ప్రజాశక్తి -కూనవరం
కేంద్ర బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన ద్రోహానికి, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 14 నుంచి 30వ తేదీ వరకు సిపిఎం, సిపిఐ ఆధ్వర్యాన నిర్వహించనున్న రాజకీయ ప్రచార భేరిని జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని మార్త శ్రీరామ్మూర్తి భవన్‌లో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మేకల నాగేశ్వరరావు అధ్యక్షతన సోమవారం జరిగిన పార్టీ మండల కమిటీ సమావేశంలో మంతెన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల ముందు ఉంచడం కోసం ఈ పొలికల్ క్యాంపెయిన్ చేపట్టినట్లు చెప్పారు. కూనవరం మండలంలోని అన్ని గ్రామాలలో సిపిఎం, సిపిఐ కార్యకర్తలు కలిసి ప్రచార కార్యక్రమం చేపట్టాలన్నారు. పోలవరం ముంపు నిర్వాసితుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను మరిచి వ్యవహరిస్తుందని విమర్శించారు. పోలవరం నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు సిపిఎం వారికి అండగా ఉండి పోరాటం చేస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో సిపిఎం ఎఎస్‌ఆర్ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్, మండల కార్యదర్శి పాయం సీతారామయ్య, నాయకులు పాయం సత్యనారాయణ, బాబు బొర్రయ్య, కర్నాటి శ్రీనివాసరావు, తాళ్లూరి శ్రీనివాసరావు, తెల్లం తమ్మయ్య, పాయం జ్యోతి, సర్పంచ్ వెంకమ్మ, ఎంపీటీసీ జయసుధ, వెంకన్న వెంకటేశ్వరావు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.










