నక్షత్ర తళుకుల్లాంటి మెరుపులతో అందమైన పూలు పూసే మొక్కలు రాఖీ పూలమొక్కలు. చూడ్డానికి అచ్చం రాఖీల్లానే ఉండే ఇవి ప్యాసీఫ్లోరా కుటుంబానికి చెందిన వైవిధ్యమైన మొక్కలు. కొన్ని మొక్కలు పాదుల్లాగా, మరికొన్ని మొక్కలు గుబురుగా పొదల్లా పెరుగుతాయి. సన్నని కేసరాలు, పూ రేఖలు, పుప్పొళ్ళు విభిన్న రంగులలో, ఇంపైన ఆకారాలలో పువ్వు చూడ్డానికి చాలా గమ్మత్తుగా ఉంటుంది. జులై నుంచి నవంబర్ నెల వరకు ఈ మొక్కలు పూలు పూస్తాయి. ఒక్కో దేశంలో ఒక్కోలా వీటిని ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అలాంటి రాఖీపూల మొక్కల గురించి తెలుసుకుందాం.
సాయంత్రం వేళ రాఖీపూలు గాఢమైన సువాసనలతో అందరినీ ఆకర్షిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 500 రకాల పూలమొక్కలు లభిస్తాయి. మన దేశంలో హోమియోలో ప్లాసీఫ్లోరా ఇంకార్టీనేటా అనే మందు తయారు చేయడానికి ఈ పూలను ఉపయోగిస్తున్నారు. నరాల ఒత్తిడి తగ్గించడానికి, చక్కగా నిద్ర పట్టడానికి ఈ మందు దివ్య ఔషధంలా పనిచేస్తుంది. రష్యాలో దీన్ని కవలి స్టార్ అంటారు.
అల్లుకుపోయే మొక్కలు
ప్యాసిఫ్లోరాలో చాలా మొక్కలు పాదుజాతివి. ఇవి చక్కటి పూలతో కట్టడాలనే కాదు, చూపరుల హృదయాల్ని అల్లుకుపోతుంటాయి. ఆధారాలకు చక్కగా ఎగబాకి, సీజన్లో అందమైన పూలు పూస్తాయి. ప్రహరీ గోడలు, ఇంటి పైకప్పులు, పోర్టుకోలు, డాబా అంచులు, ఇంటిముంగిట, చలువ పందిళ్ళు, పార్కుల్లో ఈ మొక్కలు చక్కగా అల్లుకుపోయి, రంగురంగుల పూలను విరబూస్తాయి. విభిన్న వర్ణాల్లో ఉండే రాఖీపూలు అందమైన రూపు, ఆకర్షణీయమైన రంగులతో చూడగానే ఇట్టే ఆకర్షిస్తాయి.
పొద రాఖీ మొక్కలు
కొన్ని ప్యాసీఫ్లోరా మొక్కలు గుబురుగా పెరుగుతాయి. ఇలాంటి మొక్కల్ని కుండీల్లో పెంచితే చాలా అందంగా ఉంటాయి. కుండీ మధ్యలో ఒక గుంజను పాతి, దానిచుట్టూ అల్లుకుపోయేలా చేస్తే.. పొదలా పెరిగి, చక్కటి పువ్వులు విరబూస్తాయి. కాస్త ఎండ, కొద్దిగా నీడ ఉండే ప్రాంతంలో ఇవి బాగా పెరుగుతాయి. ఇవి ఉష్ణ మండల దేశాల మొక్కలు. నీటి వనరు వీటికి సమానంగా ఉండాలి.
ఇండోర్ రాఖీ పూలమొక్కలు
వందల సంఖ్యలో ఉన్న రాఖీపూల మొక్కల్లో కొన్నింటిని మాత్రమే మనం ఇంటి లోపల పెంచుకోవచ్చు. టేబుల్ వెరైటీకి చెందిన ఈ ఇండోర్ మొక్కలు కుండీల్లో పెట్టుకుని, ఇంటిలోపల పెంచుకోవచ్చు. సోదరీ సోదరుల ప్రేమకు కానుకగా రాఖీ పౌర్ణమిరోజు రాఖీలకు బదులుగా, ఈ మొక్కలను కానుకగా ఇచ్చిపుచ్చుకోవడం ఇటీవల కాలంలో ఒక అలవాటుగా మారింది.
ఫ్యాషన్ ఫ్లవర్
ప్యాసీఫ్లోరాలోనే మరొక రకం ఫ్యాషన్ ఫ్లవర్. దీని పువ్వు కాస్త చిన్నగా ఉండటంతో పాటు కాయ కూడా కాస్తుంది. అది పండితే అచ్చంగా నారింజ పండులా ఉంటుంది. లోపల గుజ్జు ఉన్న కారణంగా ఈ పండు తియ్యగా, పుల్లగా ఉంటుంది. వీటిని పక్షులు, కీటకాలు ఎక్కువగా తింటాయి. దీన్ని ప్యాషన్‌ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. ఈ పండ్లలో విత్తనాలూ ఉంటాయి. ఇతర దేశాల్లో ఫ్రూట్ సలాడ్ మెనూలో ఫ్యాషన్ ఫ్రూట్ మొక్కలూ ఉంటాయి. మన దేశంలో కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కొందరు ఈ పండ్లను తింటుంటారు. వీటి పువ్వులు కూడా ఎంతో అందంగా ఉంటాయి.
కౌరవ, పాండవుల పువ్వు
మన రాష్ట్రంలో విరివిగా లభించే రాఖీ పువ్వుల్లో కౌరవ, పాండవుల పూల మొక్క ఒకటి. కౌరవ పాండవుల పూలమొక్క పువ్వులు లేత నీలిరంగులో భలే గమ్మత్తుగా ఉంటాయి. వీటి కింది భాగంలో నూరు కేసరాలు ఉంటాయి. వీటిని కౌరవులనీ, దానిపైన కాస్త వెడల్పాటి మరో ఐదు రేఖలు ఉంటాయి వాటిని పాండవులని అంటారు. పైన ఉండే మూడు పొడి రేఖలను భీష్మ, ద్రోణ, కృపాచార్యులుగా అభివర్ణిస్తారు. ఈ పువ్వు కాస్త పెద్ద పరిమాణంలో ఉంటుంది. ఈ మొక్క ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకుంటుంది.
శ్వేత సుధ పూలు
ఈ ప్యాసీఫ్లోరా పూలమొక్క గుత్తులు గుత్తులుగా ఉండే తెల్లటి రాఖీలాంటి పూలను పూస్తుంది. పాలమీగడలాంటి తెలుపుతో ఈ పూలు ఎంతో రమణీయంగా ఉంటాయి. సుగంధ పరిమళాలను వెదజల్లే ఈ మొక్క పూలు మధ్యాహ్నం పూట ఎండకు వాడి, మరలా సాయంకాలం చల్లటి గాలికి చక్కగా నిలదొక్కుకుంటాయి.
భానుమంజరి పూల మొక్క
అచ్చంగా సూర్యుడి నుంచి ప్రభాత కిరణాలు ప్రకాశిస్తున్నట్లుగా ఈ పువ్వు రేఖలు ఉంటాయి. అందుకే దీన్ని భానుమంజరి పూల మొక్క అని పిలుస్తారు. మిగతా ప్యాసిప్లోరా పూలతో పోలిస్తే వీటి రేఖలు కాస్త దళసరిగా, విభిన్నంగా, అందంగా, మన్నికగా ఉంటాయి. పువ్వులు లేతవయొలెట్ రంగులో ఉంటాయి.
నక్షత్ర పూల మొక్క
ఈ ప్యాసిఫ్లోరాలో చుట్టూతా రేఖలుండి, మధ్యలో ఉండే సన్నటి కేసరాల్లాంటి రేఖలు బల్బు ఆకారంలో వేలాడుతుంటాయి. ముదురు ఎరుపు రంగులో పువ్వులు చీకట్లోనూ మెరుస్తూ ఉంటాయి. అందుకే వీటిని నక్షత్ర రాఖీ పూలమొక్కలు అంటారు.
రేఖ సింధూరం
దీని పువ్వు నాజూగ్గా ఉంటుంది. రేఖలు మాత్రం పొడవుగా, వెడల్పుగా ముదురు సింధూర వర్ణంలో ఉంటాయి. ఆకుపచ్చని పాదుకు వీటి పువ్వులు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. తక్కువ పువ్వులు పూసే ఈ మొక్క ఇంటి ముంగిట ఎంతో అలంకారప్రాయంగా ఉంటుంది. పూల సీజన్ పూర్తయ్యాక రాఖీపూల పాదును కత్తిరిస్తే, మరలా సీజన్ నాటికి నెమ్మదిగా పెరిగి, పూలు పూస్తాయి. మొక్క చాలా సంవత్సరాలు బతుకుతుంది.
- చిలుకూరి శ్రీనివాసరావు
89859 45506