రాజకీయపార్టీల అభ్యంతరాలను నివృత్తి చేయాలి- రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా

రాయచోటి : వివిధ రాజకీయ పార్టీల నాయకులు అందించిన క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పెండింగ్ లేకుండా వెంటనే క్లియర్ చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి ఓటర్ల ప్రత్యేక సవరణ జాబితా 2024 కార్యక్రమంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాయచోటి కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్, జాయింట్ కలెక్టర్ ఫర్మర్ అహ్మద్ ఖాన్, డిఆర్‌ఒ సత్యనారాయణ, ఎన్నికల విభాగం అధికారులు హాజరయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీలు అందించిన అభ్యంతరాలను పెండింగ్ లేకుండా వెంటనే క్లియర్ చేయాలన్నారు. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఒకటికి రెండుసార్లు పరిశీలన చేసి తప్పులు లేని స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపొందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఓటరు జాబితా ఇంటింటి పరిశీలన పూర్తి చేయాలని, సంబంధిత సమాచారాన్ని ఎప్పటికప్పుడూ రాజకీయ పార్టీలకు అందజే యాలన్నారు. రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి మరణించిన, బదిలీ అయినా, ఓట్ల సమస్యలను పరిష్కరించడం గురించి వారికి తెలియ జేయాలన్నారు. రాజకీయ పార్టీల నాయకులకు పునఃపరిశీలన, ఫిర్యాదుల పరిశీలన, ఇవిఎంలయాక్సెప్టెన్స్ టెస్ట్ ప్రొసీజర్స్ తదితర అన్ని రకాల వివరాలపై రిపోర్లు ఎప్పటికప్పుడూ అందజేయాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల మార్పు నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటు గురించి ఎన్నికల కమిషన్ నియమ నిబంధన ప్రకారం చేయాల్సి ఉంటుందన్నారు. కలెక్టర్ గిరీష పిఎస్ మాట్లాడుతూ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి సంబంధించి వివిధ రాజకీయ పార్టీల నుంచి అందిన క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ అన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఫామ్ 6, 7, 8 లకు సంబంధించి ఎలాంటి పెండింగ్ లేకుండా పరిశీలన సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇంటింటి సర్వేలో భాగంగా షిఫ్టెడ్, జంక్ క్యారెక్టర్స్‌కి సంబంధించి పరిశీలన చేస్తున్నామన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎపిక్ కార్డుల జనరేషన్ చేపట్టామన్నారు. జిల్లాకు కొత్తగా ఈవీఎంలు రావడం జరిగిందని, వాటికి సంబంధించి స్కానింగ్ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. వివి ప్యాట్స్ పరిశీలన పూర్తి చేయడం జరిగిందన్నారు. జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులకు ఎప్పటికప్పుడూ అన్ని వివరాలను తెలియజేస్తూ స్వచ్ఛమైన ఓటరు జాబితా రూపకల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు.
క్షేత్ర స్థాయిలో పరిశీలించాలి :కలెక్టర్
జిల్లాలో ఓటర్ జాబితాపై రాజకీయ పార్టీల నుంచి అందిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ గిరీష పిఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాయచోటి కలెక్టరేట్ మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి 2024 ఓటర్ జాబితా సంక్షిప్త సవరణ అంశంపై నియోజకవర్గ ఈఆర్‌ఓలు, ఎఈఆర్‌ఓలు, బిఎల్‌ఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా రాజకీయ పార్టీల నుంచి ఓటర్ జాబితా పై అందిన ఫిర్యాదులలో ఒక్క ఫామ్ కూడా పెండింగ్‌లో ఉంచరాదన్నారు. బిఎల్‌ఒలు క్షత్రస్థాయిలో పక్కాగా పరిశీలన చేసి వాటి జాబితాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఇందులో భాగంగా తంబళ్లపల్లి, మదనపల్లి, పీలేరు, కోడూరు, రాజంపేట, రాయచోటి నియోజకవర్గాలలో వచ్చిన దరఖాస్తులను వందశాతం పరిశీలించిన పూర్తి చేసి జాబితాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అదనంగా ఏర్పాటైన పోలింగ్ స్టేషన్లను నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేవా అని ఇఆర్‌ఒలు, ఎఇఆర్‌ఒలు స్వయంగా పరిశీలించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, డిఆర్‌ఒ సత్యనారాయణ, నియోజకవర్గాల ఇఆర్‌ఒలు, ఎఇఆర్‌ఒలు, బిఎల్‌ఒలు పాల్గొన్నారు.