ప్రజాశక్తి -ములగాడ : జివిఎంసి 40వ వార్డు పరిధి ఎకెసి రాజీవ్ కాలనీలో పక్కా ఇళ్ల నిర్మాణాలకు టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్ హామీ ఇచ్చారు. కాలనీలో బుధవారం సాయంత్రం పశ్చిమ నియోజకవర్గం వైసిపి సమన్వయకర్త ఆడారి ఆనందకుమార్‌తో కలిసి ప్రసన్నకుమార్ పర్యటించారు. కాలనీలో ఉన్న చిన్నపాటి గృహాలను ప్రసన్నకుమార్ పరిశీలించారు. అక్కడి ప్రజల సమస్యలనడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అందరికీ ఇదే స్థలంలో ఇళ్లు కట్టించేలా చూస్తామని హామీ ఇచ్చారు. రాజీవ్ కాలనీలో గల 450 కుటుంబాలు ఒకేతాటిపైకి వచ్చి ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రసన్నకుమార్‌కు, ఆనందకుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో జివిఎంసి 60వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ పీవీ సురేష్, 62వ వార్డు కార్పొరేటర్ బల్ల లక్ష్మణరావు, టిడ్కో, జివిఎంసి అధికారులు, స్థానిక వైసిపి నాయకులు పాల్గొన్నారు.










