Nov 09,2022 23:35

  • కెవిపిఎస్‌ నేతలు పాటూరు, మాల్యాద్రి

ప్రజాశక్తి - ఉయ్యూరు
కేంద్రంలో అధికారంలో ఉన్న మతోన్మాద బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని మాజీ ఎంఎల్‌ఏ, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ఎంఎల్‌ఎ పాటూరు రామయ్య, కెవిపిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి విమర్శించారు. కేంద్రం విధానాలతో ఆకలి, అంటరానితనం, అణచివేత, కులాధిపత్య ధోరణులు, అత్యాచారాలు, సాంఘిక బహిష్కరణలు, అసమానతలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దళిత హక్కుల పరిరక్షణకు పోరాటాలే శరణ్యమన్నారు. కెవిపిఎస్‌ కష్ణాజిల్లా 6వ మహాసభ అమరజీవి నిమ్మాది ఏడుకొండలు (ఉయ్యూరు) ప్రాంగణంలో బుధవారం జరిగింది. ఈసందర్భంగా పాటూరు మాట్లాడుతూ పోరాటాల ద్వారా సాధించుకున్న జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ సిఫార్సులను పాలకులు అమలు చేయడం లేదన్నారు. పెద్దఎత్తున పోరాటాలు నిర్వహించి ప్రభుత్వాల మెడలు వంచి కమిషన్‌ సిఫార్సులను అమలు చేయించాల్సిన అవసరం ఉందన్నారు. అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులు, గిరిజనులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెత్తందారులు, కార్పొరేట్లు, మతోన్మాదుల పాలనలో సామాజిక న్యాయం కొరవడుతోందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15,17లో కులవివక్ష, అంటరానితనం నిషేధించినా నేటికీ కొనసాగడం శోచనీయమన్నారు. ఆజాదీకా అమత్‌ మహోత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో నేటికీ దళితులకు కనీసం శాశ్వత శ్మశాన భూముల్లేక రోడ్లు, కాల్వగట్ల పక్కన అంతిమ సంస్కారాలు చేసుకోవాల్సి వస్తోందన్నారు. పోర్టులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక వేత్తలకు వేల ఎకరాలు భూములు ధారాదత్తం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల శ్మశాన వాటికలకు అవసరమైన భూములను కేటాయించడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయన్నారు. బడ్జెట్‌ కేటాయింపుల్లో దళితుల పట్ల వివక్ష చూపుతున్నాయన్నారు. సామాజిక అంశాలపైన, సమానత్వం కోసం కలిసివచ్చే ప్రజా సంఘాలను ఐక్యం చేసి కులతత్వానికి, మతతత్వానికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తామన్నారు. తొలుత పాటూరు రామయ్య కెవిపిఎస్‌ పతాకాన్ని ఆవిష్కరించారు. కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు కొడాలి శర్మ అధ్యక్షతన మహాసభ జరిగింది. కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి సిహెచ్‌.రాజేష్‌ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టారు. కెవిపిఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌.రఘు తదితరులు మాట్లాడారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మురాల రాజేష్‌ సౌహార్ధ సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా కెవిపిఎస్‌ నాయకులు అమరజీవి నిమ్మాది ఏడుకొండలు చేసిన సేవలను నాయకులు కొనియాడారు.
తీర్మానాలు
మహాసభ పలు తీర్మానాలను ఆమోదించింది. జిల్లాలో ఎస్‌సిలకు గ్రూప్‌ వన్‌ స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేయాలని, మచిలీపట్నంలోని అంబేద్కర్‌ భవనాన్ని పునర్నిర్మించాలని, ఉపాధి హామీ చట్టాన్ని గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రాంతాల్లోనూ అమలు చేయాలని, 300 యూనిట్లు విద్యుత్‌ వినియోగించే ఎస్‌సి, ఎస్‌టిలకు జగజ్జీవన్‌రామ్‌ ఉచిత విద్యుత్‌ పథకం షరతులు లేకుండా కొనసాగించాలని, దళిత క్రైస్తవులను ఎస్‌సి జాబితాలో చేర్చాలని, జిఒ నెంబర్‌ 1235 ప్రకారం ప్రతి గ్రామంలోనూ దళితుల శ్మశాన అవసరాలకు రెండు ఎకరాల భూమి కొని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ మహాసభ తీర్మానించింది.
నూతన కార్యవర్గం ఎన్నిక
కెవిపిఎస్‌ జిల్లా నూతన కార్యవర్గాన్ని మహాసభ ఎన్నుకుంది. కృష్ణాజిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులుగా చీకటి రాజేష్‌, నిమ్మాది గోపాల్‌ ఎన్నికయ్యారు. జిల్లా కార్యదర్శివర్గానికి ఆర్‌.రఘు, కొడాలి శర్మ, ముళ్లపూడి విల్సన్‌, కిషోర్‌, అంబటి శ్రీనివాసు, ప్రశాంతిలను ఎన్నికయ్యారు. కమిటీకి శ్యామ్సన్‌, ప్రత్తిపాటి సుధాకర్‌, రాజు, రంగారావు ఎన్నికయ్యారు.