Sep 12,2023 23:27

సమావేశంలో మాట్లాడుతున్న నందమూరి బాలకృష్ణ

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : రాష్ట్రంలో వైసిపితో టిడిపికి రాజకీయ యుద్ధం ప్రారంభమైందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. మంగళవారం గుంటూరులోని టిడిపి కార్యాలయంలో మంగళవారం ఉమ్మడి గుంటూరు జిల్లా టిడిపి సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి కార్యకర్తా సుశిక్షితులైన సైనికుల్లా పోరాడాలన్నారు. సిఎం జగన్‌ పరిపాలనను గాలికొదిలేసి ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. 16 నెలలు జైల్లో ఉన్న జగన్‌ 16 నిమిషాలైనా చంద్రబాబుని జైల్లో పెట్టాలనుకున్నారని, లోకేష్‌తో పాటు మరికొందరు నాయ కులపై కేసులు పెట్టడానికి సిద్ధమయ్యారని విమర్శించారు. నేతలు, కార్యకర్తలెవ్వరూ కేసులకు భయపడాల్సిన పనిలేదన్నారు. ప్రజలు కూడా మౌనంగా ఉండకుండా రోడ్లపైకి రావాలన్నారు. ఊరకుక్కలు ఏదో మొరిగితే భయపడాల్సిన పనిలేదన్నారు. నేను విగ్గు పెట్టుకున్నాని ఎవరో ఏదో వాగాడని, నా జీవితమే తెరిచిన పుస్తకమని నా విగ్గు సంగతి ఎందుకని ప్రశ్నించారు. దావోస్‌ వెళ్లిన ప్రతిసారి చంద్రబాబు వేల కోట్ల పెట్టుబడిల ఒప్పందాలు చేసుకున్నారని, సిఎం జగన్‌ ఒకేసారి వెళ్లి మోహం వేలాడేసుకుని వచ్చి పరువు తీశారని ఎద్దేవ చేశారు.
సమావేశంలో పాల్గొన్న వైసిపి బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ చంద్రబాబుని ఫ్యాక్షనిస్టు, నేరగాడిలా అరెస్టు చేసి తరలించారని, అయినా చంద్రబాబు అదరలేదని, కార్యకర్తల్లో ధైర్యం నింపారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి భూస్థాపితం కావడం ఖాయమన్నారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అన్నారు. పులి ఒక అడుగు వెనక్కు వేస్తే బయపడినట్లు కాదన్నారు. ఫ్యాక్షనిస్టు పాలన సాగిస్తున్న జగన్‌ ప్రభుత్వ బూటకపు కేసులకు భయపడేది లేదని, అరాచకాలపై పోరాటం ఆపేది లేదని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. నేరస్తుడి పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుందో అని ప్రజలంతా ఆందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలన చేతకానివాడు సిఎం అయితే ప్రజలకు అన్ని కష్టాలేనన్నారు. పోలీసులకు భయపడి వెనక్కి తగ్గితే పార్టీకి, నాయకులందరికీ నష్టం జరుగుతుందని, నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చిన దగ్గర్నుంచి జగన్‌ తట్టుకోలేకపోతున్నారని.. ఓర్చుకోలేక అణచివేతలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేయాలనే దుర్మార్గపు ఆలోచనకు జగన్‌ వచ్చారని మండిపడ్డారు. యువగళంతో ప్రజల మధ్య లోకేష్‌ మాస్‌ నాయకుడిగా ఎదిగారని.. అది చూసి జగన్‌ తట్టుకోలేకపోతున్నారని చెప్పారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు, లోకేశ్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి బరితెగించి చంద్రబాబుపై అక్రమ కేసులతో జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా రాళ్ల దాడి చేశారన్నారు. గతంలోనూ నందిగామ, అమరావతి, యర్రగొండపాలెంలోనూ వైసిపి రాళ్లదాడికి పాల్పడిందని గుర్తు చేశారు. చంద్రబాబు, లోకేష్‌ను తొక్కేస్తామని చెబుతున్న వారినే ప్రజలు పాతాళానికి తొక్కేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు మాట్లాడుతూ వ్యవస్థలను ప్రభావితం చేస్తూ బయట తిరుగుతుంది ఎవరో విజయసాయిరెడ్డి గుర్తించుకోవాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఏ తప్పు చేయలేదు కాబట్టే ఈడి అధికారులు ఏం చేయలేకపోయారని.. ఇదే కేసులో ఈడి అరెస్టు చేసిన వారికి బెయిల్‌ కూడా వచ్చిందని అన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సంబంధం ఉన్న అధికారులను పక్కనబెట్టి.. సంబంధం లేని చంద్రబాబుపై కుట్రపూరితంగా కేసు బనాయించారని విమర్శించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు తప్పేమీ లేదని అప్పటి ఆర్థికశాఖ మాజీ ఉన్నతాధికారి పివి రమేష్‌ స్పష్టంగా చెప్పినా దానిపైనా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వ్యవస్థలను ప్రభావితం చేయడం దేశానికి, ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమని అన్నారు. వ్యవస్థలపై నమ్మకంపోతే ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఉందన్నారు. వ్యవస్థలను ప్రభావితం చేయబట్టే చంద్రబాబుకు రిమాండ్‌ విధించారని రాష్ట్రంలో ఉన్న ప్రతిఒక్కరూ చర్చించుకుంటున్నారని చెప్పారు. ఈ వ్యవహారంలో కేంద్రం కూడా జోక్యం చేసుకోవాలని లేకపోతే కేంద్రాన్ని కూడా అనుమానించాల్సి ఉంటుందని చెప్పారు. సిఎం జగన్‌ దుర్మార్గాలపై గవర్నర్‌, కేంద్రం జోక్యం చేసుకుని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు, లోకేష్‌, అచ్చెన్నాయుడు సహా ముఖ్యనేతలను జైళ్లకు పంపించి ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశంలో జగన్‌ ఉన్నారని.. ఆ పన్నాగాలు సాగవన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ అశోక్‌బాబు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్‌కుమార్‌, జి.వి.ఆంజనేయులు, పార్టీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకరరావు, నాయకులు పాల్గొన్నారు.