Jun 23,2023 19:20

వధూవరులను ఆశీర్వదిస్తున్న మంత్రి జయరామ్‌, సోదరులు

ప్రజాశక్తి - చిప్పగిరి
కుళ్లు, కుతంత్ర రాజకీయాలు లేకుండా హుందాతనంతో రాజకీయాలు చేయాలని, అందులో తమకు తమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆదర్శమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ తెలిపారు. శుక్రవారం మండలంలోని రామదుర్గం, డేగులపాడు గ్రామంలోని సొసైటీ అధ్యక్షులు మల్లికార్జున చిన్నాన్న కొడుకు వివాహ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. మంత్రితోపాటు ఆయన సోదరులను పూలమాల, శాలువాతో సొసైటీ అధ్యక్షులు మల్లికార్జున ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాజకీయం అనేది హుందాతనంతో కూడి ఉండాలని, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగకుండా, ఒక మనిషికి సమస్యలు తెచ్చి పెట్టేలా ఉండరాదని తెలిపారు. రాజకీయాల్లో విశ్వసనీయత ఉంటేనే రాణిస్తామన్నారు. స్వచ్ఛమైన రాజకీయంతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ముందుకు వెళ్తుండడంతో ప్రజల్లో ఆయనపై నమ్మకం పెంచుకున్నారని తెలిపారు. ఒక నాయకుని చూసి ప్రజలు ఇంతగా సంతోషిస్తున్నారంటే ఇంకేం కావాలన్న ధోరణి కనపడాలన్నారు. ఇటీవల కొంతమంది నాయకులు ఎదగడానికి కుతంత్ర రాజకీయాలు అవలంభిస్తున్నారన్నారు. ప్రజల్లో మంచి గుర్తింపు రావాలంటే ప్రజలతోనే మమేకం కావాలన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్‌ రెడ్డి చెప్పినట్లు 175కు 175 సీట్లు గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. దేవరగట్టు ఆలయ ఛైర్మన్‌ గుమ్మనూరు శ్రీనివాసులు, ఆలూరు మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ గుమ్మనూరు నారాయణ, ఎంపిపి భర్త జూటూరు మారయ్య, డేగులపాడు సర్పంచి నీలకంఠ, సొసైటీ మాజీ అధ్యక్షులు నిరంజన్‌ ప్రసాద్‌, ఆలూరు జడ్‌పిటిసి శేఖర్‌, రాజన్న, శ్రీధర్‌, సూరి పాల్గొన్నారు.