నిరసన కార్యక్రమాలలో పాల్గొనే విద్యార్థులను తిరుగుబాటుదారులుగా, అదుపుతప్పిన వారిగా, తాము చదివే విద్యా సంస్థలను అప్రతిష్టపాలు చేసే వారిగానూ పలువురు పరిగణిస్తారు. అలా వివిధ రకాల ముక్కల కింద చూడడం, విద్యా బోధనకూ, విశ్వవిద్యాలయం పట్ల వుండాల్సిన సమగ్ర భావనకూ విరుద్ధం. విద్యా సంస్థలు కేవలం విజ్ఞానాన్ని అందించే కేంద్రాలు కాదు. అవి బహిరంగ చర్చ, విమర్శ, భావాలపై పోటీ పడే కేంద్రాలుగా ఉండాలి.
పౌరసత్వ సవరణ చట్టం-2019, జాతీయ పౌరసత్వ నమోదు ప్రతిపాదనకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనల తరువాత...2020లో విద్యార్థులను రాజకీయాల్లోకి రాకుండా నిరోధించాలనే బృందగానం ఒకటి ప్రారంభమైంది. 2019 డిసెంబర్‌లో ఆందోళనలు ఉధృతంగా సాగుతున్న సమయంలో, బిజెపి విద్యార్థి విభాగం 'అఖిల భారత విద్యార్థి పరిషత్' (ఎబివిపి) ఈ కొత్త చట్టాన్ని సమర్థిస్తూ ర్యాలీలు, మీటింగులు సైతం నిర్వహించింది. అయినప్పటికీ, 'నిశాంక్' రాజకీయ పార్టీలు తమ రాజకీయాల నుంచి విద్యార్థులను, విద్యా సంస్థలను మినహాయించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి రమేష్ పోఖ్రియల్ అన్నారు. స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేత ఒకరు విద్యార్థులు రాజకీయాలకు దూరంగా ఉండాలన్న సలహా ఇచ్చారని, 'భారతదేశంలో సామాజిక ఉద్యమాలు' రచనలో ప్రొ|| ఘనశ్యామ్ షా పేర్కొన్నారు. విద్యార్థులు చదువుల మీద మాత్రమే కేంద్రీకరించే రాజకీయ రహిత కేంద్రాలుగా విద్యాలయాలు ఉండాలని ఆదేశించే నియమ నిబంధనలు... నేడు మన దేశంలోని అనేక కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో వున్నాయి. ఇక్కడ జరిగే నిరసన కార్యక్రమాలలో పాల్గొంటున్న విద్యార్థుల సస్పెన్షన్, తొలగింపుల వంటి క్రమశిక్షణా చర్యలకు విద్యార్థులే బాధ్యత వహించాలట.
ఇటీవల కాలంలో పర్యావరణ కార్యకర్త దిశా రవి అరెస్ట్ తరువాత ఈ ఆలోచన మరొకసారి తెర మీదకు వచ్చింది. తమ పిల్లలు వివాదాస్పద సమస్యలపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే విషయంలో, నిరసన కార్యక్రమాలలో పాల్గొనే విషయంలో తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందుతున్నారని నివేదికలు తెలియజేస్తున్నాయి. అసమ్మతిని వ్యక్తం చేస్తున్న వారిని నిలువరించేందుకు ప్రభుత్వం తరచుగా ప్రయత్నించడం (దూకుడుగా వ్యవహరించే రాజకీయాలు యువకులకు సరిపడవనే విశ్వాసంతో), చట్టాలను లెక్క చేయకుండా నిరసన కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల... పిల్లలను కాపాడుకోవాలన్న ఆందోళన తల్లిదండ్రులలో ఏర్పడింది.
భారతదేశంలో 18 సంవత్సరాల వయస్సు నిండినవారు కారు నడపడానికి, పెళ్లి చేసుకోడానికి (ఒకవేళ మహిళలైతే), కొన్ని రాష్ట్రాల్లో మద్యం సేవించడానికి చట్టం అనుమతిస్తుంది. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, వారు ఓటు వేయడానికి కూడా అనుమతించారు. ఇక్కడ వక్రోక్తి ఏమంటే, ఎన్నికల ముందు ఓటు వేసే వారి సంఖ్య పెంచేందుకు ప్రచారం నిర్వహిస్తారు (ముఖ్యంగా యువతలో). ఓటర్ల సంఖ్య పెంచే ప్రయత్నం చేస్తూనే, యువత రాజకీయాలకు దూరంగా ఉండాలని సలహాలు ఇస్తుంటారు. తమకున్న ప్రజాస్వామిక హక్కుతో నిరసన కార్యక్రమాలలో పాల్గొనడానికి, తమ సమస్యలను స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి అనుమతించని పక్షంలో... వారు ఓటు హక్కును వివేచనతో వినియోగించుకుంటారని ఎలా అనుకోగలం?
విద్యా విషయాల పట్ల కేంద్రీకరించే వారిని... ఆదర్శ విద్యార్థులుగా, విజయాలు సాధించిన వారిగా, మంచి పౌరులుగానూ అనేక మంది భావిస్తారు. అయితే నిరసన కార్యక్రమాలలో పాల్గొనే విద్యార్థులను తిరుగుబాటుదారులుగా, అదుపుతప్పిన వారిగా, తాము చదివే విద్యా సంస్థలను అప్రతిష్టపాలు చేసే వారిగానూ వారు పరిగణిస్తారు. అలా వివిధ రకాల ముక్కల కింద చూడడం, విద్యా బోధనకూ, విశ్వవిద్యాలయం పట్ల వుండాల్సిన సమగ్ర భావనకూ విరుద్ధం. విద్యా సంస్థలు కేవలం విజ్ఞానాన్ని అందించే కేంద్రాలు కాదు. అవి బహిరంగ చర్చ, విమర్శ, భావాలపై పోటీ పడే కేంద్రాలుగా ఉండాలి.
అంతేకాకుండా ప్రస్తుత ప్రభుత్వం, పాలనా యంత్రాంగాలను, విద్యార్థులు చదివే సిలబస్ (ముఖ్యంగా సామాజిక శాస్త్రాలకు సంబంధించిన)ను మార్చుతోంది. ఇటువంటప్పుడు విద్యా సంస్థలు రాజకీయాలకు దూరంగా ఉండాలన్న నిబంధన సరైనది కాదు. ఎ.కె.రామానుజన్ ప్రసిద్ధ రచన 'త్రీ హండ్రెడ్ రామాయణాస్'ను 2011లో ఢిల్లీ యూనివర్సిటీలో చరిత్ర సిలబస్ నుంచి తొలగించారు. ఇటీవల సిబిఎస్‌ఇ లో 9 నుంచి 12 తరగతులలో 30 శాతం సిలబస్‌ను (సమాఖ్య విధానం, పౌరసత్వం, లౌకికతత్వంపై వున్న పాఠ్యాంశాలను) కేంద్రం తొలగించింది. కేవలం నిరసన కార్యక్రమాలలో పాల్గొనడం మాత్రమే యువతను రాజకీయాలకు దగ్గర చేయదు. దానితో సమానంగా వారికి అందిస్తున్న విద్య కూడా అందుకు తోడ్పడుతుంది.
'అపొలిటికల్' అనే పదానికి డిక్షనరీలో ఉన్న అర్థం రాజకీయాలలో ఆసక్తి లేకపోవడం. లేదా ఒక రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఉండడం. అనేక మంది పౌరులు ఈ కేటగిరీలో ఉన్నారు. అయితే, యువతీ యువకులకు రాజకీయ అభిప్రాయాలు లేకపోవడమనేది అసాధ్యం. ఉదాహరణకు ఒక పిల్లవాడు... మురికి నీరు, పరిశ్రమల వ్యర్థాలు వచ్చి చేరుతున్న ఒక నదికి సమీప ప్రాంతంలో పెరిగాడనుకుందాం. నిత్యం కాలుష్యానికి గురవుతున్న ఆ ప్రాంతంలో స్వచ్ఛమైన నీరు, గాలి కోసం ఆ కుర్రవాడు పోరాటం చేయవచ్చు. అతను బిజెపి, కాంగ్రెస్ పార్టీల లేదా ప్రాంతీయ పార్టీల మద్దతుదారుడు కాదు. ఆ పార్టీల భావజాలం, విధానాలపై అతనికున్న పరిజ్ఞానం పరిమితమైనదే కావచ్చు. కానీ కాలుష్య సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వ అసమర్థతకు వ్యతిరేకంగా జరిగే నిరసనలలో అతను పాల్గొనవచ్చు.
అతనిలాగే, మనలో చాలా మందికి అసమానతలను ఏ విధంగా అధిగమించాలి? ఏ నమూనా అభివృద్ధి తగిన విధంగా, న్యాయంగా ఉంటుంది? ఎవరికి పన్నులు విధించాలి? ఎంత విధించాలి? ఆహారపు అలవాట్లు, హక్కులు వాటి పరిమితుల లాంటి అనేక విషయాల పైన రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. మన అభిప్రాయాలను వాట్సప్ ద్వారా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తెలియజేస్తుంటాం. రాజకీయాలపై మన అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తే, ఈ అభిప్రాయాల వ్యక్తీకరణే మనల్ని రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులను చేస్తుంది.
కానీ, కేవలం కొద్ది మంది మాత్రమే, అనేక సమస్యలపై మౌనంగా ఉండగలుగుతారు. వివాదాస్పద పౌరసత్వ చట్టాలు, వ్యవసాయ విధానాలు, కళాశాల, విశ్వవిద్యాలయ ప్రాంగణాలలో కుల వివక్షత, కొన్ని రకాల ఆహారాల నిషేధం, ప్రజలను తమ భూముల నుంచి వెళ్ళగొట్టేటటువంటి అనేక విధానాల ప్రభావం... తమ కుటుంబాలు, వారి ప్రాంతంలో నివసిస్తున్న ప్రజా సముదాయాల పైన ఏ విధమైన ప్రభావాలను కలిగించని కారణంగానే వారు నిరాసక్తంగా వుంటారు.
కొన్ని సంవత్సరాలుగా అనేక దేశాల్లో, ప్రజలు చేసిన డిమాండ్ల ఫలితంగానే నేడు మనం అనుభవిస్తున్న ఎనిమిది గంటల పని దినం, మహిళలకు ఓటు హక్కు, మహిళలకు పురుషులతో పాటు సమానంగా వేతనాల లాంటి విలువైన హక్కులను సాధించుకున్నాం.
1970వ దశకంలో 'చిప్కో' ఉద్యమానికి కేంద్రంగా ఉన్న ఉత్తరాఖండ్ లోని రేణీ అనే గ్రామంలో ఇటీవల కాలంలో పర్వత ప్రాంతం నుంచి రాళ్ళు విరిగి పడి 62 మంది చనిపోయారు. కొంతమంది వ్యాపారం కోసం చెట్లను నరకడాన్ని... ఇప్పుడు రేణీ గ్రామంలో నివసించే అనేక మంది మహిళలు తమ చిన్నతనంలోనే వ్యతిరేకించారు. చెట్లను కౌగిలించుకుని...వాటిని నరకొద్దని కోరడాన్ని విస్మరించలేం. ఆ ప్రాంతంలో డ్యాం ప్రాజెక్ట్‌లు, విచక్షణా రహితంగా అడవుల నరికివేతలు ఏవిధమైన అభివృద్ధి అని శాస్త్రవేత్తలు అనేక పర్యాయాలు ప్రశ్నించారు. ప్రభుత్వం సంబంధిత రైతు సంఘాలతో సరైన రీతిలో చర్చించకుండా, ఆలోచన చేయకుండా చట్టాలు చేస్తే, ఆ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజలు వాటిని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేయడం చాలా సహజమైన విషయం. హాంగ్‌కాంగ్‌కు చెందిన జోషువా వాంగ్, ఏన్స్ చౌ, ఐవాన్ లామ్ నుంచి...స్వీడన్‌కు చెందిన గ్రెటా థన్‌బెర్గ్, భారత దేశానికి చెందిన దిశా రవి వరకు ఇబ్బందులను ఎదుర్కొనడానికి సిద్ధపడి, ధైర్యంగా బహిరంగంగా మాట్లాడినవారంతా యువతే. గతంలో కూడా తమిళనాడులో హిందీ వ్యతిరేక ఆందోళనల లాంటి అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి, నడిపించింది కూడా యువతీయువకులే.
భావ వ్యక్తీకరణ స్వేచ్ఛా హక్కును, శాంతియుతంగా, నిరాయుధులుగా సమావేశమయ్యే హక్కును, సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కును మనకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 కల్పించింది. ఈ హక్కులన్నిటి వ్యక్తీకరణే నిరసన తెలియజేసే హక్కు. ప్రజల హక్కులు, వారి జీవితాలు, జీవనోపాధికి సంబంధించిన చట్టాలు, విధానాలను వ్యతిరేకిస్తూ బహిరంగంగా మాట్లాడడం వల్ల నేటి యువత ఇబ్బందుల్లో పడినప్పటికీ...వారి వ్యక్తీకరణలు రేపటి దేశ భవిష్యత్తుపైన సానుకూల ప్రభావాన్ని చూపుతాయి.
/ 'ద హిందూ' సౌజన్యంతో /
రాధికా సంతానమ్











