Aug 22,2023 20:46

మాట్లాడుతున్న కమిషనర్‌

మాట్లాడుతున్న కమిషనర్‌
రాజకీయ పార్టీలు సహకరించాలి
- కమిషనర్‌ వికాస్‌ మర్మత్‌, ఐఎఎస్‌
ప్రజాశక్తి-నెల్లూరు:పరిపూర్ణమైన ఓటర్ల జాబితా తయారీకి రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్‌ వికాస్‌ మర్మత్‌ కోరారు. స్థానిక కార్పొరేషన్‌ లోని కమిషనర్‌ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా సవరణపై కమిషనర్‌ మంగళవారం సమావేశం నిర్వహించారు. సమీక్ష లో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు కొన్ని సమస్యలను కమిషనర్‌ దష్టికి తీసుకురాగా వాటిని పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు.ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ నగర పాలక సంస్థ పరిధిలోని ఓటర్ల జాబితా రూపొందించడంలో బూత్‌ లెవెల్‌ అధికారులకు సహకరించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు కమిషనర్‌ సూచించారు. బూత్‌ లెవెల్‌ అధికారులు ఇంటింటికీ తిరిగి ప్రస్తుతం వున్న ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారని, పార్టీలకు చెందిన బూత్‌ స్థాయి ఏజెంట్లు వారికి సంపూర్ణంగా సహకరించినట్లయితే ఖచ్చితమైన ఓటర్ల జాబితా రూపొందించగలమన్నారు. స్వయముగా క్లయిములు అందించిన వారికి తప్పనిసరిగా రసీదులు జారీ చెయ్యవలేనని తెలియచేసినారు
. రాజకీయ పార్టీలన్నీ ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ కు బూత్‌ లెవెల్‌ ఏజెంట్ను నియమించాలని కోరారు. బి.ఎల్‌.వో లు ఇంటింటికి తిరిగి ముందస్తు ఓటర్ల జాబితా పనులను పూర్తి చేయనున్నారని వివరించారు.అర్హులైనప్పటికీ ప్రస్తుత ఓటర్ల జాబితాలో నమోదు కాని వారు, ఈ ఏడాది జనవరి ఒకటి నాటికి 18 సంవత్సరాలు నిండి ఓటర్లుగా నమోదు కావలసినవారు, నివాసం మారినవారు, ఇటీవల మరణించిన వారి సమాచారాన్ని సేకరించి, ఓటర్ల జాబితాలో తప్పులను సరి చేస్తున్నామని కమిషనర్‌ ప్రకటించారు. 21 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటివరకు ఓటు నమోదు చేయించుకొని వారిని ప్రత్యేకంగా విచారించాలని, 80 సంవత్సరాలు దాటిన ఓటరులను ప్రత్యక్షంగా విచారించాలని, అదేవిధంగా ఒకే ఇంట్లో పదిమందికి పైగా ఓటర్ల సంఖ్య నమోదు అయినట్లయితే అలాంటి వాటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఎక్కడైనా పోలింగ్‌ స్టేషన్లు మార్పు చేయవలసి ఉన్న, ఓటర్ల జాబితా సవరణలో ఏవైనా సమస్యలు ఉన్న ఏ.ఈ.ఆర్‌.ఓ ల దష్టికి తీసుకురావాలన్నారు. ఒకే ఇంటికి సంబంధించిన కుటుంబ సభ్యుల ఓట్లు వేరు వేరు పోలింగ్‌ బూత్‌ లలో కాకుండా, ఒకే పోలింగ్‌ బూత్‌ లో ఉండే విధంగా జాబితాలో మార్పు చేర్పులు చేస్తున్నామని కమిషనర్‌ తెలిపారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు టి.డి.పి నుంచి భువనేశ్వరి ప్రసాద్‌, సుబాహాన్‌ బాషా, సిపిఎం నుంచి కత్తి శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, ఏ.ఈ.ఆర్‌.ఓ లు దేవీ కుమారి, నిర్మాలనంద బాబా, శ్రీనివాసులు, ధనుంజయరెడ్డి, దశయ్య, ఈ.డి.టి ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.