Oct 07,2023 23:49

దళిత కాలనీలో వెలసిన ఫ్లెక్సీ

అర్తమూరులో వెలసిన ప్లెక్సీపై సర్వత్ర చర్చ
ప్రజాశక్తి - మండపేట
మండలంలోని అర్తమూరు గ్రామ దళితకాలనీ ముఖద్వారం వద్ద దళితులకు శ్మశాన వాటిక, జల్లు స్నాన ఘట్టం ఇచ్చేవరకు రాజకీయ నాయకులకు దళిత కాలనీలోకి ప్రవేశం లేదని ఓట్లు అడిగే హక్కు లేదని దళిత నాయకులు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. గ్రామంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం శనివారం రెండవ రోజు జరగనున్న నేపథ్యంలో రాత్రికి రాత్రే వెలిసిన ఫ్లెక్సీతో సర్వత్రా చర్చ జరుగుతుంది. కొన్ని సంవత్సరాలుగా గ్రామంలోని దళితులు శ్మశాన వాటిక, జల్లు స్నానం ఘట్టం కోసం పోరాటం చేస్తున్నారు. గ్రామంలో 375 కుటుంబాలు, 1,500 మంది దళితులు ఉన్నారు. వీరు రామవరం రోడ్డులో చనిపోయిన వారి మతదేహాలకు అంత్యక్రియలు చేసుకుంటున్నారు. అక్కడ జల్లు స్నాన ఘట్టం ఏర్పాటు చేయాలని పంచాయతీ అధికారులను కోరారు. దీంతో పంచాయతీ పాలకవర్గం వ్యతిరేకించడంతో ఉన్నతాధికారులను ఆశ్రయించారు. అయితే చెరువుగట్టు సమీపంలో ప్రభుత్వ స్థలాన్ని సేకరించారు. ఎంఎల్‌సి తోట త్రిమూర్తులు దాన్ని ప్రారంభించి దళితులకు అప్పగించారు. అదే రోజు దళితుడు చనిపోవడంతో స్థలంలోనే పూడ్చి పెట్టారు. అయితే స్థానిక రైతులు ఆ స్థలాన్ని వ్యవసాయ ఉత్పత్తులకు వినియోగించుకుంటున్నామని కోర్టుకు వెళ్లారు. ఇదిలా ఉండగా పాత స్థలంలో అనపర్తి మండలం పెడపర్తి గ్రామానికి చెందిన అధికారులు ఇది రోడ్డు భవనాల శాఖకు సంబంధించిన స్థలమని అక్కడ ఎటువంటి దహన కార్యక్రమాలు చేపట్టవద్దని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో దళితుల శ్మశాన సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. దిక్కుతోచని దళితులు ప్రభుత్వ కార్యాలయాలు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. నాటి నుంచి నేటి వరకు శ్మశానం, జల్లు స్నాన ఘట్టం ఏర్పాటు విషయంలో దళిత నాయకులు పెత్తందారుల మధ్య పోరాటం కొనసాగుతూనే ఉంది. ఈ సమయంలోఎంఎల్‌సి తోట త్రిమూర్తులు గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు దళిత నాయకులు వినూత్నంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.