Sep 29,2023 23:19

ప్రజాశక్తి-కాకినాడ రాజకీయాలను, సంక్షేమంతో ముడిపెట్టకుండా అన్ని వర్గాల ప్రజల బాగోగుల కోసం వివిధ సంక్షేమ పథకాలు అమలుతో కృషి చేస్తున్న ప్రభుత్వం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వమని కాకినాడ ఎంపీ వంగా గీత అన్నారు. వైఎస్సార్‌ వాహనమిత్ర పథకం ద్వారా అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌, ఎండియు డ్రైవర్లకు అయిదో విడతలో రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం విజయవాడలో ప్రారంభించగా ఈ పథకానికి సంబంధించిన జిల్లాస్థాయి కార్యక్రమం జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో కాకినాడ సూర్యకళామందిర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా, కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కుడా ఛైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, మాజీ మేయర్‌ సుంకర శివ ప్రసన్న, పట్టణ మార్కెగ్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ పసుపులేటి వెంకటలక్ష్మి, టిడిసి ఎ.మోహన్‌, ఆటోయూనియన్ల ప్రతినిధులు, లబ్ధిదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ వంగా గీత మాట్లాడుతూ 2019 నుంచి వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర పథకం ద్వారా అర్హులైన సొంత ఆటోరిక్షా, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌, ఎండీయూ కలిగిన డ్రైవర్లకు మరమ్మతులు, ఇన్సూరెన్స్‌ ఖర్చులు వంటి వాటి కోసం ప్రభుత్వం ఏటా పది వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తోందని వివరించారు. కులం, మతం, వర్గం, రాజకీయాలతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ కుటుంబాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. గతంలో ఆటో ప్రమాదాలు, క్వారీ లారీ ప్రమాదాలు ఎక్కువగా జరిగేవని ఇప్పుడు ఆ ప్రమాదాలు బాగా తగ్గినట్లు ఎంపీ వంగా గీత తెలిపారు. కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర పథకం ద్వారా అయిదో విడతలో 2023-24 సంవత్సరానికి 12,970 మందికి రూ.12.97 కోట్ల మేర లబ్ధి చేకూరుతోందని తెలిపారు. ఎండా వానా లేకుండా కష్టపడుతూ తమ కాళ్లపై తాము నిలబడుతున్న ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌, ఎండియు డ్రైవర్లకు వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర పథకంతో ఎంతో మేలు జరుగుతోందన్నారు. అయిదో విడతతో కలుపుకుంటే ఒక్కో లబ్ధిదారునికి మొత్తం రూ. 50 వేలు వరకు పథకం ద్వారా అందిందని ఈ మొత్తాన్ని మరమ్మతులు, ఇన్సూరెన్స్‌ ఖర్చులు, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ వంటి వాటికోసం ఉపయోగించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి విజయవాడలో బటన్‌ నొక్కి వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర పథకం లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని విడుదల చేసిన అనంతరం లబ్ధిదారులకు మెగా చెక్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్షులు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, ఆటోయూనియన్ల ప్రతినిధులు, లబ్ధిదారులు, పాల్గొన్నారు.