Jan 03,2021 13:24

      మదనంతపురంలో కృష్ణయ్య, రమాదేవి అనే భార్యాభర్తలు ఉండేవారు. వారికి శీను, ఉష, గిరి అనే పిల్లలు ఉన్నారు. ఉన్నంతలో చాలా సంతోషంగా ఉండేవారు. శీను, ఉష తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేవారు. కానీ గిరి ఊర్లో అందరితో గొడవలు పడుతూ జులాయిగా తిరుగుతుండేవాడు.
     ఒకరోజు ఆటలో తనను ఓడించి నందుకు స్నేహితుడి తల పగలగొట్టాడు గిరి. దాంతో శ్రీను తమ్ముడిని గట్టిగా మందలించాడు. అంతే ఇంట్లో నుంచి చెప్పా పెట్టకుండా అడవిలోకి పారిపోయాడు. గిరీని వెతకడానికి వెళ్లిన కుటుంబసభ్యులు ఒక్కరు కూడా అడవిలో నుంచి తిరిగిరాలేదు. దీంతో కంగారుపడిన ఉష వెతకడానికి వెళ్లింది. అడవిలో చెట్లు, పుట్టలు, వంకలు, వాగులు, కొండాకోనలు మొత్తం వెతికి అలసిపోయింది. దాహం వేస్తుండటంతో మర్రిచెట్టు దగ్గర గుంతలో ఉన్న నీళ్లు తాగడానికి వెళ్లింది. అంతే గుంతలో నుంచి రెండు భయంకరమైన చేతులు గట్టిగా పట్టుకున్నాయి ఉషని. ఉలిక్కిపడి తలెత్తి చూసిన ఉషకు పెద్దపువ్వు తలగా, తీగ ఆకులన్నీ రంపాలుగా కొస్సిగా చేతులుగా కనిపించాయి. తీగలతో గట్టిగా చుట్టేసుకుని క్షణాల్లోనే మర్రిచెట్టు ఊడల దగ్గరకు ఉషను ఎత్తుకొచ్చింది రాకాసి తీగ.
     'రక్షించండి! రక్షించండి!!' అని కేకలేస్తున్న ఉషను 'ఏమి బాలికా! నిన్ను నీవు రక్షించుకోలేవా? మరి మీ అమ్మానాన్నలను, మీ అన్నదమ్ములని ఎలా రక్షించుకుంటావు?' అంది రాకాసితీగ.
'సరే రాకాసితీగా! నా తెలివితేటలతో రక్షించుకోగలను' అంది ఉష ధైర్యంగా.
'అంత తెలివైనదానివైతే మూడు ప్రశ్నలు అడుగుతాను. ఏ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పకపోయినా మీ కుటుంబం మొత్తాన్ని తినేస్తా!' అంది రాకాసితీగ.
'వెయ్యి సంవత్సరాలుగా ఈ అడవిలో జంతువుల్ని, పక్షుల్ని, మనుషుల్ని తింటూ జీవిస్తూన్నా! ఇప్పటికైనా ముని శాపం నుంచి విముక్తి కలిగితే బాగుండు!' అనుకుంది రాకాసితీగ.
'మనిషి ఒక వస్తువును కొన్నప్పుడు, అమ్మినప్పుడు నష్టపోతాడు ఏంటది..?' అంది రాకాసితీగ.
బాగా ఆలోచించిన ఉష 'బంగారం' అని జవాబు చెప్పింది.
'నీ జవాబు సరైనదే బాలికా! రెండో ప్రశ్న: మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా పెరగని అవయవాలు ఏవి..?' అంది రాకాసితీగ.
'ఏంది ...? ఈ రాకాసితీగ ఇంత కఠినంగా అడుగుతుంది. మనిషిలో పెరగని అవయవం ఏమై ఉంటుంది?' అంటూ రాకాసితీగ వైపు చూసిన ఉషకు దాని ముఖంలో కళ్లు భయంకరంగా కనిపించాయి. అంతే ఇంకేమీ ఆలోచించకుండా 'కళ్ళు' అంది ఉష.
'సరైన జవాబు చెప్పావు బాలికా! ఇదే చివరి ప్రశ్న: మూడవ జవాబు చెప్తే నీ కుటుంబాన్ని వదిలేస్తా! ''లోకంలో ఉన్న జీవులన్నీ లెక్కకడితే ఎన్ని ఉంటాయో.. అన్ని జీవులు ఏ ప్రాణిలో ఉంటాయి?'' అని అడిగింది రాకాసితీగ.
ముందు రెండు ప్రశ్నలు మనిషికి సంబంధించినవే అడిగింది. కాబట్టి దీని జవాబు మనిషికి సంబంధించిందే అయి ఉంటుంది అనుకుని 'మనిషి' అని జవాబు చెప్పింది ఉష.
'మూడు జవాబులు సరిగ్గా చెప్పావు. మీ కుటుంబాన్ని కాపాడుకున్నావు. నన్ను శాపము నుండి విముక్తిరాలిని చేశావు!' అని మెచ్చుకొని, మాయమైంది రాకాసితీగ.
అక్కను చూసిన వెంటనే గిరి పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్లమీద పడ్డాడు.
'చూశావా! నీవు చేసిన పనికిమాలిన పనివల్ల మన కుటుంబం ప్రమాదంలో పడింది. ఇకపైనన్నా బుద్ధిగా ఉండు' అంది ఉష.
ప్రాణాలతో బయటపడ్డ తన కుటుంబంతో ఇంటిదారి పట్టింది ఉష.
 

- పుల్లా రామాంజనేయులు
9491851349