ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తేవాలని చూస్తున్న ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్ - యుసిసి)ని అన్ని రాజకీయ పార్టీలూ వ్యతిరేకించాలని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. యుసిసిని వ్యతిరేకిస్తూ వాపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ప్రకాష్ నగర్‌లోని ఎన్‌జిఒ హోంలో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి గిరిజన రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ వి.కోటానాయక్ అధ్యక్షత వహించారు. సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరు కుమార్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఉమ్మడి పౌరస్మృతిని రాజకీయ లబ్ధికోసం బిజెపి నేతలు ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. ఉమ్మడి పౌరస్మృతి మైనారిటీలపై అధిక ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. వారికున్న ప్రత్యేక హక్కులు బలహీనపడే ప్రమాదం ఉందని చెప్పారు. ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ భారతదేశంలో ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కుట్రలకు పాల్పడుతున్న బిజెపిని ప్రతిఒక్కరూ వ్యతిరే కించాలన్నారు. ప్రజలందరూ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఓటు ద్వారా ప్రతిఘటించేందుకు వామపక్షాలు, ప్రజా సంఘాలు ఏకమై చైతన్యం నింపాలని అన్నారు. యుసిసికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలూ ఐక్యంగా పోరాడాలన్నారు. సమావేశంలో పిడిఎం రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వరరావు, ఎన్.రామారావు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్.కె.మస్తాన్‌వలి, జి.రామకృష్ణ, కెఎన్‌పిఎస్ రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణ, ప్రజా కళామండలి రాష్ట్ర కోశాధికారి ఉన్నం నాగేశ్వరరావు, రాణి, ప్రగతిశీల కార్మిక సమైక్య జిల్లా కార్యవర్గ సభ్యులు కె.కొండలు, శ్రామిక మహిళ సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ డి.శివకుమారి, సిఐటియు జిల్లా కార్యదర్శి సిలార్ మసూద్, సమైక్య ఆంధ్రప్రదేశ్ ముస్లిం జెఎసి రాష్ట్ర కన్వీనర్ ఎస్‌కె.జిలానిమాలిక్, ఆవాజ్ నాయకులు హుస్సేన్, గిరిజన ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీను నాయక్, ఎంసిపిఐ (యు) నాయకులు రెడ్ బాష, ఎంఐఎం నాయకులు షేక్ మస్తాన్‌వలి, దరియవలి, మౌలాలి, ముస్లిమ్ సంక్షేమ సంఘం నాయకులు బాజీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిమ్ మైనార్టీ నాయకులు పి.పూర్ణచంద్రరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్‌ఎం బాషా పాల్గొన్నారు.
ప్రజాశక్తి - తెనాలి : యూనిఫాం సివిల్ కోడ్ ముస్లిములకే కాకుండా దేశంలోని ప్రజలందరికీ చేటు తెస్తుందని ఇమాన్ మజ్లీస్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఫరీద్ అన్నారు. పట్టణంలోని జామియా మసీద్ వద్ద శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కావాలనే కొన్ని నల్ల చట్టాలు తెచ్చి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని అన్నారు. అదే తరహాలో తెస్తున్న యునిఫాం సివిల్ కోడ్‌ను అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాలని కోరారు. కార్యక్రమంలో సయ్యద్ షబ్బీర్, జామియా మసీద్ అధ్యక్షులు షేక్ సుభానిచ షేక్ సమద్, జనసేన మైనార్టీ నాయకులు ఫేక్ కాలేషా, కమిటీ సభ్యులు షేక్ సత్తార్, షేక్ షబ్బీర్, షేక్ అబ్దుల్ రహమాన్, సిహెచ్.గోపి, డి.రాఘవేంద్రరావు, డి,సాయి, తాజ్ బాషా, అమీన్, బాషాబాబు, సల్మాన్ సుల్తాన్, హకీమ్ అలీమ్ పాల్గొన్నారు.










