ప్రజాశక్తి - భీమవరం
ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతల పట్ల, ప్రజా ఉద్యమాల పట్ల జగన్ ప్రభుత్వం తీరు దారుణంగా ఉందని, రాజ్యాంగ హక్కులను తుంగలో తొక్కేస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి కోణాల భీమారావు విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తున్నారని, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, వీటికి అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు సిపిఐ ఆధ్వర్యంలో ఆదివారం భీమవరం ఆర్‌టిసి ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన భీమారావు మాట్లాడుతూ రాష్ట్రంలో తాలిబాన్ తరహా పాలన సాగుతోందని నాలుగున్నరేళ్లుగా జగన్ ప్రజాఉద్యమాలను అణచివేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు ఉదంతం ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడమేని ఇది దేనికి సంకేతమని ప్రశ్నించారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్ మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలపట్ల రాష్ట్రంలో నాలు గున్నరేళ్లుగా నిర్బంధాలు సాగుతున్నాయని, ప్రజలకు తమ అభిప్రాయాలు వెల్లడించే అవకాశం లేకుండా అరెస్టులు, గృహనిర్భంధాలు చేస్తున్నారని, ప్రజాస్వా మ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులకు పాతరేస్తున్నారని, చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికమని ఖండించారు. జగన్ సర్కారు డ్వాక్రా, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, విద్యార్థి, ఉపాద్యాయ, ఉద్యోగ సంఘాల ఇలా అన్ని ఉద్యమాలను అణచివేస్తున్నారని, వీటిని ఎదుర్కో వాలని, తగిన సమయం వచ్చిందని ప్రజాస్వామ్య వాదులంతా కదలిరావాలని బలరాం విజ్ఞప్తి చేశారు.
టిడిపి రాష్ట్ర కోశాధికారి మెంటే పార్ధసారధి మాట్లాడుతూ ప్రజావేదిక కూల్చివేతతో జగన్ అరాచక పాలన మొదలైందని, తరువాత మూడు రాజధానులతో ప్రాంతాల మద్య చిచ్చురేపారని, రివర్స్ టెండరింగ్, పోలవరం నిలిపివేత, ప్రత్యేక హోద, విభజన హామీల అమలు వీటన్నింటినీ తాకట్టు పెట్టేశారని విమర్శించారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి వేండ్ర శ్రీనివాస్ మాట్లాడుతూ స్కిల్ డెవలప్‌మెంట్ కేసు పెడితే ముందుగా ప్రేమచంద్రారెడ్డి, అజరు కల్లాం, పివి.రమేష్‌పై పెట్టాలని డిమాండ్ చేశారు. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి లంక కృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలేదని, జిఒ నెం-1, సెక్షన్ 30, 144లే రాజ్యమేలుతున్నాయని, గూండాల పాలన సాగుతోందని విమర్శించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు, ఎం.సీతారామ్‌ప్రసాద్, సిఐటియు జిల్లా నాయకులు బి.వాసుదేవరావు, కాంగ్రెస్ నాయకులు తమలంపూడి వంశీ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మైలాబత్తుల ఐజాక్‌బాబు, ఫార్వర్డ్ బ్లాక్ పట్టణ కార్యదర్శి దండు శ్రీనివాసరాజు, సిపిఐ నాయకులు నాగిడి శాంతమూర్తి, మల్లుల శ్రీనివాసరావు, వైవి.ఆనంద్, అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అండ్ కష్టమర్స్ అసోసియేషన్ నాయకులు కె.గోపాలకృష్ణమూర్తి, వై.వీరకృష్ణ, వి.నరసింహాచారి, పైడిరాజు పాల్గొన్నారు.










