Mar 09,2023 00:37
కేక్‌ కట్‌ చేస్తున్న తెలుగు మహిళా నాయకులు, చిత్రంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

      ప్రజాశక్తి-మార్టూరు రూరల్‌: రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించేందుకు మహిళలు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందని టిడిపి బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఇసుక దర్శిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పర్చూరు నియోజకవర్గానికి చెందిన మహిళా ప్రతినిధులతో కనెక్ట్‌ సిబిఎన్‌ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా డ్వాక్రా గ్రూపుల వ్యవస్థను టిడిపి హయాంలోనే ప్రవేశపెట్టినట్లు తెలిపారు. తద్వారా మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించారని పేర్కొన్నారు. మహిళలకు ఆస్తి హక్కు, రాజకీయ రంగంలో మహిళలకు ప్రవేశం కల్పించి అనేకమైన ఉన్నత పదవులను వారికి కేటాయించి అత్యున్నతమైన స్పీకర్‌ పదవిని కూడా మహిళలకు టిడిపి ప్రభుత్వం అవకాశం ఇచ్చిందన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని, రానున్న ఎన్నికలలో మహిళలు టిడిపికి అండగా నిలిచి చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం క్యాంప్‌ కార్యాలయంలో భారీ కేక్‌ను కట్‌ చేసి మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన మహిళా ప్రజా ప్రతినిధులు, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.