ప్రజాశక్తి - తుళ్లూరు : రాజధాని ప్రాంతంలో వైసిపి ఆధ్వర్యంలో గురువారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. తాళ్లాయపాలెం జంక్షన్ దగ్గర ఉన్న మూడు రాజధానుల శిబిరం నుంచి వెంకటపాలెంలో జరిగే సిఎం సభ వరకు సాగిన ర్యాలీలో ఎంపి నందిగం సురేష్, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర సురేష్ కుమార్, బహుజన పరిరక్షణ సమితి నాయకులు మాదిగాని గురునాథం పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ చంద్రబాబు ఏనాడూ పేదల మేలు కోరలేదన్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు పేదలు సమాధి కడతారని హెచ్చరించారు. సెంటు స్థలం పంపిణీపై పేదలను అవమానపరిచేలా మాట్లాడిన మాటలను చంద్రబాబు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం చేసిన ఉద్యమం విజయవంతమైందని చెప్పారు. ఐనవోలులో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటాలకు వైసిపి శ్రేణులు పాలాభిషేకం చేశారు.










