అనారోగ్యంతో భీమవరం ఆసుపత్రిలో మృతి
భౌతికకాయం స్వగ్రామం ఉప్పులూరు తరలింపు
ఉండి, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో విషాదఛాయలు
కుటుంబానికి మంత్రి కారుమూరి ఫోన్లో పరామర్శ
నారాయణస్వామి మృతి పట్ల సిపిఎం సంతాపం
ప్రజాశక్తి - భీమవరం
రాజకీయ దురంధరుడు, అజాతశత్రువుగా పేరొందిన మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యర్రా నారాయణస్వామి (92) బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో స్థానిక ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. అంత్యక్రియల నిమిత్తం నారాయణస్వామి భౌతికకాయాన్ని స్వగ్రామమైన ఉండి మండలం ఉప్పులూరు తరలించారు. ఈ నేపథ్యంలో ఉండి, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఉన్నత జమిందారీ కుటుంబంలో జన్మించి సామాన్య ప్రజల అభ్యున్నతి కోసం పదవుల్లో ఉన్నా లేకపోయినా నిరంతరం శ్రమించిన నిరాడంబరునిగా యర్రా నారాయణస్వామి పేరొందారు. 1931 ఏప్రిల్ 30న ఆయన ఉండి మండలం ఉప్పులూరులో యర్రా సూర్యారావు, శేషాయమ్మ దంపతులకు తృతీయ సంతానంగా జన్మించారు. సూర్యారావు సోదరుడు యర్రా చంద్రరావు, ఆండాళ్లమ్మ దంపతులకు నారాయణస్వామి దత్తపుత్రునిగా వెళ్లారు. ప్రాథమిక విద్య ఉప్పులూరులో, మాధ్యమిక విద్య 'నవభారత గురుకులం' రాజమండ్రిలో పూర్తి చేశారు. 'రామకృష్ణ మఠం' తణుకులో ఉంటూ జిల్లా బోర్డు ఉన్నత పాఠశాలలో చదివారు. 1945 తర్వాత విశాఖపట్నంలో రామకృష్ణ మఠంలో ఉంటూ ఎవిఎన్ పాఠశాలలో ఎస్‌ఎస్‌ఎల్‌సి ఉత్తీర్ణులయ్యారు. 1947-49 మధ్య భీమవరం డబ్ల్యుజిబి కళాశాలలో ఇంటర్, కాకినాడ పిఆర్ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశారు. తరువాత లక్నో రెసిడెన్షియల్ యూనివర్సిటీలో ఎంఎ, ఎల్‌ఎల్‌బి చదివారు. 1952 మే 15న తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదికి చెందిన బెల్లంకొండ పెదరాజన్న కుమార్తె సీతామహాలక్ష్మిని వివాహం చేసుకున్నారు. 1956లో హైకోర్టు న్యాయవాది పోలిశెట్టి రామచంద్రరావు వద్ద అప్రంటీస్‌గా కొద్దికాలం పని చేసి మానేశారు. 1958 వరకూ చిత్ర నిర్మాణ రంగంలో ప్రవేశించి సహనిర్మాతగా 'ఆడపెత్తనం' చిత్రాన్ని నిర్మించారు. మద్రాసు నుండి తిరిగొచ్చిన నారాయణస్వామి ఉప్పులూరు ప్రజల అభ్యర్థనపై 1960లో గ్రామ సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికై దశాబ్దకాలం పాటు 1970 వరకూ కొనసాగారు.
నారాయణస్వామి గ్రామ సర్పంచిగా పని చేసిన కాలంలో తండ్రి చంద్రరావు పేరున 'చంద్ర కళాసమితి' అనే సాంస్కృతిక భవనం, గ్రంథాలయ భవనం, పశువైద్యశాల, 1956లో చంద్రరావు, ఆండాళ్లమ్మ మిడిల్ హైస్కూల్, వల్లీ సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం సొంతం నిధులతో నిర్మించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. జిల్లాలోనే ప్రపథమంగా ఉప్పులూరులో రక్షిత మంచినీటి పథకాన్ని అమలు చేసిన ఘనత ఆయన సొంతం. 1963 నుండి 1969 వరకూ 'ది కోఆపరేటివ్ రూరల్ బ్యాంక్, ఉండి' శాఖకు చైర్మన్‌గా పి చేశారు. 'ది కృష్ణా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు డైరెక్టరుగానూ వ్యవహరించారు. 1960 నుండి 1976 వరకూ భీమవరంలో తన తండ్రిచే స్థాపించబడిన డబ్ల్యుజిబి కళాశాలకు వైస్ ప్రెసిడెంటుగా సేవలం దించారు. 1972లో కాంగ్రెస్ తరఫున స్థానిక సంస్థల కోటాలో ఎంఎల్‌సిగా నారాయణస్వామి ఎన్ని కయ్యారు. యర్రాను ప్రత్యేకంగా గుర్తించిన ముఖ్యమంత్రి జలగం వెంగళరావు 1976 ఆగస్టులో మంత్రి పదవి కట్టబెట్టారు.
టిడిపి ఆవిర్భావం అనంతరం ఆ పార్టీలో చేరిన నారాయణస్వామి తాడేపల్లిగూడెంలో నుంచి ఎంఎల్‌ఎగా బరిలోకి దిగి గెలుపొందారు. జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా అత్యధిక మెజార్టీతో గెలుపొంది రికార్డు సృష్టించారు. 1987 నుంచి 1992 వరకూ ఆయన జెడ్‌పి ఛైర్మన్‌గా పని చేశారు. 1992 నుండి 2000 వరకూ టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యునిగాను పని చేశారు. 1994 జనవరిలో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1999లో తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలుగుదేశం అభ్యర్ధిగా అఖండ విజయం సంపాదించారు.
ఉండి: మాజీమంత్రి, టిడిపి సీనియర్ నాయకులు యర్రా నారాయణస్వామి (92) మృతితో ఉప్పులూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. నారాయణస్వామి ఉప్పులూరు గ్రామ పంచాయతీ సర్పంచిగా రెండుసార్లు విజయం సాధించి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. ఉండి విశాల సహకార పరపతి సంఘం ఛైర్మన్‌గా రెండుసార్లు బాధ్యతలు చేపట్టి పూర్తిస్థాయిలో రుణాలందించి రైతుల ఉన్నతికి పాటుపడ్డారు. 1978లో ఉండి నియోజకవర్గం నుంచి రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. యర్రా నారాయణస్వామికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు యర్రా నవీన్ ప్రస్తుతం వైసిపిలో ఉన్నారు. రెండో కుమారుడు యర్రా సూర్యచంద్రరావు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. యర్రా నారాయణస్వామి మృతితో ఆయన స్వగ్రామం ఉప్పులూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. అంత్యక్రియల నిమిత్తం నారాయణస్వామి భౌతికకాయాన్ని ఉప్పులూరు తరలించారు.
తాడేపల్లిగూడెం: యర్రా నారాయణస్వామి మృతితో తాడేపల్లిగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈయన తాడేపల్లిగూడెం శ్రీ వాసవి ఇంజినీరింగ్ కళాశాల గౌరవాధ్యక్షులుగాను, భీమవరం డిఎన్‌ఆర్ కళాశాల పాలకవర్గ సభ్యులగానూ ఉన్నారు. నారాయణ స్వామి మృతి పట్ల టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి వలవల బాబ్జి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
పాలకొల్లు: మాజీ మంత్రి యర్రా నారాయణ స్వామి మతి పట్ల ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు, ఎంఎల్‌ఎ అంగర రామ్మోహన్ సంతాపం వ్యక్తం చేశారు. టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యునిగా ఆయన ఉమ్మడి జిల్లాకు చేసిన సేవలు చిరస్మరణీయమని వారు పేర్కొన్నారు.










