ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ : రాజకీయ దురుద్దేశంతోనే జివిఎంసి కమిషనర్ లక్ష్మీశను బదిలీ చేశారని సిపిఎం పేర్కొంది. తక్షణం ఈ బదిలీపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. మంగళవారం పిఠాపురం కాలనీలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, సిపిఎం ఫ్లోర్ లీడర్, 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు, పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌కెఎస్‌వి.కుమార్ మాట్లాడారు. 11 నెలల కాలంలోనే మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ కమిషనర్ లక్ష్మీశను రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసిందన్నారు. కేవలం రుషికొండపై పర్యాటక సంస్థ చేపడుతున్న టూరిజం ప్రాజెక్టు, హయగ్రీవ ఫామ్స్ అండ్ విల్లాస్ సంస్థ చేపట్టిన నిర్మాణాల వల్ల ఈ బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడినట్టు తమ పార్టీ భావిస్తోందన్నారు. కొంతకాలంగా రుషికొండలో రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక సంస్థ పేర చేెపట్టిన నిర్మాణాలు తీవ్ర వివాదాస్పదంగా కొనసాగుతున్నాయన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్, రాష్ట్ర హైకోర్టులలో ఈ కేసు పెండింగులో ఉందన్నారు. నిబంధనలను ఉల్లంఘించి జివిఎంసి కమిషనర్ మీద ప్లాన్ ఆమోదం కోసం తీవ్ర ఒత్తిడిని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. రెండు సార్లు కమిషనర్ ఈ ప్లాన్‌ను ఆమోదించకుండా తిరస్కరించారన్నారు. ప్రభుత్వ తీవ్ర ఒత్తిడితో నాలుగు రోజుల క్రితం ప్లాన్‌కు కమిషనర్ ఆమోదం తెలిపారన్నారు. దీనికి పరిహారంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని బదిలీ చేసిందని చెప్పారు. హయగ్రీవ ప్రాజెక్ట్ పూర్తిగా అవినీతిమయమైందన్నారు. వైసిపిలోని ప్రధాన అగ్ర నాయకుల మధ్య వివాదం చివరికి కమిషనర్ బదిలీకి దారితీసిందని అన్నారు. నిర్మాణాల ప్లాన్ అనుమతుల్లో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. భూమి అమ్మకం, వినియోగం కూడా పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉందని తెలిపారు. ఈ వివాదాల్లోకి కమిషనర్‌ని లాగి చివరికి బదిలీ వేటు వేశారన్నారు.
నగరంలోని దసపల్లా భూములు ప్రభుత్వానివని, వాటిని ప్రయివేటుగా మార్చుకుని, వాటాలు వేసుకుని కాజేసేందుకు అధికార పార్టీ నాయకులు చూస్తున్నారని, ఆ ప్రయత్నానికి కూడా కమిషనర్ ఆమోదం తెలపనందున బదిలీ వేటు వేశారని తెలిపారు. నూతనంగా వచ్చే కమిషనర్‌పై కూడా దసపల్లా భూముల విషయంలో నాయకులు ఒత్తిడి తెస్తారని, ఆమోదం తెలపకుంటే అతన్నీ వదలిపెట్టరని అన్నారు.
జివిఎంసిలో చేపడుతున్న పనులు, కార్యకలాపాలు, టెండర్లు పూర్తిగా అవినీతిమయంగా మారాయన్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు, స్మార్ట్ సిటీ, షాపులు, కల్యాణ మండపాల లీజులు, ఆశీళ్లు, ప్లాన్ అనుమతులు, ప్రకటనలు, కోళ్ల వ్యర్థ పదార్థాలు, ట్రేడ్ లైసెన్సులు.. ఇలా అన్నీ పూర్తిగా అవినీతిమయంగా మారాయని తెలిపారు. అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి వైసిపి పాలకవర్గం, అగ్ర నాయకత్వం వీటిల్లో వందల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడుతోందని అన్నారు. జివిఎంసి ఆదాయానికి గండి కొడుతున్నారని తెలిపారు. జివిఎంసిని పూర్తిగా అవినీతిమయంగా మార్చారన్నారు.










