ప్రజాశక్తి - తుళ్లూరు : రాజధాని అమరావతిలో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు చెందిన పేదలకు 'నవరత్నాలు - పేదలందరికీ ఇళ్ళు పథకం'లో సెంటు స్థలం పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నిడమర్రు, కృష్ణాయపాలెం, నవులూరు, ఐనవోలు, మందడం, కురగల్లు, యర్రబాలెం, పిచ్చుకలపాలెం, బోరుపాలెం, నెక్కల్లు, అనంతవరంలో లే అవుట్ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. అదివారమైనా అధికారులు వచ్చి పనులను పర్యవేక్షిస్తున్నారు.
ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు సంబంధించి 1402.59 ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్, ప్లాట్లు చదును, 180 కిలోమీటర్ల మేర అంతర్గత గ్రావెల్ రహదార్లు నిర్మాణం, ఆవాసయోగ్యంగా ఇళ్ల స్థలాల మార్కింగ్ తదితర పనులు చకచకా సాగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాకు కేటాయించిన 583.93 ఎకరాల్లో 14 లే అవుట్లలో, గుంటూరు జిల్లాకు సంబంధించి 550.65 ఎకరాల్లో 11 లే అవుట్లలో పనులను వేగవంతం చేశారు. పనులను సిఆర్‌డిఎ కమిషనర్ వివేక్ యాదవ్ అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన 50,004 మందికి సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ద్వారా ఇళ్ల స్థలాలను పంపిణీ చేయనుండగా ఈ కార్యక్రమాన్ని 18వ తేదీన తుళ్లూరులో నిర్వహిస్తారని ప్రచారమవుతోంది.










