ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
ప్రపంచంలోనే అత్యుత్తమైన మన రాజ్యాంగాన్ని, రాజ్యాంగ మౌలిక సూత్రాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకోవాలని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు కోరారు. ఆదివారం ఏలూరులో జరిగిన యుటిఎఫ్ జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ భిన్న కులాలు, మతాలు, ఆచార వ్యవహారాలు, జాతులు కలిగిన భారతదేశాన్ని ఐక్యంగా ఉంచే ఏకైక అత్యున్నత సాధనం మన రాజ్యాంగమని చెప్పారు. 29 రాష్ట్రాలు కలిసి ఉండే ఫెడరల్ వ్యవస్థను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉపాధ్యాయులపై ఉందన్నారు. రాజ్యాంగ పీఠికలోని స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం, లౌకికత్వం, మౌలిక సూత్రాలను ప్రభుత్వాలు చిత్త శుద్ధితో అమలు చేస్తున్నాయో లేదో ప్రజలందరూ పరిశీలించాలని కోరారు. రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులను కాపాడుకోవాలని కోరారు. ప్రశ్నించడం, భావ ప్రకటన స్వేచ్ఛ ద్వారా ప్రజలందరికీ స్వాతంత్య్రం ఉందని దీన్ని భంగపరిచే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. భారతదేశం అందరిదీ.. మనమంతా ఐక్యమత్యంగా ఉండాలనే భావనను ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధనలో భాగంగా చెప్పాలని కోరారు. ప్రశ్నను ప్రోత్సహించని సమాజం అభివృద్ధి చెందదని, విద్యార్థులకు ప్రశ్నించేతత్వాన్ని నేర్పించాలని కోరారు. యుటిఎఫ్ ఏలూరు జిల్లా గౌరవాధ్యక్షులు ఎంవి.శ్యాంబాబు రాజ్యాంగ పీఠికతో కూడిన మేమేంటోను జిల్లా శాఖకు బహూకరించి మాట్లాడుతూ అంబేద్కర్ కృషి వల్ల రూపొందిన రాజ్యాంగాన్ని, దాని విశిష్టతను విద్యార్థులకు బోధించాలని సూచించారు. రాష్ట్ర కార్యదర్శి బి.సుభాషిణి మాట్లాడుతూ బదిలీలు, ప్రమోషన్ల సందర్భంగా టెక్నికల్ సమస్యల వల్ల ఇబ్బందికి గురైన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షులు ఆర్ రవికుమార్ మాట్లాడుతూ పాత పెన్షన్ విధానం పునరుద్ధరణకు ఫ్యాప్టో చేసే కార్యాచరణను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో కార్యదర్శి నివేదికను బి.సుభాషిణి, ఆర్థిక నివేదికను షేక్ ముస్తఫా అలీ ప్రవేశపెట్టారు. ఈ మధ్యంతర కౌన్సిల్ సందర్భంగా తాత్కాలికంగా జిల్లా కమిటీ నాయకత్వానికి కొన్ని సూచనలు చేశారు.
ప్రస్తుత అధ్యక్షులుగా ఉన్న ఆర్.రవికుమార్‌ను జిల్లా ప్రధాన కార్యదర్శిగా, ప్రస్తుత జిల్లా కోశాధికారిగా ఉన్న షేక్ ముస్తఫాను జిల్లా అధ్యక్షులుగా, జిల్లా సహాయ అధ్యక్షురాలిగా వి.కనకదుర్గను, జిల్లా కోశాధికారిగా జివి.రంగ మోహన్‌ని, జిల్లా కార్యదర్శిగా ఎంవి.బేతాళరావుని, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్‌గా బి.మోహన్ రావుని, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులుగా సిహెచ్.పిచ్చోడిని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.శ్రీనివాస్, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ ఎంవి.బేతాళరావు, జిల్లా కార్యదర్శులు పివి.సాగర్ బాబు, ఎంవి.అప్పారావు, బి.అనురాధ, ఎన్.రాం బాబు, ఎస్.సుధారాణి, ఇ.శివశంకర్, సిహెచ్.శ్రీధర్, జి.దేవానంద్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వి.కనకదుర్గ పాల్గొన్నారు.










