ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కుల, మతాలను అడ్డం పెట్టుకొని ప్రజల మధ్య చిచ్చులు రేపుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ విమర్శించారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో క్విట్ కార్పొరేట్ - సేవ్ ఇండియా - సేవ్ అగ్రికల్చర్ పేరుతో సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో బుధవారం నిరసన చేపట్టారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన సభకు కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్షులు కామినేని రామారావు అధ్యక్షత వహించారు. విజరు కుమార్ మాట్లాడుతూ మణిపూర్ మూడు నెలలుగా తగలబడుతున్నా కేంద్రం తీరు సిగ్గు చేటన్నారు. మణిపూర్ ఘటనలు జరుగుతుండగానే ఒరిస్సాలో మత ఘర్షణలు జరగటం బాధాకరమన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు గంగవరం పోర్టు ద్వారా రావలసిన ముడి సరుకును నిలుపుదల చేయటం వలన ఉత్పత్తి తగ్గిందని విశాఖ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, ఉక్కు పరిశ్రమ పోరాటంలో అరెస్టులను తీవ్రంగా ఖండించారు. బిజెపి ఆకృత్యాలను తిప్పికొట్టి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికులు, కర్షకులు, అన్ని రంగాల ప్రజలు, అభ్యుదయ భావాలు కలిగిన ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. దేశ సంపదను, ప్రభుత్వ రంగ సంస్థలను, వ్యవసాయాన్ని, కార్మిక చట్టాలను కాపాడుకోవాలన్నారు.
సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ డి.సుకుమారి మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను, వ్యవసాయ రంగ చట్టాలను తుంగలో తొక్కుతున్న మోడీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని దేశ ప్రజలను మోడీ మోసం చేశారని విమర్శించారు. వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఎ.లక్ష్మీశ్వరరెడ్డి మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో సాగు భూమి పరాయికరణ అవుతుందని, భూమి సాగు చేసే వారికి భూమిని పంపిణీ చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసైన్మెంట్ చట్టాన్ని సవరించి భూములపై హక్కులు కల్పించి అమ్ముకునేందుకు ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. కౌలుదారి విధానం పెరుగుతున్న క్రమంలో వ్యవసాయ రంగంలో దోపిడీ ఎక్కువైతుందని ఆవేదన వ్యక్తం చేశారు భూమిలేని ప్రతి కుటుంబానికి రెండు నుంచి మూడు ఎకరాలు పంపిణీ చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు మాట్లాడుతూ నూటికి 70 శాతంగా ఉన్న కర్షకులను వ్యవసాయాన్ని కాపాడాలన్నారు. మోడీ అవలంభిస్తున్న కార్మిక , కర్షక ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సిఐటియు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయ నాయక్ మాట్లాడుతూ ప్రధాని మోడీకి దేశాన్ని పాలించే అర్హత లేదన్నారు. ప్రజల ద్వారా చేసే పోరాటాలతో దేశాన్ని వదిలిపెట్టి పోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో ఏవో చంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు సిలార్ మసూద్, పి.వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు, ఎన్.రామారావు, రామకృష్ణ, మస్తాన్‌వలి, కె.ఏడుకొండలు, కోటా నాయక్, కె.ఆంజనేయులు, రబ్బాని, శ్రీను పాల్గొన్నారు.










