Oct 17,2023 20:47

బత్యాల చెంగల్రాయుడు, చామర్తి జగన్మోహన్ రాజు

రాజంపేటలో రాజకీయ వేడెక్కింది. ప్రతిపక్ష టిడిపి పార్లమెంటు అధ్యక్షులుగా ప్రముఖ విద్యావేత్త చమర్తి జగన్మోహన్‌ రాజును నియమించడం చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్‌, అసెంబ్లీ టిక్కెట్లు ఎవరిని వరిస్తాయోనన్న చర్చకు దారితీసింది. ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షులుగా రాజు విద్యాసంస్థల అధినేత జగన్మోహన్‌ రాజును పార్టీ అధిష్టానం నియమించడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జగన్మోహన్‌ రాజును పార్లమెంట్‌ అధ్యక్షులుగా నియమించడం వెనక తెలుగుదేశం పార్టీ వ్యూహం ఏంటనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. అసెంబ్లీ పైనే 'చమర్తి' గురి
రాజంపేట అసెంబ్లీ నుండే పోటీ చేయాలన్న తలంపుతో జగన్మోహన్‌రాజు ఉన్నారు. 2019 ఎన్నికల్లో కూడా టికెట్‌ ఆశించారు. అప్పట్లో టిక్కెట్‌ దక్కుకపోవడంతో ఆయన కొంత నిరాశ చెందినా పార్టీలో అంకితభావంతో పనిచేస్తూ వచ్చారు. 2024 ఎన్నికల్లో టికెట్‌ వస్తుందన్న విశ్వాసంతో పార్టీలో చురుగ్గా ఉంటూ వస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన రాజంపేట అసెంబ్లీ టికెట్‌ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు నాయకులను, కార్యకర్తలను కలుస్తూ వస్తున్నారు. ఇక్కడి నుంచి ప్రస్తుత అసెంబ్లీ ఇన్‌ఛార్జిగా ఉన్న బత్యాల చెంగల్రాయుడు కాపు సామాజిక వర్గం నుంచి టికెట్‌ ఆశిస్తున్నారు. ఇతనితో పాటు జగన్మోహన్‌ రాజు టికెట్‌ బరిలో ఉన్నారు. వీరిద్దరి మధ్య అసెంబ్లీ టికెట్‌ పోరు జరుగుతోంది. ఈ తరుణంలో జనసేన-టిడిపి పొత్తులో రాజంపేట జనసేనకేమైనా కేటాయిస్తారా అన్న అభిప్రాయాలు వ్యక్తమతున్నాయి. ఇలా రకరకాల చర్చలు జరుగుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ నుంచి అసెంబ్లీ అభ్యర్ధిగా పోటీ చేయాలన్న దృష్టితో జగన్మోహన్‌ రాజును పార్లమెంట్‌ అధ్యక్షులుగా నియమించడం ఊహకందని పరిణామంగా మారింది. ప్రస్తుతం రాజంపేట అసెంబ్లీ, పార్లమెంట్‌ టికెట్‌లపై చర్చలు వేడెక్కాయి. పార్లమెంట్‌ అభ్యర్థిగా ఇప్పటికే గంటా నరహరిని ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. కొంతకాలంగా ఆయన పార్లమెంట్‌ నుంచి పోటీ చేస్తారా లేక అసెంబ్లీపైనే ఆయన కూడా దృష్టి పెట్టారా అన్న చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో పార్లమెంట్‌ అధ్యక్షులుగా జగన్మోహన్‌రాజును నియమించడం ఆసక్తికరంగా మారింది. రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షులుగా ఇప్పటి వరకు పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి కొనసాగుతూ వచ్చారు. ఆయన్ను ఏడాది కిందట కడప పార్లమెంట్‌ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా శ్రీనివాసరెడ్డి సతీమణి మాధవిని కడప అసెంబ్లీ ఇన్‌ఛార్జిగా నియ మించడంతో ఆమె కడప అసెంబ్లీ అభ్యర్థిగా ఖరారు అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమ వుతు న్నాయి. ఈ తరుణంలో రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షులుగా శ్రీనివాసరెడ్డిని కొనసాగించడం రాబోయే ఎన్నికల దృష్ట్యా ఆయనకు ఇబ్బందిగా ఉంటుందన్న కారణంగా ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమించాల్సి వచ్చిందని చెప్పుకోవచ్చు. పార్లమెంట్‌ అభ్యర్థిగా ప్రకటించిన నరహరినే అధ్యక్షులుగా నియమించేందుకు అవకాశం ఉంది. రాజంపేట పార్లమెంట్‌ స్థానం మొదటి నుంచి కాపు సామాజిక వర్గానికి పట్టు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అధ్యక్షునిగా నియమించ వచ్చు. ఇలాంటి పరిస్థితులన్నింటినీ కాకుండా జగన్మోహన్‌ రాజును పార్ల మెంట్‌ అధ్యక్షులుగా నియమించడం పట్ల టిడిపి వ్యూహం ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. ఈ తాజా పరిణామాలు చూస్తుంటే రాజంపేట అసెంబ్లీ, పార్లమెంట్‌ టికెట్‌ వ్యవహారంపై రకం రకాల చర్చలకు తావునిస్తున్నాయి.
అధిష్టానం నిర్ణయం మేరకే : 'చమర్తి'
టిడిపి అసెంబ్లీ టికెట్‌ రేసులో ఉన్న జగన్మోహన్‌రాజును పార్లమెంట్‌ అధ్యక్షులుగా నియ మించడంపై ఆయనను పలకరించగా అధిష్టానం నిర్ణయం మేరకు నడుచుకుంటానని పేర్కొన్నారు. అధిష్టానం తనను పార్లమెంట్‌ అధ్యక్షులుగా నియమించిందని ,అందుకు తగ్గట్టుగా పనిచేస్తానని పేర్కొన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి బాధ్యతలు నెరవేరుస్తారని తెలిపారు. పార్టీ నాయకులందరితో సమన్వయంతో ఉంటూ పార్టీ అభివృద్ధికి చేస్తానన్నారు.