
ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్ : రాజీ కాగల కేసులకు లోక్ అదాలత్‌లో శాశ్వత పరిష్కారం లభిస్తుందని జూనియర్ సివిల్ జడ్జి రాకేష్ పిలుపునిచ్చారు. ఈ నెల 9 వ తేదీన జరగనున్న మెగా లోక్ అదాలత్ ను పురస్కరించుకుని బుధవారం పుట్టపర్తి కోర్టు చాంబర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జూనియర్ సివిల్ జడ్జి రాకేష్ మాట్లాడుతూ లోక్ అదాలత్ లక్ష్యాలను వివరించారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో చిన్నపాటి తగాదాలు, మనస్పర్థలతో కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ విలువైన సమయాన్ని ధనాన్ని వృధా చేసుకుంటున్నారని అన్నారు. ఇలాంటి వారి మధ్య సమన్వయం కుదిర్చితే రాజీ తో కేసులనుండి విముక్తులవుతారని వివరించారు. ప్రధానంగా లోక్ అదాలత్‌లో దీర్ఘకాలిక వ్యాజ్యాలకు కూడా పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఈ విషయం పై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన భాద్యత మీడియా పై ఉందన్నారు. ప్రజల్లో ఉన్న అపోహలు తొలగితేనే రాజీ కేసుల సంఖ్య పెరుగుతుందన్నారు. వివాదాల పరిష్కారానికి లోక్ అదాలత్ చక్కటి వేదిక అని జడ్జి రాకేష్ వివరించారు. ఈ నెల 9 వ తేదీ జరిగే లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కత్తి గంగిరెడ్డి, న్యాయవాదులు శ్రీనివాసులు, రాజేంద్రప్రసాద్ రెడ్డి, పూజారి ప్రసాద్, యదుభూషన్, నాగేంద్ర, కృష్ణప్రసాద్, నాగార్జున, ఇందిర శేఖర్, బిందు మహేష్, మౌనిక, క్లర్క్ మారుతి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.