రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి
- సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్
ప్రజాశక్తి - ఆత్మకూర్
ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో మతోన్మాద రాజకీయం, కార్పొరేట్ దోపిడీ కవల పిల్లల్లా అవతరించాయని, దీనివల్ల దేశంలో దౌర్జన్యం హెచ్చరిల్లుతోందని,వీటి నుంచి రాజ్యాంగాన్ని రక్షించుకొని దేశాన్ని కాపాడు కోవడానికి ప్రజలు పోరాటాల్లోకి వచ్చేందుకు విస్తృతంగా ప్రచారం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్ పార్టీ నాయలకు, కార్యకర్తలకు సూచించారు. ఆదివారం పట్టణంలోని డాక్టర్ ఏ.ధనుంజయ మీటింగ్ హాల్‌లో సిపిఎం పట్టణ జనరల్ బాడీ సమావేశం నాయకులు డి రామ్ నాయక్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమాఖ్య స్ఫూర్తిపై దాడులు పెరిగాయన్నారు. మోడీ విధానాలను వ్యతిరేకించిన వారిని దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారని తెలిపారు. దేశంలో 140 కోట్ల మంది ప్రజలు తమ వెనుక ఉన్నారనే భ్రమలో మోడీ ఉన్నారని, కానీ దేశంలో బిజెపికి 37 శాతం మంది మాత్రమే ఓట్లు వేశారని, 63 శాతం వ్యతిరేకించారని చెప్పారు. బిజెపి ఇతర ప్రభుత్వాలను గవర్నర్లతో అస్థిర పరచడం, ప్రతిపక్ష నాయకులను సిబిఐ, ఈడీల పేరుతో హింసించడం ఆ పార్టీ విధానంగా మారిం దన్నారు. కార్పొరేట్లకు పన్ను మినహాయింపు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకుల నుంచి బడా వ్యాపారులు తీసుకున్న రూ.11 లక్షల కోట్లు వసూలుకు ప్రత్యామ్నాయ విధానాలు అమలు చేస్తేనే దేశానికి మేలు జరుగుతుందన్నారు. కాబట్టి ప్రత్యామ్నాయ విధానాలతో దేశానికి మేలు జరుగుతుందని, అందుకు బలమైన ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. దేశాన్ని చిన్నాభిన్నం చేసే దుర్మార్గమైన బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ విధానాలను అడ్డుకోవడానికి ప్రజలంతా ఏకం కావాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి. యేసురత్నం, సీనియర్ నాయకులు ఏ.రాజశేఖర్, పట్టణ కార్యదర్శి ఏ.రణధీర్, నాయకులు మీనాక్షమ్మ, శివమ్మ, పుల్లమ్మ, అక్కమ్మ, లక్ష్మీదేవి, సంజీవ రాయుడు, స్వాములు, సురేంద్ర, మాభాష, సుధాకర్, వీరన్న, వెంకటేశ్వర్లు, మల్లయ్య, గణపతి, రవి, మహమ్మద్, శివుడు తదితరులు పాల్గొన్నారు.










