నటశేఖర కృష్ణకు జిల్లాతో విడదీయరాని అనుబంధం
విద్యార్థిగా, సినీ నటునిగా, రాజకీయ నేతగా సుదీర్ఘ ప్రయాణం
శోకసంద్రంలో ఉమ్మడి పశ్చిమగోదావరి వాసులు
ఉదయం ఆట రద్దు చేసి నివాళులర్పించిన డిస్ట్రిబ్యూటర్లు
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
ఒక తార నేలను వీడింది. జిల్లాతో విడదీయరాని బంధాన్ని పెనవేసుకున్న ఆ ధ్రువతార సెలవు తీసుకుంది.. సాహసం శ్వాసగా.. మొండితనం తనపేరుగా.. వైవిధ్యం, కొత్తదనం నిత్యం కోరుకునే ఆ తార కనుమరుగైంది. ఆప్యాయత, అనురాగాలతో చిన్నవారినైనా, పెద్దవారినైనా పలుకరించే ఆ సూపర్‌స్టార్ కన్నుమూత జిల్లావాసులను దుఖ:సాగరంలో ముంచింది.
సినీ వినీలాకాశంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న సూపర్‌స్టార్ కృష్ణకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాతో విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన విద్యాభ్యాసం, రాజకీయ ప్రవేశం ఇక్కడే కొనసాగగా, సినిమా రంగంలోనూ జిల్లాతో బంధాన్ని పెనవేసుకున్నారు. 1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని బుర్రిపాలెం గ్రామస్తులైన ఘట్టమనేని వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతుల పెద్ద కొడుకుగా కృష్ణ జన్మించారు. ఆయనిది రైతు కుటుంబం. తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరామకృష్ణమూర్తి సినిమాల్లోకి వచ్చినప్పుడు ఆదుర్తి సుబ్బారావు ఈ పేరును కృష్ణగా కుదించారు. చిన్నతనం నుంచి ఆయనకు ఎన్.టి.రామారావు అభిమాన నటుడు, పాతాళ భైరవి అభిమాన చిత్రం. కృష్ణను ఇంజనీరును చేయాలనే కోరిక తల్లిదండ్రులకు ఉండేది. అందుకోసం ఇంటర్మీడియట్‌లో ఎంపిసి సీటు కోసం ప్రయత్నించగా గుంటూరు కళాశాలలో దొరకకపోవడంతో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఎంపిసి గ్రూపుతో ఇంటర్‌లో చేరారు. అక్కడ మూడు నెలలే చదివి ఏలూరులోని సిఆర్.రెడ్డి కళాశాలకు మారారు. అక్కడే ఇంటర్ పూర్తి చేసి తర్వాత బిఎస్‌సి కూడా చదివాడు. సిఆర్.రెడ్డి కళాశాలలో కృష్ణ, సినీ నటుడు మురళీమోహన్ క్లాస్‌మేట్లు. ఇద్దరూ మంచి స్నేహితులు. కృష్ణ ఏలూరులో డిగ్రీ చదువుతుండగా ఏలూరులో ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు ఘనంగా పౌర సన్మానం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి కృష్ణ హాజరయ్యారు. నాగేశ్వరరావు ఆ స్థాయిలో ప్రజాభిమానం పొందగలడం చూసి ఆయన నటుడు కావడం వల్లే ఇంతటి గుర్తింపు వస్తుందని అర్థం చేసుకుని సినీ నటుడు కావాలనే అభిలాషను పెంపొందించుకున్నాడు. ఆయన డిగ్రీ పూర్తి చేశాక ఇంజినీరింగ్ కోసం ప్రయత్నించాడు. అయితే కృష్ణకు సీటు రాలేదు. దీంతో కృష్ణ విద్యార్థి జీవితానికి స్వస్థి పలికి మద్రాసు చేరుకున్నాడు. అక్కడ సినీరంగంలో ప్రవేశించాడు.
ఏలూరు నుంచే రాజకీయ రంగ ప్రవేశం
1989లో కృష్ణ కాంగ్రెస్ తరపున ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే 1991 ఎన్నికల్లో కృష్ణ గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం కోరుకున్నా తిరిగి ఏలూరులోనే పార్టీ పోటీ చేయించింది. ఆ ఎన్నికల్లో 31 వేల ఓట్ల తేడాతో ప్రత్యర్థి బోళ్ల బులిరామయ్య చేతిలో కృష్ణ ఓటమి పాలయ్యారు. 1991లో తనకు సన్నిహితుడు, రాజకీయాల్లో తనను ప్రోత్సహించిన కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ దారుణ హత్యకు గురికావడం, తాను కోరిన గుంటూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వకపోవడం, ఏలూరులో ఓటమి చెందడం వంటి కారణాలతో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. 2009 ఎన్నికల్లో వైఎస్.రాజశేఖర్‌రెడ్డి కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీకి కృష్ణ కుటుంబం నైతిక మద్దతు అందించింది. ఏలూరు మినీబైపాస్ రోడ్డు మంజూరు విషయంలో ఎంపీగా కృష్ణ చూపిన చొరవ మరువలేనిది. సినీనటుడు కృష్ణ మృతికి సంతాప సూచకంగా మంగళవారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఉదయం ఆటను రద్దు చేశారు.










