Jun 21,2023 00:04

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్‌, తాళ్లరేవు 'ఎవరు ఏ మతాన్ని నమ్మినా ఏ దేవుడిని పూజించినా ఎవరికీ ఇబ్బంది లేదు. కేవలం రాజకీయాల కోసం మతాన్ని వాడుకునే వారితోనే అందరికీ ఇబ్బంది' అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు. వారాహి విజయ యాత్రలో భాగంగా మంగళవారం కాకినాడలో ముస్లిం ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. భారతదేశంలో ముస్లిములు ఏనాటికీ మైనార్టీలు కాదని, ఈ దేశం మనందరిదీ అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ముస్లిముల జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా, ఉపాధి అవకాశాలు పెరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భారత దేశంలో సమాజం వేరు, రాజకీయ పార్టీలు వేరని, మైనార్టీలు అనగానే సంపూర్ణంగా అవకాశాలు ఉండవనే భావన మొదట మనసుల్లో నుంచి తొలగించాలన్నారు. ఏ మతంలోనైనా విపరీతవాదాన్ని అందరం ముక్త కంఠంతో ఖండించాలని పవన్‌ కోరారు. గత ఎన్నికల్లో ముస్లిములు వైసిపి పూర్తిగా నమ్మి మద్దతు ఇచ్చారన్నారు. బిజెపి మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన ఆ నాయకుడు ఢిల్లీ వెళ్లి ఏం వంచుతున్నాడో అందరికీ తెల్సున్నారు. రంజాన్‌ పవిత్ర మాసంలో ముస్లిం ప్రతినిధులకు ఇఫ్తార్‌ ఇవ్వడంతో పాటు ఇస్లాం విద్య, ధార్మిక సంస్థల అభివృద్ధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చానని గుర్తు చేశారు.
పవన్‌ కల్యాణ్‌కు ఘన స్వాగతం
జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేపట్టిన వారాహి యాత్రకు తాళ్ళరేవు మండలంలో ఘన స్వాగతం లభించింది. చొల్లంగి, గురజనాపల్లి జంక్షన్‌లో పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు స్వాగతం పలికారు. జామకాయల తూము సెంటర్‌ వద్ద జి.వేమవరం సర్పంచ్‌ పుణ్యమంతుల సూరిబాబు ఆధ్వర్యంలో వేలాదిమంది అభిమానులు, ప్రజలు పవన్‌ కళ్యాణ్‌కు స్వాగతం పలికారు. మహిళలు హారతులు ఇచ్చారు. ఈ జంక్షన్‌లో పవన్‌ కళ్యాణ్‌ కారు టాప్‌ పైకి ఎక్కి అభివాదం చేయడంతో అభిమానులు ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. సుంకరపాలెం జంక్షన్లో జనసేన పార్టీ మండల అధ్యక్షులు అత్తిలి బాబూరావు ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. తాళ్ళరేవు పెట్రోల్‌ బంకు వద్ద అభిమానులు, పార్టీ కార్యకర్తలు కోలాహలం కనబడింది. ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.