
ప్రజాశక్తి - భీమవరం రూరల్
చంద్రబాబు అక్రమ అరెస్టుపై టిడిపి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు శనివారం కొనసాగాయి. దీక్షలు వీరవాసరం మండల, భీమవరం పట్టణ టిడిపి నాయకులతో పాటు జనసేన మిత్రపక్షాల నాయకులు సంఘీభావంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, మాజీ ఎంఎల్‌ఎ పులపర్తి రామాంజనేయులు, రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి వెండ్ర శ్రీనివాస్, జనసేన పొలిటికల్స్ ఎఫైర్స్ మెంబర్ కనకరాజు సూరి, మండల ఉపాధ్యక్షులు యరరాజు గోపాలకృష్ణరాజు పాల్గొన్నారు.
పాలకొల్లు : పట్టణంలోని ఎల్‌ఆర్ పేటలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ జూనియర్, సీనియర్ కాలేజీ విద్యార్థులకు ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు శనివారం చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రచురించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఎంఎల్‌ఎ మాట్లాడుతూ యువత భవిష్యత్తు అంతా చంద్రబాబు చేతుల్లో ఉందని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు దిగి చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టిందని ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు చెప్పారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నిర్వహిస్తున్న దీక్షలు 11వ రోజుకు చేరాయి. బుడగ, జంగం రాష్ట్ర సంఘం నేతలు దీక్షల్లో కూర్చున్నారు. వారిని ఎంఎల్‌ఎ అభినందించి వారి సమస్యల పరిష్కారానికి అసెంబ్లీ వేదికగా పోరాడతానని చెప్పారు. వారు తమ కళా ప్రదర్శన ద్వారా పలువురిని ఆకట్టుకున్నారు.
ఆచంట : చంద్రబాబుపై రాజకీయ కక్షతో అక్రమ కేసులు బనాయించడం దారుణమని ఎంపిపి దిగమర్తి సూర్యకుమారి అన్నారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం 11వ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో పితాని వెంకట్, టిడిపి మండల అధ్యక్షులు కేతా మీరయ్య, జెడ్‌పిటిసి ఉప్పలపాటి సురేష్‌బాబు, సర్పంచులు గుబ్బల మాధవరావు, నేలపూడి బేబి రామ్మోహనరావు, ఎంపిటిసి బాలం సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
మొగల్తూరు : చంద్రబాబును వైసిపి ప్రభుత్వం రాజకీయ కక్షతో వేధిస్తోందని టిడిపి నాయకులు విమర్శించారు. ముత్యాలపల్లిలోని ఎన్‌టిఆర్ విగ్రహానికి నేతలు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు అందజేశారు. కార్యక్రమాల్లో నాయుడు రాంబాబు, కొల్లాటి బాలకృష్ణ, దొంగ శ్రీను, కొల్లాటి నాగేశ్వరరావు, పెంటయ్య, మూలస్వామి పాల్గొన్నారు.