Jul 10,2021 06:10

    ప్రజల శాంతి భద్రతల సాకుతో సమావేశమయ్యే హక్కును కుదించడానికి రాజ్యాంగం కానీ లేదా ప్రజాస్వామ్య దేశం లోని ఏ చట్టం గానీ విపరీత అధికారాలను ఇవ్వలేదు. 2012లో రామ్‌లీలా మైదాన్‌ సంఘటన వర్సెస్‌ హోం కార్యదర్శి, ఇతరుల కేసులో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను ఇక్కడ గుర్తు తెచ్చుకోవడం సముచితం. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే సిఆర్‌పిసి లోని 144వ సెక్షన్‌ నిబంధనలను ఉపయోగించాలని భావించాల్సి వుందని జస్టిస్‌ స్వతంత్ర కుమార్‌ వ్యాఖ్యానించారు. ప్రజల శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా చూసే ఉద్దేశ్యంతో ఈ అత్యవసర అధికారాలను ఉపయోగించాల్సి వుంటుంది. అయితే ప్రజా భద్రత అంటే ఏంటనేది స్పష్టంగా నిర్వచించాల్సి వుంది.
   'అసమ్మతిని అణచివేయాలనే ఆతృతలో ప్రభుత్వం వున్నందున, రాజ్యాంగబద్ధంగా హామీ కల్పింబడిన నిరసన హక్కుకు, తీవ్రవాద కార్యకలాపాలకు మధ్య గల రేఖ కొంత మేర మసకబారినట్లుగా కనిపిస్తోంది. ఈ ధోరణి ఇలాగే కొనసాగినట్లైతే, అది ప్రజాస్వామ్యానికి దుర్దినం కాగలదు.' అని ఈశాన్య ఢిల్లీలో హింసాకాండకు సంబంధించిన యుఎపిఎ కేసులో ముగ్గురికి బెయిల్‌ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏ రూపంలో అసమ్మతినైనా జాతి వ్యతిరేకమని పేర్కొనే చాలా కేసులకు ఈ వ్యాఖ్య వర్తిస్తుంది. ఆ రకంగా, ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు, ఇటువంటి స్వేచ్ఛను నియంత్రించే ప్రభుత్వ అధికారాలను నిరసిస్తూ ప్రజలు సమావేశమవడానికి, నిరసన తెలపడానికి రాజ్యాంగబద్ధంగా వారికి గల హక్కును మరోసారి తెరపైకి తెచ్చింది.
     రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో సమావేశమయ్యే స్వేచ్ఛ అనేది ప్రజా జీవితంలో మైలురాయి వంటిది. సమిష్టి లక్ష్యాలను సాధించడానికి, ఒకరితో మరొకరు కలిసి కార్యకలాపాలు చేపట్టేందుకు ఇటువంటి స్వేచ్ఛలు లేదా హక్కులు వీలు కల్పిస్తాయి.
    ఏ ప్రభుత్వమైనా మొదటగా నియంత్రించే హక్కులు లేదా స్వేచ్ఛల్లో ఇవే అగ్ర భాగాన వుంటాయి. పౌరులు సమావేశమవడానికి భారత రాజ్యాంగం స్వేచ్ఛ కల్పించింది. శాంతియుతంగా, ఎలాంటి ఆయుధాలు లేకుండా సమావేశం కావడానికి ప్రతి పౌరునికి హక్కు వుందని రాజ్యాంగంలోని 19(1) (బి) అధికరణ హామీ కల్పిస్తోంది.
     సమావేశమయ్యే హక్కును కల్పించే రాజ్యాంగ నిబంధనలకు, ఈ హక్కును నియంత్రించే క్రిమినల్‌ ప్రొసీజర్‌ చట్ట నిబంధనలకు మధ్య అసంబద్ధత వుంది. అయితే, ఈ అసంబద్ధత అనేది వలసవాద వారసత్వంగా వచ్చినది. ఇటువంటి నిరంకుశ నిబంధనలను ప్రజాస్వామిక దేశం అనుసరించరాదు.
    సమకాలీన భారతదేశంలో, స్వేచ్ఛగా సమావేశమయ్యే హక్కును క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సిఆర్‌పిసి) గణనీయంగా ప్రభావితం చేస్తోంది. ర్యాలీలను, సమావేశాలను నియంత్రించేందుకు (అవి ప్రారంభమవడానికి ముందుగా లేదా ప్రారంభమైన తర్వాత కూడా) పోలీసులు ఈ సిఆర్‌పిసి నిబంధనలను ఉదహరిస్తూ వుంటారు.
    అయితే, ప్రజా భద్రతకు ప్రమాదముందని స్పష్టంగా వెల్లడైనపుడే ఇటువంటి ఆంక్షలతో కూడిన నిబంధనలను ఉపయోగించాల్సి వుంటుంది. ప్రజల శాంతి భద్రతలకు ప్రమాదమనేదాన్ని అస్పష్టంగా నిర్వచించలేం, లేదా ప్రభుత్వ వైఖరికి, రాజ్యాంగంలో హామీ కల్పించబడిన పౌరుల హక్కులను అణచివేసే ఉద్దేశ్యానికి అనుగుణంగా వుండేలా చూడలేం.
    రాజకీయాలు, పాలన అనేవి అత్యంత జాగ్రత్తగా రూపొందించిన కళ వంటివి. ఏదో ఒక సాకుతో రాజ్యాంగబద్ధంగా హామీ కల్పించిన హక్కులను నిరాకరించేందుకు తప్పించుకునే దారులు వెతకడం కన్నా రాజ్యాంగబద్ధతను గౌరవించాలి. తరచుగా ప్రభుత్వ రాజకీయ ప్రాజెక్టులకు ఇది సరిపోతుంది.
     బాబూలాల్‌ పరాటే వర్సెస్‌ మహారాష్ట్ర ప్రభుత్వం కేసులో... సమావేశమయ్యే స్వేచ్ఛకు, ఈ స్వేచ్ఛను కుదించే అధికారానికి మధ్య గల వైరుధ్యాన్ని సుప్రీంకోర్టు చెప్పింది. ఇటువంటి సమావేశాలపై ముందుగానే ఆంక్షలు విధించడానికి ప్రజల శాంతి భద్రతలను ఒక ఉదాహరణగా పేర్కొనడాన్ని సుప్రీం అంగీకరించింది. అయితే, 144వ సెక్షన్‌ అనేది చట్టబద్ధంగా చేసే ఏ చర్యను అణచివేయరాదని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రజల శాంతి భద్రతలకు ప్రమాదం వాటిల్లుతుందని నిజాయితీగా భావించినపుడు మాత్రమే ముందస్తు చర్య తీసుకోవడానికి అనుమతించాలని పేర్కొంది.
ప్రజల శాంతి భద్రతల సాకుతో సమావేశమయ్యే హక్కును కుదించడానికి రాజ్యాంగం కానీ లేదా ప్రజాస్వామ్య దేశంలోని ఏ చట్టం గానీ విపరీత అధికారాలను ఇవ్వలేదు. 2012లో రామ్‌లీలా మైదాన్‌ సంఘటన వర్సెస్‌ హోం కార్యదర్శి, ఇతరుల కేసులో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను ఇక్కడ గుర్తు తెచ్చుకోవడం సముచితం. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే సిఆర్‌పిసి లోని 144వ సెక్షన్‌ నిబంధనలను ఉపయోగించాలని భావించాల్సి వుందని జస్టిస్‌ స్వతంత్ర కుమార్‌ వ్యాఖ్యానించారు. ప్రజల శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా చూసే ఉద్దేశ్యంతో ఈ అత్యవసర అధికారాలను ఉపయోగించాల్సి వుంటుంది.
     అయితే ప్రజా భద్రత అంటే ఏంటనేది స్పష్టంగా నిర్వచించాల్సి వుంది. ప్రజల శాంతి భద్రతలు, ప్రశాంతతకు సంబంధించి రాజ్యాంగంలో అరకొరగానైనా ఒక రేఖ గీయాల్సిన అవసరం వుంది. అది - తీవ్రమైన, దూకుడుతో కూడిన, దేశ భద్రతకే ప్రమాదం కలిగించగలిగే రీతిలో శాంతి భద్రతలను విచ్ఛిన్నం చేసేవారికి, స్థానిక సమస్యలతో స్వల్ప రీతిలో శాంతికి భంగం కలిగించే వారికి - మధ్య తేడాను పేర్కొనగలిగేలా వుండాలి. ఇందుకోసం తరతమ స్థాయిల్లో తేడాలు వుండాలని 1950లో రమేష్‌ థాపర్‌ వర్సెస్‌ మద్రాసు ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది.
పౌరహక్కుల రేఖను విస్తరించే క్రమంలో అమెరికా రాజ్యాంగంలో చేసిన మొదటి సవరణ ఏంటనేది ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి వుంది. ''ప్రజలు శాంతియుతంగా సమావేశమయ్యేందుకు గల హక్కును కుదించడానికి, సమస్యల పరిష్కారానికై ప్రభుత్వానికి పిటిషన్‌ ఇవ్వడానికి కాంగ్రెస్‌ ఎటువంటి చట్టాన్ని చేయదు.'' అని ఆ సవరణ పేర్కొంటోంది. అమెరికా రాజ్యాంగానికి చేసిన ఈ చారిత్రక మొదటి సవరణ స్ఫూర్తిని భారత ప్రజాస్వామ్యం కూడా పొందాల్సి వుంది. సమావేశపు హక్కును కుదించే ప్రభుత్వ ఆంక్షలను ''స్పష్టమైన-మరియు-ప్రస్తుత ప్రమాదం'' నిబంధన ప్రాతిపదికగా పరీక్షించాల్సి వుంది.
పౌరుల స్వేచ్ఛకు, ప్రజా భద్రతకు మధ్య జాగ్రత్తగా ''ప్రయోజనాల సమతుల్యత'' సిద్ధాంతాన్ని వర్తింపచేయాల్సి వుంది.
    సమావేశమయ్యే హక్కు, ఇటువంటి ఇతర హక్కులన్నీ భారత రాజ్యాంగం ప్రకారం సంపూర్ణమైనవి కావనేది వాస్తవం. ఈ హక్కులన్నీ ''సహేతుకమైన ఆంక్షలకు'' లోబడి వుండేలా చూసేందుకు రాజ్యాంగం ప్రభుత్వానికి అధికారాలు ఇచ్చింది. సమావేశం నిర్వహించుకుంటామని అనుమతి తీసుకుని, కొన్ని శక్తులు అల్లర్లకు పాల్పడ్డాయని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ముప్పు వాటిల్లందని పేర్కొంటూ అదే విధంగా సమావేశం నిర్వహణ కోసం అనుమతి కోరిన మరొకరకి అనుమతిని నిరాకరించిన పరిస్థితుల్లో 1973లో హిమత్‌ లాల్‌ కె.షా వర్సెస్‌ అహ్మదాబాద్‌ పోలీసు కమిషనర్‌, ఇతరుల కేసులో సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇలా పేర్కొంది.
    ''.....శాంతియుతంగా, నిరాయుధులుగా సమావేశం కావడానికి పౌరులందరికీ ప్రాథమిక హక్కును రాజ్యాంగ నిర్మాతలు ఇవ్వడంలో ఆశ్యర్యమేమీ లేదు. రాజ్యాంగం అమల్లోకి రావడానికి ముందు సమావేశమయ్యే హక్కును కుదించడం లేదా ఎత్తివేయడం చేయవచ్చు. ఇప్పుడు, 19(3) అధికరణ పరిధిలో సహేతుకమైన ఆంక్షలు విధించడం మినహా మరేం చేయలేం. అయితే, సహేతుకతకు పరీక్ష అనేది ''సరైనదిగా, న్యాయంగా, స్వచ్ఛంగా, ఏకపక్షంగా కాకుండా, ఊహాజనితంగా లేకుండా, అణచివేతకు గురి చేసేలా కాకుండా వుండాలి.'' అని 1978లో మనేకా గాంధీ వర్సెస్‌ భారత ప్రభుత్వం కేసులో సుప్రీం కోర్టు పేర్కొంది.
     చట్ట ప్రకారం చర్యలు చేపట్టడంలో ప్రజాస్వామిక దేశం చాలా జాగ్రత్తగా వుండాలని హెచ్చరిస్తూ, 1978లో మాధవ్‌ హయవదన్‌ రావు హోస్కోట్‌ వర్సెస్‌ మహారాష్ట్ర ప్రభుత్వం కేసులో సుప్రీం కోర్టు ''స్వేచ్ఛా కాముకులు, న్యాయ పరిరక్షకులందరికీ చట్టం ద్వారా స్థాపించబడిన పద్ధతి, విధి విధానాలు అంటే చాలా లోతైన అర్ధం కలిగిన పదాలు.'' అని వాఖ్యానించింది.
    అందువల్ల, సమావేశమయ్యే హక్కుపై సహేతుకమైన ఆంక్షలు విధించడానికి ప్రజా భద్రతకు గల ముప్పు ఏంటనేదానిపై ఏకపక్షంగా లేదా ఉనికిలో లేని పరిస్థితులను పేర్కొనడాన్ని భారత రాజ్యాంగం అనుమతించదని భారత న్యాయస్థానాల నుండి ఊహించవచ్చు.
కనీస దాడి సూత్రం ఆధారంగానే ఆంక్షలు వుండాలి... అంటే, అప్పుడున్న పరిస్థితుల్లో అనివార్యమైన రీతిలోనే ఆంక్షలు విధించాల్సి వుంటుందని రామ్‌లీలా మైదాన్‌ కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
    ప్రజా భద్రత లోపించడం అంటే ప్రజల శాంతి భద్రతలకు తీవ్రంగా భంగం కలగడమే. సాధారణ జన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేయడమే. ఇతరుల భద్రతను ప్రభావితం చేసే ఏ చర్య అయినా ప్రజల శాంతి భద్రతలను ఉల్లంఘించినట్లుగా భావించలేం.
సమావేశమయ్యే హక్కుపై ఆంక్షలను సమర్ధించుకోవడానికై శాంతి భద్రతలకు ఎదురయ్యే సవాలును ప్రజా భద్రతకు ముప్పుగా పరిగణించలేం. వాస్తవానికి, శాంతి భద్రతలను దెబ్బతీసే కార్యకలాపాలు ప్రజా భద్రతను ప్రభావితం చేయాల్సిన అవసరం లేదని 1966లో డాక్టర్‌ రామ్‌ మనోహర్‌ లోహియా వర్సెస్‌ బీహార్‌ ప్రభుత్వం కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
    ప్రజా భద్రత లోపించడం అంటే ప్రజల శాంతి భద్రతలకు తీవ్రంగా భంగం కలగడమే. సాధారణ జన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేయడమే. ఇతరుల భద్రతను ప్రభావితం చేసే ఏ చర్య అయినా ప్రజల శాంతి భద్రతలను ఉల్లంఘించినట్లుగా భావించలేం.
 

/ వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు /

కె. నాగేశ్వర్‌

ఐ. ప్రసాదరావు