ఇక్కడ ప్రచారాస్త్రం.
అయోధ్యకాండలో బిజెపి పథకాలు ఫలించడానికి కాంగ్రెస్ ప్రధానులు దోహదం చేస్తూనే వున్నారు. ఇప్పుడూ తామెక్కడ వెనకబడి పోతామోనని కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ట్వీట్లు చేశారు. అత్యధిక ప్రాంతీయ పార్టీలకు బిజెపితో ప్రత్యక్ష పరోక్ష భాగస్వామ్యం. 1998లో ఈ ప్రక్రియను పెంచిన చంద్రబాబు నాయుడు అమరావతిని అయోధ్యతో ముడిపెట్టి మాట్లాడారందుకే. ఎ.పి, తెలంగాణ అధికార పీఠాలకు సన్నిహితులైన స్వాములిద్దరూ అయోధ్య ఆహ్వానాలు అందుకున్నారు. వేడుకకు మోడీ హాజరవడాన్ని వ్యతిరేకించిన మజ్లిస్ నాయకుడు ఒవైసీ వంటి వారు ఈ పార్టీల మిత్రులే! కేరళ ముస్లింలీగ్ బాబ్రీ విధ్వంస సమయంలో కూటమి భాగస్వామిగా వుండటాన్ని ముఖ్యమంత్రి విజయన్ సూటిగా ప్రస్తావించారు. ఈ కాలమంతటా మతతత్వ రాజకీయాలను నికరంగా వ్యతిరేకించింది నిలదీసింది వామపక్షాలు, ప్రజాస్వామిక వాదులు, ప్రజాపక్ష మేధావులు మాత్రమే. మోడీ సర్కారు వారిపై వేటసాగిస్తున్న కారణం కూడా అదే (ప్రజాశక్తి 1992 లోనే అయోధ్యపై లక్షల ప్రతులు ప్రత్యేక సంచిక వేసింది). ఈ సమయం లోనూ అలాంటి గొంతులు వినిపిస్తూనే వున్నా ఒక తెలుగు పత్రిక సంపాదకీయంలో వామపక్షాలే విఫలమైనట్టు రాయడం విస్మయకరం. మోడీ సర్కారుపై సన్నాయి నొక్కులు, వారి మిత్రులతో నెయ్యం, కాంగ్రెస్‌పై కఠిన విమర్శలు, కమ్యూనిస్టులపై వైఫల్య ముద్రలు ఈ తరహా వ్యాఖ్యాతలకు వెన్నతో పెట్టిన విద్య. ఆ సంగతి ఎలా వున్నా లౌకిక రాజ్యాంగాన్ని మత సామరస్యాన్ని కాపాడుకోవడం నేటి కీలక కర్తవ్యంగా వుంది. త్వరలో యు.పి, బీహార్ ఎన్నికలు వస్తున్న కారణంగా ఇది మరింత తక్షణ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. భిన్న మతాలకు విశ్వాసాలకు నిలయమైన ఈ దేశంలో మత విద్వేషాలు కరోనా వైరస్ కన్నా ఎక్కువ హాని కలిగిస్తాయి. అలాంటి అవాంఛనీయ పరిణామాలు లేకుండా అయోధ్య కాండ ముగిసిపోవాలంటే అప్రమత్తంగా వుండక తప్పదు.
* తెలకపల్లి రవి










