ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి రాష్ట్రంలోని అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య ఇటీవల మాటల యుద్ధం సాగుతోంది. దీనిలో ప్రత్యేకత ఏమిటంటే రాష్ట్ర విభజన చట్టంలోని ఒక్క అంశాన్ని కూడా చిత్తశుద్ధిగా అమలు చేయకుండా, రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కూడా ఎగనామం పెట్టిన కేంద్ర మోడీ ప్రభుత్వాన్ని పల్లెత్తుమాట ఇరువురూ అనకపోవడం. తాజాగా కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా వైజాగ్ అని పేర్కొనడంతో రాష్ట్ర రాజధాని అంశం తెర పైకి తెచ్చే చిచ్చు పెట్టింది.
ఇటీవల తెలుగు దేశం పార్టీ ఉత్తరాంధ్ర రక్షణ చర్చా వేదిక ఒకటి ఏర్పాటు చేసి, ఉత్తరాంధ్ర సమస్యలపై ఉద్యమం చేస్తామని ప్రకటించింది. సమస్యలపై ఉద్యమం చేస్తే మంచిదే. అయితే ఈ పార్టీ గత చరిత్ర చుస్తే అలా చేస్తుందా అనేదే సందేహం. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రతినిధి బందం 2015లో విశాఖలో కలిసి ఉత్తరాంధ్ర అభివృద్ధికి వేదిక విజ్ఞాపనను ఇస్తే, ఇలాంటి వేదికలు వేర్పాటువాదానికి దారితీస్తాయని, తాము అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని, వేదికల అవసరం లేదని సెలవిచ్చారు. ఇప్పుడీ వేదిక అవసరం వీరి కెందుకొచ్చిందో ఉత్తరాంధ్ర ప్రజలకు వీరు సమాధానం చెప్పాలి. అప్పుడు వేర్పాటువాదమైతే మరి ఇప్పుడిదేమిటి? వారి ప్రభుత్వమే అభివృద్ధి చేసేస్తే ఇక ఇప్పుడీ ఉద్యమం ఎందుకు? వేదిక ఎందుకు? వాస్తవంగా వీరి ఐదేళ్ల పాలనలో ఉత్తరాంధ్ర మరింత వెనుకబాటు లోనికే నెట్టబడింది. ఒక్క నీటి ప్రాజక్టు కూడా నిర్మాణం కాలేదు. ఒక్క మూతబడ్డ పరిశ్రమను కూడా తెరిపించలేదు. అమరావతి చుట్టూ పాలనంతా తిప్పి ఆఖరికి అది కూడా పూర్తి చేయకుండా నిష్క్రమించిన చరిత్ర వీరిది. ఉత్తరాంధ్రకు జీవనాడిగా నిలిచే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సాధ్యమయ్యే ప్రాజక్టు కాదని చంద్రబాబు తేల్చేశారు. ఈ ప్రాంత ప్రజల నుండి వ్యతిరేకత రావడంతో ఎన్నికల ముందు మరోసారి మొక్కుబడిగా శంకుస్థాపనయితే చేశారు కానీ, వారి పాలనలో ఒక్క అంగుళం పని కూడా జరగలేదు. దీనికి తోడు గిరిజన ప్రాంతంలో బాక్సయిట్‌తో సహా ఖనిజాల అక్రమ తవ్వకాలకు ప్రయత్నం చేసింది.
ఈ కాలమంతా కేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టానికి తూట్లు పొడుస్తూ రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకు తీరని ద్రోహం చేసింది. ఉత్తరాంధ్ర ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ దాదాపు లేనట్లే చేసింది. విద్యా సంస్థలకు నిధులు కేటాయించ లేదు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏడేళ్లయినా ఇప్పటికీ ఏర్పాటుకాలేదు. విశాఖ మెట్రో రైల్ ఊసే మరిచారు. మోడీ ప్రభుత్వ ఈ ద్రోహ పూరిత చర్యలన్నింటినీ చంద్రబాబు ప్రభుత్వం సమర్ధించింది. ఆఖరున కంటి తుడుపుగా ఏదో చేసినా అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. అందువల్ల ఉత్తరాంధ్రకు జరిగిన ఈ అన్యాయంలో వీరి వాటా కూడా తప్పకుండా ఉంది.
నేడు జగన్ ప్రభుత్వం మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. ఎన్నికల ముందు మూతబడ్డ జ్యూట్, పంచదార పరిశ్రమ లను తెరిపిస్తామని హామీ ఇచ్చింది. ఈ రెండేళ్లలో ఆ దిశలో చర్యలేమీ లేవు సరికదా వీరి మంత్రి చిట్టివలస జ్యూట్ మిల్లు శాశ్వతంగా మూసేయడానికి కార్మికులు వ్యతిరేకిస్తున్నా దగ్గరుండి ఒప్పందం చేయించారు. అదనంగా నెల్లిమర్ల జ్యూట్ మూతబడింది. విశాఖనగరం లోని అత్యంత విలువైన భూములను అమ్మేయడానికి, తాకట్టు పెట్టడానికి నిర్ణయించింది. దీనికోసం ప్రభుత్వ ఆఫీసులను కూడా ఖాళీ చేయించడానికి సాహసించింది. విశాఖపట్నం మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అధారిటీ పేరుతో విస్తారమైన ప్రాంతంలో కార్పొరేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రోత్సహించడానికి నివేదికల మాటున సన్నాహాలు చేస్తోంది. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ భూములలో నిర్మించిన గంగవరం పోర్టును అదానీ సంస్థకు అమ్మేయాలని నిర్ణయించి, వేలాది కోట్ల రూపాయల విలువ కలిగిన 2852.26 ఎకరాల ప్రభుత్వ భూమిని కేవలం రూ.645 కోట్లకు కారు చౌకగా ధారాదత్తం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఎగ్గొడుతున్న విభజన చట్టంలోని అంశాల అమలుకై ఒత్తిడి తేవడంలేదు. విశాఖ రైల్వే జోన్, మెట్రో రైల్, అభివృద్ధి ప్యాకేజీ, విద్యా సంస్థలకు నిధుల విషయంలో కేంద్రాన్ని గట్టిగా అడగకుండా కాలయాపన చేస్తోంది. మెట్రో రైల్‌ను ఈ వంకతో ప్రవేటు సంస్థలకు ఇవ్వాలని భావిస్తోంది. గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి అన్ని విధాలుగా గత ప్రభుత్వం సిద్ధం చేసిన స్థలాన్ని కాదని వేరే స్థల సేకరణంటూ జాప్యం చేస్తోంది. ఏడేళ్లయినా దీని నిర్మాణం కూడా ప్రారంభం కాకపోవడానికి కారణమై ఎలా ఎగ్గొట్టాలా అని చూస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఊతమిచ్చింది. స్టీల్ ప్లాంట్ అమ్మకంపై పార్లమెంటులో ప్రశ్నలకే పరిమితమైంది తప్ప కేంద్రాన్ని నిలదీసి, నిలువరించే చొరవ లేదు. ఉద్దానం కిడ్నీ వ్యాధి రీసెర్చి కేంద్రం శంకుస్థాపనై రెండేళ్లయినా నిధులు కేటాయించకపోవడంతో ఇంకా పునాది దశలోనే ఉంది. గిరిజన యువతకు ఉపాధి కల్పించే చర్యలేమీ చేపట్టలేదు కానీ, స్పెషల్ డి.ఎస్.సి హామీ అమలు చేయడం లేదు. ఉద్యోగ నియామకాలలో గిరిజనులనే నియమించాలనే జీవో 3 చెల్లదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేయడానికి నిరాకరిస్తోంది. లాటిరైట్, రంగు రాళ్లతో సహా ఖనిజ సంపదను అక్రమంగా తవ్వుకు పోవడానికి అవకాశమిస్తోంది. ప్రంపంచమంతా నిషేధిస్తున్న అణు విద్యుత్ ప్లాంట్‌ను శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో ప్రజల వ్యతిరేకతను కూడా కాదని ఏర్పాటు చేయాలనే గత ప్రభుత్వ నిర్ణయంతోనే ముందుకుపోతోంది. వెరసి ఈ రెండున్నరేళ్ల కాలంలో కూడా ఉత్తరాంధ్ర సాధించిన అభివృద్ధేమీ లేదు సరికదా మరికొన్ని కొత్త సమస్యలు ఎదుర్కొంటోంది.
గత చంద్రబాబు ప్రభుత్వం హైటెక్ అనే బమ్మ చూపిస్తే నేటి జగన్ ప్రభుత్వం రాజధాని బమ్మ చూపిస్తోంది. అంతే తేడా. భూదందాలలో కూడా ఎవరూ తక్కువ తినలేదు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే అభివృద్ధి పనులపై శ్రద్ధ పెడితే అభివృద్ధికి ఉపయోగం తప్ప ఇలా సవాళ్లతో కాలక్షేపం చేయడం కేంద్ర కుట్రలో భాగస్వాములవడం కిందే లెక్క. కేంద్ర ప్రభుత్వ ద్రోహం వల్ల రాష్ట్ర విభజన తరువాత కూడా ఉత్తరాంధ్ర మరింత వెనుకబాటు లోనికే నెట్టబడింది. ఇలాంటి విపత్తులో ఇరువురూ పోటీ పడి కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే లాభం. అంతే తప్ప, ఇవన్నీ గాలికొదిలేసి ఒకరిపై మరొకరు కత్తులు దూసుకోవడం ప్రజలను వంచించడం అవుతుందేగాని ఉత్తరాంధ్రకు మాత్రం ప్రయోజనకరం కాదు.
- ఎ. అజ శర్మ
/ వ్యాసకర్త ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ /











