Oct 19,2023 21:53
రాలని చినుకు.. ఎండుతున్న పైరు..!

రెండు నెలలుగా జాడలేని వాన
వెంటాడుతున్న వర్షాభావం
మండుతున్న ఎండలు
రైతులు దిగాలు
ప్రజాశక్తి - చింతలపూడి

ఈ ఏడాది వరుణుడి జాడలేకుండా పోయింది. వానాకాలం మూడు నెలల పాటు పుష్కలంగా కురవాల్సిన వర్షాలు అడపాదడపా తప్ప పట్టుమని పదిరోజులు కూడా కురవలేదు. మూడు నెలలుగా ఏరోజుకారోజు రైతన్న వర్షం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. చివరకు వానలు పడకుండానే వర్షాకాలం ముగిసిపోయింది. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చెరువుల్లో ఉన్నకాస్త నీరు కూడా అడుగంటిపోతుంది. ఇప్పటి వరకూ పంటను ఏదోలా కాపాడుకుంటూ వచ్చిన రైతన్న చేతికొచ్చిన పైరు ఎండిపోతుండటంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీనిప్రభావం పంట దిగుబడిపై పడుతుండటంతో కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొందని ఆందోళన చెందుతున్నాడు. వర్షకాలంలో కూడా ఎండలు మండిపోతున్నాయి. పొట్టదశకు వచ్చిన వరిపంట ఎండిపోతోంది. చెరువుల్లో ఉన్న కాస్త నీటిని మోటార్‌, ట్యూబులు తీసుకొచ్చి తోడుకుని పంటలు తడుపుతున్నారు. దీనికి అందనంగా డీజిల్‌కు, మోటార్‌, ట్యూబుల అద్దెలు భారీగా అవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు రూ.ఐదు వేల వరకూ అదనంగా ఖర్చవుతుందని తెలిపారు. ఇంత ఖర్చు చేస్తున్నా చివరకు పంట చేతికి వస్తుందో లేదో అని రైతులు ఆందోళన చెందుతున్నారు.
చింతలపూడి మండలంలో 16 వేల ఎకరాలల్లో వరి పంట సాగుచేశారు. చెరువుల కింద 3,500 ఎకారాల ఆయకట్టు ఉంది. బోర్ల మీద ఆధారపడి 2,500 ఎకరాల్లో రైతులు పంటసాగుచేశారు. ప్రస్తుతం ఇవన్నీ పొట్టదశలో ఉన్నాయి. వర్షం పడితేనే ఈ పంటలన్నీ గట్టెక్కే పరిస్థితి ఉంది. లేకుంటే చెరువుల్లోని నీరు చాలక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. భూగర్భ జలాలు సైతం అడుగంటడంతో బోర్లలో నీటి లెవిల్‌ తగ్గిందని పలువురు రైతులు చెబుతున్నారు. దీనికి తోడు ఎండల దెబ్బకు పంటకు నీరు పెట్టిన రెండు రోజులకే ఇంకిపోతుందని, పదేపదే తడపాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. దీంతో నీరు చాలక పంట దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.
కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కనీసం కౌలు ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రెండు, మూడు దుక్కుల వర్షం పడితేగానీ గట్టెక్కుతామని రైతులు భావిస్తున్నారు. వర్షాలు పడి దాదాపు రెండు నెలలు కావొస్తుండటంతో చెరువు కింద రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం ఆ చెరువులన్నీ అడుగంటాయి. పాతచింతలపూడి, సమ్మెటవారిగూడెం, మల్లయ్యగూడెం, రాఘవాపురం, గణిచర్ల, అంకురాయలకొత్తగూడెం, సీతానగరం, ప్రగఢవరం గ్రామాల్లో వరిపంట మొత్తం దాదాపు ఎండిపోయే పరిస్థితి దాపురించింది. భూములు నెర్రలు తీసి నీటికోసం ఎదురుచూస్తున్నాయి. ఆ పంటలను చూసి రైతులు లబోదిబోమంటున్నారు.
పది ఎకరాలు ఎండిపోతోంది
చీకటి మురళీ, రైతు
చెరువు మీద ఆధారపడి నేను పది ఎకరాల్లో వరి పంట సాగుచేశాను. ప్రస్తుతం నీటి ఎద్దడితో పంట మొత్తం దెబ్బతింటోంది. చెరువుల్లో నీరు కూడా అడుగంటింది. ఈ ఏడాది నష్టాలు తప్పేలా లేవు.
ఉన్నతాధికారులకు తెలియజేశాం
మీనాకుమారి, మండల వ్యవసాయాధికారి
ఈ ఏడాది వర్షాలు అనుకున్నంతగా పడలేదు. దీంతో సాగునీటి ఎద్దడి ఏర్పడింది. పంటలు దెబ్బతిని నష్టపోయే పరిస్థితులు దాపురించాయని, పంటలు ఎండిపొతున్నాయని రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం.