ప్రజాశక్తి-గుంటూరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు-ప్రస్తుత రాజకీయ పరిణామాలపై సభ ఈనెల 25న మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరుగుతుందని, సభకు సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు హాజరవుతారని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు తెలిపారు. సోమవారం బ్రాడీపేటలోని పార్టీ కార్యాలయంలో సభ ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక నిత్యజీవితావసర సరుకుల ధరలు, పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్, విద్యుత్ ఛార్జీలు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని చెప్పారు. పేదల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలుగావున్న ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని, ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసిన నరేంద్ర మోడీ కనీసం లక్ష ఉద్యోగాలైనా కల్పించపోగా, ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారని విమర్శించారు. మణిపూర్‌లో నాలుగు నెలల నుండి దాడులు, గృహదహనాలు, మహిళలపై వేధింపులు జరుగుతున్నా ఆ రాష్ట్రాన్ని ప్రధాని సందర్శింక పోవడం దారుణమన్నారు. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం ట్రూప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, కస్టమర్ ఛార్జీలు తదితర ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలు పెంచిందన్నారు. వ్యవసాయ పంపుసెట్లుకు మీటర్లు బిగించే ప్రక్రియను చేపట్టి పేద రైతులకు ఉచిత విద్యుత్‌ను ప్రశ్నార్థకం చేశారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు, విశాఖ రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించకుండా రాష్ట్రానికి కేంద్రం తీరని అన్యాయం చేసినా రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు బిజెపికి మద్దతివ్వడం సరికాదని, ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జరిగే సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.నళినీకాంత్, నాయకులు బి.లక్ష్మణరావు, కె.నాగేశ్వరరావు, ఎ.నికల్సన్, ఎస్.ఖాశిం షహీద్, సమీర్, ఎస్.కె. ఖాశింవలి పాల్గొన్నారు.










