Nov 22,2020 12:13

రాలే కన్నీటి చుక్కలకి
సమాధాన పర్చలేకపోతున్నాం .
కొన్ని చేతులు పరిమళాలు పూస్తూ
సువాసనలు వెదజల్లుతూ
కొంతకాలం తరువాత కాలం చేసే గాయానికి
కనుమరుగవుతుంటాయి.

ఇంటిలో పిల్లలు ఎగిరినట్లు
కన్నీటి నదులు కుదిపినట్లు
నవ్వుల తూనీగలు చెదిరినట్లు
ఆలోచనల పిచ్చుకలు మూగబోయినట్లు
ఏం ఉందో ఏంలేదో తెలీక
సతమతమౌతున్నప్పుడు
ఏమీ తోచనప్పుడు ఎవరు లేనప్పుడు
కష్టం గుండెమీద మరుగుతున్నప్పుడు
ఆ ఆప్యాయత
కాసింత ఉపశమనంగా ఉండేది.
జీవితం ఇలానే జాలువారుతుంది.
కొన్ని పరిచయాలు.. కొన్ని పలకరింపులు
కొన్ని సంతోషాలు.. కొన్ని కన్నీటి బొట్లు
అనుభూతి సంతకాలు మిగులుతారు.

కాలం నుదుటి మీద
పరిచయాలు అనుభవాలుగా
అనుభవాలు జ్ఞాపకాలుగా మారినపుడు
రాలిన పరిమళాలతో
కూలబడుతుంటాం.
మిగిలిన బతుకు చిత్రాలతో
తడబడుతూ అడుగులేస్తుంటాం.
 

-  గవిడి శ్రీనివాస్‌
7019278368