Dec 20,2020 12:25

సూర్యోదయమంటే
అమ్మదో ఆలిదో...
నుదిటి బొట్టనుకునేవాడు.

లేవంగనే దర్శనం చేసుకుని
లోకం వెలుతురులోకెళ్ళక ముందే
రెక్కలు కట్టుకుని
చేలో వాలిపోతాడు.

మెదడులో
జీర్ణంకాని ఆలోచనలు
బహిరంగమవ్వకుండా
పెదవులెనక తెరేస్తాడు.

చేను మధ్య మధ్యలో
కుట్ర సైన్యపు కలుపుతీస్తూ.
శత్రు మూక వాలడం పసిగట్టి
చేనును కాపాడే ఆయుధంతో
పిచికారీ యుధ్ధం చేసి

చేను నవ్వుతున్నప్పుడే
రెక్కలను ఊళ్ళో
అప్పుల నిప్పుల్లో కాల్చుకుంటుండగానే...
చేనుని విపత్తు కూల్చెల్లిపోతుంది.

కాలుతున్న వాసన పీలుస్తున్న నేత
జేబులు తడముకుంటూ
నాలుగున్నర కెమేరాలతో
తనను ఓట్ల వేపు నిర్మించుకోవడం
ఇక్కడ పెద్ద ఘనకార్యం..

అక్కడితో ఆగిపోదు
రెక్కలు తెరుచుకుంటున్న కార్లలోంచీ
చిత్రగుప్తుడి చేతిలో పుస్తకంలా
పైళ్లట్టుకుని అధికార్లు
ఆ నాలుగున్నర కెమేరాలకూ
ఎగురుతూ దర్శనమిస్తారు.

నాయకుడూ, అధికారుల
లెక్కల మంత్రాలయ్యాకా...
రైతు భుజంపై
అబద్ధం కప్పేసి వెళ్ళిపోతారు.

కన్నీటి తెరలలో చేనును చూస్తున్న రైతు
ఆకలిని గుటకలేస్తూ
చేలో దిగబడతాడు.
చేనంతా నరాలు తెగిన దేహమై
రైతు దేశాన్ని స్పర్శిస్తుంది.

నేతలూ, అధికారుల
రాళ్ళ మనసులు రైతు బాధకి
కరగక చిట్లిపోవడం చూస్తున్న కాలం
రాళ్ళను కుట్టే
రహస్య దారాన్ని మోసుకొస్తోంది.
ఇప్పుడిక
రాళ్ళను కుట్టాలి.

కుట్టిన రాళ్ళపై
రైతుని నిలబెట్టాలి.
 

- కొత్తపల్లిమణీ త్రినాథరాజు
9949389296