Jun 14,2023 21:44

ప్రభుత్వ పథకాలను వివరిస్తున్న జగన్మోహన్‌ రెడ్డి

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి బాటలోని ఆయన కుమారుడు జగన్మోహన్‌ రెడ్డి పాలన కొనసాగుతోందని వైసిపి సీనియర్‌ నాయకులు ఎర్రకోట జగన్మోహన్‌ రెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని 32వ వార్డు సచివాలయంలో మూడో రోజు 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదల అభ్యున్నతికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో జగనన్నకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. వార్డు పరిధిలోని కొన్ని వీధుల్లో తాగునీటి సమస్య, సిసి రోడ్లు, తదితర సౌకర్యాలు కావాలని ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్‌ అధికారులను ఆయన ఆదేశించారు. ప్రస్తుతం అన్ని వార్డుల్లో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. పట్టణంలోని అన్ని వార్డులను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సిసి రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలను చేపడుతున్నామని చెప్పారు. గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి ఎఐఐబి స్కీం కింద మంజూరైన రూ.142 కోట్లతో పైపులైన్లు, ట్యాంకు నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. అవి పూర్తయితే ఇంటింటికి కుళాయిలు మంజూరు కానున్నట్లు చెప్పారు.