తనువును కొవ్వొత్తి చేసి కరుగుతూ,
చీకటి నిండిన బతుకుల్లో వెలుగుతున్న
ఓ దీపాన్ని చూసి ఓర్వలేక విషపు గాలి ఆర్పేసింది..
చేతుల నడ్డుపెట్టి కాపాడలేని సమాజం
సిగ్గుతో తలదించుకుంది..
పక్షులను రక్షిస్తున్న మహా వృక్షాన్ని,
మొదళ్ల నుండి ఓ గొడ్డలి ఉన్మాదంగా నరికేస్తే,
గూడు చెదిరిన విహంగాలన్నీ గుండె పగిలేలా విలపిస్తున్నాయి..
న్యాయం అంగట్లో అమ్మకపు సరుకయ్యాక,
రాజకీయ తరాజులో
బలిసిన రాజ్యం ఓ వైపు,
బక్కపలచని దేహం మరోవైపు,
తులాభారంలో తూగలేని వృద్ధ ఖైదీని,
న్యాయాలయాలు మూకుమ్మడిగా వెలేసాయి..
రహస్యమేదీ లేదు,
ఇప్పుడంతా బహిరంగమే..
నిన్న బిగిసిన పిడికిలికి
నేడు చలనం లేకుండా చేసి,
నేడు ప్రశ్నించిన గొంతును
రేపు గోడకు దండేసి వేలాడదీస్తున్నారు..
ఇప్పుడైనా కదిలి రా!
వాడి కబంధ హస్తాల్లో
కొన్ని ఉద్యమ ఊపిర్లు
ఆఖరిశ్వాసల్ని పీలుస్తున్నాయి..
ఇకనైనా కలిసి రా!
నిన్న మనకోసం బిగిసిన
కొన్ని పిడికిళ్ళు
వాడి సంకెళ్లలో చిక్కి అంతిమ ఘడియల్ని లెక్కిస్తున్నాయి..
( ఫాదర్ స్టాన్ స్వామికి విప్లవ జోహార్లు )
జాబేర్.పాషా
00968 97663604