Oct 07,2023 00:02

జెండాను ఆవిష్కరిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్‌ : భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవడం కోసం ఉద్యమాలకు సన్నద్ధం కావాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) పల్నాడు జిల్లా కార్యదర్శి జి.రవిబాబు అన్నారు. సంఘం ఏర్పడి 25 ఏళ్లవుతున్న సందర్భంగా మండలంలోని రెంటపాళ్లలో శుక్రవారం జెండాను నాయకులు డి.ప్రభాకరరావు ఎగురవేశారు. అనంతరం రవిబాబు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం హరిస్తోందని, మనువాదాన్ని అమలు చేసేందుకు పూనుకుందని విమర్శించారు. అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చేందుకు కుట్రలు పన్నారన్నారు. రాష్ట్రంలోనూ దళితులపై దాడులు, అత్యాచారాలు తీవ్రంగా పెరుగుతు న్నాయని, దాడులు చేసిన వారికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చే విధానాన్ని అమలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. దళితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి డిసెంబర్‌ 4న ఢిల్లీలో జరగనున్న మహాధర్నాకు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు బి.రామారావు, జె.భగత్‌, డి.నాగేశ్వరరావు, పి.వెంకటేశ్వర్లు, సిహెచ్‌.ప్రసాదు పాల్గొన్నారు.
విశ్రాంత ఉపాధ్యాయులు కోటేశ్వరరావు మృతి
ప్రజాశక్తి-ముప్పాళ్ల : విశ్రాంత ఉపాధ్యాయుడు, యుటిఎఫ్‌ నాయకులు కోండ్రు కోటేశ్వరరావు (90) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. మండలంలోని తొండపికి చెందిన కోటేశ్వరరావు 35 ఏళ్లపాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉపాధ్యాయ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాడేవారని పలువురు నివాళులర్పించారు.