Jul 12,2023 00:14
సమావేశంలో మాట్లాడుతున్న వెంకటనారాయణ

ప్రజాశక్తి-పర్చూరు: వచ్చే ఏడాది రాష్ట్రంలో లోక్‌సభ, శాసనసభ స్థానాలకు జరుగనున్న సాధారణ ఎన్నికలకు అవసరమైన తుది ఓటర్ల జాబితాను రూపొందించేందుకు ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యాచరణ ప్రణాళికను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వారు ఇచ్చారని పర్చూరు నియోజకవర్గం ఇఓపిఆర్‌డి వెంకట నారాయణ తెలిపారు. స్థానిక పర్చూరు తహశీల్దార్‌ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది జనవరి 1 నాటికి అర్హులైన ఓటర్లు అందరితో కలిపి తుది ఓటర్ల జాబితాను రూపొందించేందుకు భారత ఎన్నికల సంఘం నిర్ణయించి నట్లు తెలిపారు. ఇఆర్‌ఓలు, ఏఇఆర్‌ఓలు, బిఎల్‌ఓలకు అవసరమైన శిక్షణా కార్యక్రమాన్ని ఈ నెల 1వ తేదీ నుంచి ప్రారంభించినట్లు తెలిపారు. ఆ కార్యక్రమం జూలై 20 వరకు కొనసాగుతుందని అన్నారు. జవనరి 5న ఓటర్ల తుది జాబితాను ప్రచురిస్తామని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది 2024 జనవరి 1 కల్లా 18 సంవత్సరాలు నిండే యువత ఓటర్లుగా తమ పేరును నమోదు చేసుకోవచ్చునని తెలి పారు. ఈ సమావేశంలో వైసిపి నుంచి అప్పారావు, ఎం రాఘవయ్య, కే హరిబాబు, టీడీపీ నుంచి కే సురేష్‌, హరి బాబు, కాంగ్రెస్‌ నుంచి శివనాగేశ్వరారావు, జనసేన నుంచి రవిచంద్ర, సిపిఎం నుంచి శంకరయ్య, బిజెపి నుంచి కృష్ణ పాల్గొన్నారు. కార్యక్రమంలో పర్చూరు తహశీల్దార్‌ కె సంధ్యశ్రీ, ఇంకొల్లు తహశీల్దార్‌ పి బ్రహ్మయ్య, యద్దనపూడి తహసీల్దార్‌ బి వెంకటరెడ్డి, కారంచేడు తహశీల్దార్‌ ఎస్‌ వెంకటరత్నం, మార్టూరు తహశీల్దార్‌ బి సురేష్‌ బాబు, ఇడిటి అనిత, సీనియర్‌ అసిస్టెంట్‌ సత్యనారాయణ పాల్గొన్నారు.