
* డిఆర్‌ఒ గణపతిరావు
శ్రీకాకుళం అర్బన్ : గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల విజ్ఞప్తులను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటు న్నామని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతి రావు అన్నారు. ప్రతివారమూ నిర్వహించనున్న రాజకీయ పార్టీల సమీక్ష సమావేశంలో భాగంగా 16వ వారపు సమావేశాన్ని బుధవారం తన ఛాంబర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో జరుగుతున్న బ్యాలెట్ యూనిట్లు, వివి పాట్లు, కంట్రోల్ యూనిట్ల ముదింపు ప్రక్రియను గురించి వివరించారు. దాదాపు 70 శాతానికి పైగా వాటి పనితీరును పరిశీలించామని, రెండు మూడు శాతం పరికరాలు సాంకేతికంగా విఫలమైనట్లు గుర్తించామని అన్నారు. వాటిని ప్రక్రియ నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. అలాగే జిల్లాకు చేరిన కొత్త పరికరాలతో పాటు మిగిలిన వాటినీ గడువులోగా పరిశీలిస్తామని చెప్పారు. ఈ నెలలో బూత్ లెవెల్ స్థాయిలో జరగనున్న ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను గురించి చెప్పారు. ఇప్పటికే జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 27 వేల క్లెయిమ్‌ల పరిష్కారానికి కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ సూచనల మేరకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఈ నెల 4,5, డిసెంబరు 2, 3 తేదీల్లో ఆయా పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవెల్ అధికారులతో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీని దృష్ట్యా ఆయా కేంద్రాల్లో ఎన్నికల విధులకు సంబంధించిన అధికారుల ఫోన్ నంబర్లతో కూడిన జాబితాను స్పష్టంగా కనిపించేలా ఉంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు రౌతు శంకరరావు, టిడిపి నాయకులు పి.ఎం.జె.బాబు, బిజెపి చల్లా వెంకటేశ్వరరావు, బిఎస్‌సి సోమేశ్వరరావు పాల్గొన్నారు.