Jan 30,2022 12:02

'రాజు లేనప్పుడూ సారంగో.. నువ్వు
రారాదా పోరాదా సారంగో....' అంటూ చప్పట్లు కొడుతూ పాట పాడుతున్నారు నలుగురు హిజ్రాలు. రేణిగుంట రైల్వేస్టేషన్‌ మెట్ల మీద వారు నిలబడి ప్యాసెంజర్లను నిలబెట్టి మరీ పైసలు అడుగుతున్నారు.
రైలు పట్టాలపైన వచ్చే రైళ్లు, పోయే రైళ్ల శబ్దాలతో అంతా హోరెత్తుతోంది. ఎక్కి దిగే ప్రయాణికులతో స్టేషన్‌ సందడిగా ఉంది. మైక్‌లో అందమైన గొంతు రకరకాల అనౌన్స్‌మెంట్‌లు ఇస్తోంది.
డ్యూటీ చూసుకుని నల్ల కోటు వేసుకుని మెట్లు దిగుతున్న టికెట్‌ కలెక్టర్‌ రమణమూర్తిని చూసి వారందరూ గౌరవంగా పక్కకి జరిగారు. రమణమూర్తిని చూసిన కొందరు భిక్షగాళ్లు, కొందరు హమాలీలు చేతులెత్తి నమస్కరించారు.
రమణమూర్తి చిన్నగా నడుచుకుంటూ షఫీ టీ అంగడికి చేరాడు.
రైల్వేస్టేషన్‌ ఎదురుగా వేప చెట్టు కింద ఉన్న షఫీ టీ అంగడి ఎప్పుడూ జనాలతో కిటకిటలాడుతుంటుంది. టీ ఆకు ఉడుకుతుంటే వచ్చే ఘుమఘుమ వాసనలు పీల్చడానికి సగం మంది జనం అక్కడే కాసేపు నిలబడిపోతారు. ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడో కానీ మొరమొరలాడే సాల్ట్‌ బిస్కెట్లు భలే ఫ్రెష్‌గా ఉంటాయి. బిస్కెట్లను కరకర నములుతూ టీ తాగుతుంటే ఆ మజానే వేరు.
'షఫీ, ఈ వారం లెక్క ఎంత అయ్యింది' అని రమణమూర్తి అడిగాడు.
షఫీ గబగబా గల్లా పెట్టె దగ్గర నుంచి లేచి వచ్చి 'ఫస్ట్‌ టీ తాగండి సార్‌, లెక్క మళ్ల చూద్దాం' అన్నాడు.
'సాపాటు ఎటూ లేదు, పాటైనా పాడు బ్రదర్‌....' సినిమా పాట ఎఫ్‌.ఎమ్‌ రేడియోలో జోరుగా వినిపిస్తోంది.
నాలుగు కుక్కలు నాలుకలు తెరిచి, సొల్లు కారుస్తూ వచ్చి రమణమూర్తి ముందు నిలబడ్డాయి. నాలుగు బిస్కెట్లు వాటి మీదకు విసిరేసేసరికి అవి నోటితో లటుక్కున పట్టుకుని, తోక ఆడిస్తూ వెళ్లిపోయాయి.
ఇంతలో టీ మాస్టర్‌ వేడి వేడి స్ట్రాంగ్‌ టీ, మీగడ లేకుండా, పైన నురుగు వేసి తెచ్చి ఇచ్చాడు.
తృప్తిగా జుర్రుకుని తాగాడు రమణమూర్తి.
షఫీ టీ గ్లాసు అందుకుంటూ 'సార్‌, నేను ఎప్పుడూ మిమ్మల్ని ఈ ప్రశ్న అడగలేదు. మూడేళ్లయ్యింది మీరు ఈ ఉద్యోగంలో చేరి. ఆ రోజు నుంచీ మా టీ అంగడికి, డబ్బు లేకుండా ఎవరు వచ్చి టీ అడిగినా, ఇవ్వమని చెప్పారు. వారానికి ఒకసారి వచ్చి బిల్లు సెటిల్‌ చేస్తారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు సార్‌ మీరు?' అని అడిగాడు.
రమణమూర్తి కళ్లు తడి అయ్యాయి. చిన్నగా తల ఎత్తి, కాసేపు ఆకాశంలోకి చూశాడు. మనసు నిండా ఆలోచనలు ముసురుకున్నాయి. పాతికేళ్ల వెనక్కి వెళ్లిపోయాడు.

                                                                     ***

ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న సత్యవేడు మండలంలోని డెబ్భై గడపలున్న మారుమూల పల్లె అది. ఊరు మొదట్లో పెద్ద దిగుడు బావి పక్కన తాటిచెట్టు ఉంది. గాలికి ఒక తాటిమట్ట దభీమని కింద పడింది. ఇంకొకటి గాలికి అటూఇటూ ఊగుతోంది. అది నేలమీద పడితే రెండు మట్టలనూ ఇంటికి పొయ్యిలోకి తీసుకుపోదామని అక్కడే నిలబడి ఉన్నాడు ఎనిమిదో తరగతి చదివే రమణమూర్తి అలియాస్‌ రమణ.
ఇంతలో చెవికమ్మ తాత మూడో కొడుకు సర్రున వచ్చి 'రమణా రమణా, ఇంట్లో మీ చెల్లి గట్టి గట్టిగా ఏడస్తా ఉంది' అని చెప్పి తుర్రుమన్నాడు.
'మల్ల ఎప్పుడైనా వచ్చి మట్టలు ఎత్తుకుని పోవచ్చులే' అని రమణ దబదబా పరుగులు తీస్తూ ఇంటికి వెళ్లాడు.
ఎప్పుడూ ఆడుతూ పాడుతూ ఉండే నాలుగేళ్ల చెల్లెలు కుట్టి మట్టి నేలమీద పడి, దొర్లిదొర్లి ఏడుస్తూ 'ఆకలో.. ఆకలో' అని అరుస్తూ ఉంది. కూలీ నాలీ చేసుకుని బతికే అమ్మ శతవిధాల ఓదారుస్తోంది. నార మంచం పైన మూత్రనాళాల సమస్యతో బాధ పడుతున్న నాన్న దిగులుగా పడుకుని వున్నాడు.
కుట్టి ఎంతకీ ఏడుపు ఆపకపోయేసరికి అమ్మ గబగబా ఇంట్లోకి వెళ్లి ఒక సత్తు పాత్ర తెచ్చి, నీళ్లు పోసి అటూ ఇటూ తిరిగి కట్టెల పొయ్యిమీద పెట్టింది.
'అయిపోయిందిరా కుట్టీ... పొయ్యి మీద బియ్యం పెట్టినాను. పది నిముషాలు ఓపిక పట్టు... వేడివేడిగా వడ్డిస్తాను. నీళ్లు కలుపుకుని కడుపు నిండా తిందువుగానీ...'
వచ్చి నిలబడిన రమణ దిక్కు తిరిగి 'ఒరేరు రమణా, నారాయణన్న అంగడి కాడికి పోయి కేజీ నూకల బియ్యం తీసుకుని రారా. అట్లనే, శనగ గింజలు కొన్ని తీసుకుని రారా. బాగా నూరి ఊరిబిండి చేసుకుందాము. పాత బాకీ అడుగుతాడేమో, రెండు మూడు రోజుల్లో తీర్చేస్తామని చెప్పు' అని పాత సంచి ఒకటి చేతికి ఇచ్చింది.
'కుట్టీ కుట్టీ... అట్ల పోయి ఇట్ల వచ్చేస్తా. ఏడవమాకే కుట్టీ' అంటూ చెల్లిని ఓదార్చి కారు తోలుతున్నట్లు 'డురు' మంటూ వెళ్లినాడు.
సంచి ఎత్తుకొచ్చిన రమణని చూసిన అంగడి నారాయణన్న 'మీ అమ్మకు చెప్పేదానికి సిగ్గులేదు. అంగడి కాడికొచ్చి అడిగేదానికి నీకు సిగ్గులేదు' అంటూ మూడు మూరల ఎత్తు ఎగిరి దుమికినాడు.
ఖాళీ సంచి ఎత్తుకుని, అంగడి బయటకి వచ్చాడు రమణ. ఒక గజ్జి కుక్క తన మానాన తను పోతోంది. గులకరాయి ఒకటి ఎత్తుకుని కోపంగా దానిపైకి విసిరాడు. అది 'కురు కురు' అని అరుస్తూ దిక్కులు చూస్తూ వెళ్లిపోయింది.
'అత్త మీద కోపం దుత్త మీద చూపించబాకురా రమణా... మర్యాదగా అప్పు తీర్చాలని తెలియదు కానీ, ఇయ్యాల్సిన బాకీలు అడిగితే మాత్రం రోషానికి తక్కువ లేదు' అంటూ గట్టిగట్టిగా అరిచాడు అంగడి నారాయణన్న.
అక్కడ ఉండి చేసేదేమీ లేక కాళ్లీడ్చుకుంటూ నడుస్తున్నాడు. 'చెల్లి ఆకలి ఎట్ల తీర్చేదబ్బా' అని ఆలోచిస్తుంటే.. చటుక్కున ఊరికి ఉత్తరాన ఉన్న రాములవారి గుడి పక్కనున్న రేగిచెట్టు గుర్తుకొచ్చింది. 'రేగు కాయలు కొన్ని కోసి, చెల్లికిస్తే కొంచెం ఆకలైనా తీరుతుంది కదా' అని రేగి చెట్టు కాడికెళ్లాడు. చెట్టుపై ఒక్క రేగికాయ కూడా కనపడలేదు. చెట్టు చుట్టూ నాలుగైదు సార్లు తిరిగాడు.. కానీ ఒక్క కాయ కూడా దొరకలేదు. బాధగా గుడివైపు చూశాడు.
గుడి కాడ తెల్లారితోనే పెండ్లి జరిగినట్లు ఉంది. పెళ్లికి వచ్చిన వాళ్లు అందరూ వెళ్లిపోవడంతో గుడి అంతా శుభ్రంగా ఊడుస్తోంది వేలాంగణి అక్క. ఆశగా అక్కడికి వెళ్లి నిలబడ్డాడు. తీపు కానీ, కారం కానీ, పండుకానీ పైసలు కానీ అక్కడ పడి ఉంటాయేమోనని కండ్లు పెద్దవి చేసుకుని వెదుకుతూ ఉన్నాడు. 'ఏమి కావాలి రమణా?' అని అడిగింది.
'చెల్లికి ఆకలిగా ఉంది. బియ్యం కోసమని నారాయణన్న అంగడి కాడికొచ్చినాను. పాత బాకీ తీరిస్తేకానీ కొత్త అప్పు పుట్టదని చెప్పినాడు. ఉత్త చేతులతో ఇంటికి ఎట్ల పోవాలో తెలియడం లేదు' అని బాధగా చెప్పాడు.
'అయ్యో రమణా, నా దగ్గర కూడా ఏమీ లేదు కదరా' అంటూ తల వంచుకుని తోస్తోంది. ఆమె తోస్తున్న దాంట్లో అక్షింతలు కనిపించాయి. వాడు వెంటనే 'అక్కా, అక్షింతలు ఇస్తావా? కడుక్కుని తింటాము' అని అడిగినాడు.
ఆమె 'తీసుకో' అనేలోగానే, పేదోనికి పెన్నిధి దొరికినట్లు గబగబా వాటిని ఊడ్చుకున్నాడు. పాత న్యూస్‌ పేపర్లో చుట్టుకుని భద్రంగా సంచిలో పెట్టుకున్నాడు.
వాడు వాటిని తీసుకుని ఇంటివైపు పరుగులు తీస్తుంటే వేలాంగణి అక్క 'దరిద్రునికి దైవమే తోడు' అనుకుంది.
ఇంటికొచ్చాడో లేదో... సంచిలోని న్యూస్‌ పేపర్‌ని సరుక్కున లాక్కుంది కుట్టి. ఆశగా తెరిచి చూసింది. పసుపు పచ్చని అక్షింతలు కనిపించాయి. ఏడుపు మరింత పెంచింది. నారాయణన్న సామానులు ఇవ్వలేదని అమ్మకి అర్థమైపోయింది. సరసరా వెళ్లి నీళ్లున్న సత్తు గిన్నె ఒకటి తెచ్చి అందులో అక్షింతలు పోసి రెండు చేతుల్తో బియ్యాన్ని కడిగింది. కొంచెం కొంచెం తెల్లగా మెరుస్తున్న బియ్యాన్ని కుట్టి సరుక్కున లాక్కుని తినసాగింది. 'ఆకలి ఎంత పనైనా చేయిస్తుందికదా' అన్నట్లుగా చూస్తున్నాడు దిగులుగా పడుకుని ఉన్న నాన్న.
'కుట్టీ, పచ్చివి తింటే కడుపులో పురుగులు చేరుతాయి, కడుపు నొప్పి వస్తుందే పిచ్చి తల్లీ... ఇంతసేపు ఉన్నావు. ఇంకొంచెం సేపు ఉండకూడదా...' అంటూ ఆ పిల్లని పక్కకి తోసింది.
కొంచెం ఆకలి తీరిందో, లేదో.. చిన్నగా లేచి చేత్తోనే ముఖం తుడుచుకుని
'ఉడుకు ఉడుకు బువ్వ
నీళ్లేసి తాగ
నిమ్మకాయ దబ్బ
నోరంతా పుల్ల...' అంటూ పిలక జడ ఎగరేసుకుంటూ ఆడుకోవడానికి పరుగులు తీసింది. ఆ పిల్ల వయ్యారాలు చూసిన రమణ ముసిముసి నవ్వులు నవ్వినాడు.
ఆ పిల్ల వీధిలోకి పరుగులు తీసిందో లేదో... అమ్మ గబగబా పొయ్యి మీద ఉన్న ఎసరును ఎత్తి బయటికి కుమ్మరించింది. కొత్తగా పాత్రలోకి నీళ్లు, బియ్యం వేసి మళ్లీ పొయ్యి మీద పెట్టింది.
'ఇంతసేపు పొయ్యి మీద అమ్మ ఏమి పెట్టింది అబ్బా' అని వాడు తొంగితొంగి చూసినాడు. వేడినీళ్ల పొగల మధ్య మిలమిలా మెరుస్తున్న నల్లటి రాళ్లు కనిపించాయి.
అంటే...
అమ్మ... ఇంతసేపు రాళ్లు ఉడకబెట్టిందా?
ఏదో వండుతోందని చెల్లిని నమ్మించడానికి... కడుపు నిండా తినబోతామని ఆశతోనైనా చెల్లి ఏడుపు ఆపేస్తుందనే ఆలోచనతో, అమ్మ పొయ్యి మీద రాళ్లు పెట్టి ఉడికించిందని తెలుసుకుని 'అమ్మా' అంటూ ఏడుస్తూ గట్టిగా కౌగిలించుకున్నాడు.
అమ్మ వెక్కివెక్కి ఏడుస్తూ...'ఏమి చేసేది కొడుకా.. పిల్లిగానో, బల్లిగానో పుట్టినా బాగుండునేమో... ఈ దరిద్ర జన్మలు ఎత్తినాము. పైసల్లేని ప్రాణాలు అనాథ శవాలు. మీకు కడుపునిండా తిండి కూడా పెట్టలేకపోతున్నాను' అని భోరున ఏడ్చింది. అమ్మా కొడుకులిద్దరూ ఒకరిని పట్టుకుని ఒకరు ఏడ్చారు.
ఆ రోజే రమణ తన అమ్మ చేతిలో చేయి వేసి ఇలా చెప్పాడు 'నా వారు కానీ, నాకు తెలిసినవారు కానీ, నా చుట్టుపక్కల ఉన్న వారు కానీ, ఆకలి అనే పదం పలకనివ్వను. నాకు చేతనైనంత సహాయం చేసి, వారి ఆకలి తీరుస్తాను. అంతేకాదు, ఈ రోజు నుంచీ నేను కూడా ఏదో ఒకటి చిన్నపనో, పెద్దపనో చేసి, డబ్బు సంపాదిస్తా. అలాగని చదువును పక్కన పెట్టను. చదువుతూనే పనులు చేస్తా. చెల్లిని చదివినంత చదివిస్తా'

                                                                         ***

ఆ రోజు నుంచీ రమణ చిన్నచిన్న కూలీ పనులు చేస్తూ అమ్మకి చేదోడు వాదోడుగా నిలబడ్డాడు. కాల గమనంలో తండ్రి చనిపోగా, తల్లి మాత్రం రమణమూర్తితోనే ఉంటోంది. చెల్లెలు కుట్టిని నర్సింగ్‌ చదివించి, నర్సు ఉద్యోగంలో చేర్పించాడు. తను డిగ్రీ చదివి, రైల్వే పరీక్షలు రాసి, టిక్కెట్‌ కలెక్టర్‌ ఉద్యోగం సంపాదించాడు.

                                                                         ***

'ఆకలి బాధ తెలిసినవాడిని కనుక, పేదవాళ్లు ఎవరొచ్చి టీ అడిగినా లేదని చెప్పవద్దని, ఆ డబ్బులు నేనే ఇస్తానని చెప్పాను'.
'రమణమూర్తి సార్‌, టీ కొనుక్కోవడానికి డబ్బులు లేక చాలామంది భిక్షగాళ్లు ఇక్కడికి వచ్చి నిలబడి, తాగే వాళ్ల వైపు ఆకలి చూపులు చూస్తూ ఉంటారు. ఎవరైనా తీసిస్తే అమృతం తాగినంత తృప్తిగా తాగిపోతారు. నాకెప్పుడూ మీకు వచ్చిన ఆలోచన రాలేదు. ఏమాత్రం అవకాశం లేకనే కదా! వారు టీ డబ్బులు కూడా లేకుండా ఉంటారు. ఈ వ్యాపారంలో నేను కాస్తో, కూస్తో సంపాదించుకున్నాను. లేని వాడికి టీ ఇస్తే చెడిపోనులే. వసతి ఉండి వాళ్లెప్పుడైనా డబ్బులిస్తే సరి. ఇవ్వకపోయినా సరి. ఇకపై ఎవరైనా వచ్చి డబ్బులు లేవన్నా టీ ఇస్తాను. ఇకపై మీరు నాకు టీ డబ్బులు ఇవ్వకండి. నాకు ఆ అవకాశం ఇవ్వండి' అన్నాడు.
'అయితే షఫీ, నువ్వు నాకొక సహాయం చేయాలి. ఇక మీదట ఎవరైనా ఆకలి అని వస్తే దగ్గరలో ఉన్న మెస్‌లో నిండు భోజనం పెట్టించు. వారానికొకసారి నేను డబ్బు చెల్లిస్తాను' అని చెప్పాడు రమణమూర్తి.
    'ఎంత గొప్ప మనసు సార్‌ మీది, ఆకలిగా ఉన్న వాడికి అన్నం పెట్టినవాడు ఎప్పటికీ చెడిపోడు సార్‌. మీరు ఆకాశమంత ఎత్తు ఎదుగుతారు' అని కళ్ల వెంట నీళ్లు కారుతుండగా.. రమణమూర్తి చేతులు పట్టుకుని, నమస్కరించాడు షఫీ.
చల్లగా వీచిన గాలికి వేపచెట్టు వారిపైన వేప పూలు రాల్చింది.

ఆర్‌ సి కృష్ణస్వామి రాజు
93936 62821