ప్రజాశక్తి-కాకినాడ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని పరిరక్షించకపోతే మణిపూర్ తరహాలో దేశవ్యాప్తంగా అల్లర్లు సష్టించేందుకు మనువాద రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చేటందుకు బిజేపి ప్రయత్నిస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు హెచ్చరించారు. శనివారం స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘము ఆధ్వర్యంలో దళితులపై దాడులు, చట్టాల అమలు, భూమి సమస్యలు, స్మశాన సమస్యలు, అసైన్మెంట్ భూముల చట్ట సవరణపై అవగాహన సదస్సు వ్యవసాయకార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టేకుమూడి ఈశ్వరరావు, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు బి.సురేష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన దడాల సుబ్బారావు మాట్లాడుతూ దేశంలో బిజెపి పాలన మొదలైన తర్వాత అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కనపెట్టి, రాజ్యాంగంలో ఉన్న ముఖ్యమైన అంశాలను పక్కకు తోస్తూ మనువాద రాజ్యాంగము అమలు చేస్తున్నారని విమర్శించారు. మనువాద రాజ్యాంగాన్ని అమలు చేయడం అంటే బ్రాహ్మణ పెత్తనాన్ని దేశం మొత్తం చలాయించాలని బిజెపి ప్రభుత్వం చూస్తుందని, ఇది చాలా దుర్మార్గపు చర్య అన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించకపోతే దేశాన్ని ఐక్యంగా ఉంచలేమన్నారు. దళితులపైన ముస్లిముల పైన చివరికి క్రైస్తవుల పైన దాడులు అరికట్టాలంటే, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాపాడుకోవాలన్నారు. గుజరాత్ రాష్ట్రంలో 2000లో అప్పటి మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏం జరిగిందో ఇప్పుడు మణిపూర్లో అదే సంఘటన చోటు చేసుకుంటున్నాయన్నారు. రాష్ట్రంలో 9/ 77 యాక్ట్ అసైన్మెంట్ భూములకు రక్షణగా ఉందని, అలాంటి చట్టన్ని జగన్ ప్రభుత్వం సవరణ చేసి దళితుల చేతిలో భూములు లేకుండా చేస్తున్నారని విమర్శించారు. తక్షణమే ఈ జిఒ వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దళిత సంఘం సీనియర్ నాయకులు అయితాబత్తుల రామేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో దళితులకు చనిపోయిన తర్వాత పాతి పెట్టడానికి శ్మశానం కూడా పెద్ద సమస్యగా ఉందని విమర్శించారు. సిపిఎం జిల్లా కన్వీనర్ మోర్త రాజశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో గతంలో ప్రభుత్వాలు పేదలకు పెంచిన అసైన్మెంట్ భూములు అన్యాక్రాంతం అయ్యాయని, కొన్నిచోట్ల భూములు ఉన్నా పట్టాలు లేవని ఈ సమస్యల కోసం సంవత్సరాల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్న పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ సదస్సులో దళితులకు సంబంధించిన 22 డిమాండ్లను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కెఎస్.శ్రీనివాస్ ప్రవేశపెట్టగా సభ్యులందరూ ఆమోదించారు. ఈ సదస్సులో దళిత నాయకులు సబ్బతి పనేశ్వరరావు, కాశి బాలయ్య, మోతా కృష్ణమూర్తి, వ్యవసాయం కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి కె.సింహాచలం, విప్పర్తి శ్రీనివాస్, పొలాపూర్ గోపాలకృష్ణ, దుప్పి అదృష్టదీపుడు పాల్గొన్నారు.










