ప్రజాశక్తి- అనకాపల్లి
రాష్ట్ర రాజధాని విషయంలో మంత్రులు బూటకపు ప్రకటనలు మానుకోవాలని టిడిపి జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు అన్నారు. స్థానిక పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో పారిశ్రామిక వేత్తలు మీ రాష్ట్ర రాజధాని ఏదని ప్రశ్నించారని, దీనిపై ఆర్థిక శాఖ మంత్రి విశాఖ ఒకటే రాజధాని అని అన్నారని తెలిపారు. మరో వైపు సజ్జల రామకృష్ణారెడ్డి మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని, అంబటి రాంబాబు మూడు రాజధానులపై సందేహమే అక్కరలేదని ప్రకటించగా, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోలా ప్రకటన చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, సలహాదారులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. మూడు రాజధానుల విషయం కోర్టులో ఉండగా పారిశ్రామికవేత్తలను నమ్మించడానికి, ప్రజలను గందరగోళం పరిచేందుకు ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం రాజకీయాలతో ప్రజలను, పారిశ్రామికవేత్తలను వంచన, దగా చేసి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సమావేశంలో పార్టీ నాయకులు మల్ల గణేష్, దూలం ప్రసాద్ పాల్గొన్నారు.










