Oct 30,2023 23:29
సమావేశంలో మాట్లాడుతున్న టిడిపి కనిగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ఉగ్ర

ప్రజాశక్తి-కనిగిరి: రాక్షస పాలనను అంతమొందించేందుకు ఈ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌ఛార్జ్‌ డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో సోమవారం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కనిగిరి నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి అధిక సంఖ్యలో టిడిపి శ్రేణులు హాజరయ్యారు. ఈ సమా వేశంలో ముందుగా నియోజకవర్గ పరిశీలకులు గంగోడు నాగేశ్వరరావు, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి టీడీపీ నాయకులతో కలిసి ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కొత్తగా ఓటర్‌ జాబితా వచ్చిన దృష్ట్యా ఓటర్‌ జాబితాను పరిశీలించుకోవాలని, ఓటర్‌ లిస్టులో మార్పులు గమనించాలని, డబ్లింగ్‌ ఒకే నంబర్‌ మీద ఎక్కువ ఓట్లు ఉన్నాయేమో పరిశీలించాలని నాగేశ్వరరావు తెలియజేశారు. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని జనసేన పార్టీ నాయకులను కలుపుకుని నిర్వహించాలన్నారు. స్కిల్‌ డెవలెప్మెంట్లో ఒక్క సాక్ష్యం లేకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును కక్షపూరితంగా జైల్లో పెట్టారన్నారు. చంద్రబాబుకు దేశ విదేశాల్లో మద్దతు లభించడం చూస్తుంటే ఆయనకు ఉన్న ఆదరణ ఇట్టే అర్థం అవుతోందన్నారు. 40 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉండి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకే న్యాయం జరగకుండా చేస్తున్నారంటే జగన్మోహన్‌రెడ్డి వ్యవస్థలను ఏ విధంగా మేనేజ్‌ చేస్తున్నారో అనేది రాష్ట్ర ప్రజలు ఆలోచన చేస్తున్నారని అన్నారు. సొంత బాబారును హత్య చేసి, సొంత తల్లి, చెల్లినే అవకాశంగా వాడేసుకుని వదిలేశాడంటే భవిష్యత్తులో అందరినీ వాడుకుని ఇలాగే వదిలేస్తారన్నారు. హత్యలు చేసిన వారు బెయిల్‌ మీద తిరుగుతున్నారు. జగన్‌ మోహన్‌రెడ్డి అయితే కొన్ని సంవత్సరాల పాటు కోర్టుకు కూడా వెళ్లకుండా ఉన్నారంటే వ్యవస్థలు ఏ విధంగా నిర్వీర్యం అయ్యాయో అర్థం చేసుకోవచ్చునన్నారు. డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ కనిగిరిలో గెలిచేది తానేనని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు. వైసిపి ప్రభుత్వంపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను ఎవరూ అడ్డుకోలేరన్నారు. మన ఊరు మన ఉగ్ర కార్యక్రమానికి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. ఈ కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నామని, అధికారంలోకి వచ్చిన తరువాత ఆ సమస్యలకు పరిష్కారం చూపిస్తామని అన్నారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్‌ ఇన్‌ఛార్జులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, యూనిట్‌ ఇన్‌ఛార్జులు, బూత్‌ ఇన్‌ఛార్జులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.