Apr 23,2023 21:39

మాట్లాడుతున్న సిపిఎం జిల్లాకార్యదర్శివర్గ సభ్యులు ఎం.నాగేశ్వరరావు

రాజకీయ లబ్ధి కోసమే బిజెపి మత కలహాలు : సిపిఎం
ప్రజాశక్తి - ఆత్మకూరు

      కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే మతకలహాలను సృష్టిస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.నాగేశ్వరావు విమర్శించారు. ఆదివారం నందికొట్కూరు పట్టణంలోని వాల్మీకి నగర్‌, వడ్డపేట, కుమ్మరి పేట కాలనీలలో సిపిఎం ఆధ్వర్యంలో ప్రచార భేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ఎన్‌ఆర్‌సి, సిఏఏ పేరుతో ముస్లింలను ఈ దేశం నుంచి తరలించేందుకు కుట్ర చేస్తుందని అన్నారు. దళితులపై దాడులు, హత్యాచారాలు పెరిగిపోయాయని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలను బెదిరించడం, కేసులు పెట్టడం, లొంగదీసుకోవడం, ప్రాంతీయ పార్టీలను కూల్చివేయడం చేస్తున్నారని విమర్శించారు. అంబేద్కర్‌ రాసిన భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. ఆదాని, అంబానీ లాంటి పెట్టుబడుదారుల ప్రయోజనాల కోసం భారత సంపదనంతా కొల్లగొట్టి, పెట్టుబడిదారులకు నరేంద్ర మోడీ ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. హిందూ, ముస్లింలు, క్రిస్టియన్లు ఐక్యమత్యంతో భారతదేశ స్వతంత్రాన్ని కాపాడుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు వెంకటేశ్వర్లు, పకీర్‌ సాబ్‌, ప్రజాసంఘాల నాయకులు ఉస్మాన్‌ భాష, సోడా బిబి, జయ రాణి, ఉపేంద్ర, రాంబాబు, షాలు, వెంకటేశ్వర్లు, నాగరాజు, రఫీ, పాండు తదితరులు పాల్గొన్నారు. బేతంచెర్ల : మతోన్మాద బిజెపి ప్రభుత్వం నుండి దేశ ప్రజలను కాపాడుకుందామని సిపిఎం సీనియర్‌ నాయకులు వై. ఎల్లయ్య, మండల కార్యదర్శి అర్‌.ఈశ్వరయ్యలు తెలిపారు. పట్టణంలోని సుబ్బారెడ్డి నగర్‌, జంగాలపేట, కొత్త బస్టాండ్‌, ధరణి కాలనీ, ఎంపిడిఒ, ఎంఆర్‌ఒ ప్రాంతాలు, కోటకింది పేటలలో ప్రచార భేరి పాదయాత్ర నిర్వహించారు. సిపిఎం నాయకులు ఎస్‌కె.భాష, ఎన్‌.బాలయ్యల అధ్యక్షతన రెండు దళాలుగా ఏర్పడి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కరపత్రాలు పంపిణీ చేవారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు రాజు, చిన్నబ్బి, ఆంజనేయులు, రాజబాబు, నరసింహుడు, అంకాలు, యువరాజు, కావేటి చిన్న వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.