ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : రాజధాని గ్రామాల్లో గుంటూరు, ఎన్‌టిఆర్ జిల్లాల్లోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ అంశంపై గతనెల 21న గెజిట్‌పై రైతులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ కేసును ఈనెల19కి వాయిదా వేసింది. దీంతోపాటు స్టే ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో ప్రభుత్వం ఈ అంశంలో వేగంగా ముందుకెళ్తోంది.రాజధానిలో ఆర్-5 జోన్ ఏర్పాటు చేయడాన్ని వారు తప్పుపడుతున్నారు.
రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇప్పటి వరకు నాలుగు నివాస జోన్లు ఉన్నాయి. ఇంత వరకు ఆర్-1 (ప్రస్తుత గ్రామాల్లోని నివాసాలు), ఆర్-2 (తక్కువ సాంధ్రత కలిగిన గృహాలు), ఆర్-3 తక్కువ నుంచి మధ్యస్థాయి సాంధ్రత కలిగిన గృహాలు), ఆర్-4 (హైడెన్సిటీ జోన్) పేర్లుతో నాలుగు రకాల నివాస జోన్లు గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాజధానిలోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలోని గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన 48,218 మందికి ఉచితంగా ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు అధికారులు ఇప్పటికే లబ్ధిదారులను గుర్తించారు. ఈనెలాఖరులోగా వీరికి పట్టాలు ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
సిఆర్‌డిఎ పరిధిలో మొత్తం 1134.58 ఎకరాల భూమి పేదల ఇళ్లకోసం కేటాయించారు. మొత్తం 20 లే అవుట్లలో స్థలాలను ఇవ్వాలని నిర్ణయించారు. లే అవుట్‌ల ఏర్పాటుకు టెండర్లు కూడా పిలిచారు. రాజధాని గ్రామంతో పాటు పెండింగ్‌లో ఉన్న నిడమర్రు ప్రాంతంలో కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నుట్టు అధికారులు తెలిపారు. ఐనవోలు, మందడం, కృష్ణాయపాలెం, నవులూరు, కురగల్లు, నిడమర్రు ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసింది.
సిఆర్‌డిఎ చట్టంలో సెక్షన్41(3), (4)ల ప్రకారం ఆర్-5 జోన్‌ను ఏర్పాటు చేసింది. గతేడాది అక్టోబరులో అభ్యంతరాలు, సలహాలు స్వీకరించిన ప్రభుత్వం బహిరంగ విచారణలు నిర్వహించింది. చివరిగా ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఆర్-5 జోన్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు సంబంధిత భూములను గుంటూరు, ఎన్‌టిఆర్ జిల్లాల కలెక్టర్లకు అప్పగించింది. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను కల్పించేందుకు వచ్చే నెల మొదటి వారంలోగా పనులు ప్రారంభించాలని సిఎం జగన్ ఇటీవల అధికారులను ఆదేశించారు. ఇప్పటికే సంబంధిత జిల్లాల వారికి స్థలాలు ఇస్తామని వారి వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో నమోదు చేశారు.
రాజధాని గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే జనాభా పొందిక సమతుల్యత దెబ్బతింటుందని టిడిపి నాయకులు కోర్టును ఆశ్రయించారని పేదలకు స్థలాలు ఇవ్వకుండా రాజధాని ఎలా అభివృద్ధి చెందుతుందని అధికార పార్టీ నాయకులు కొంత కాలంగా ప్రశ్నిస్తున్నారు. పేదలకు స్థలాలు ఇవ్వకుండా టిడిపి అడ్డుకుంటుందని వైసిపి నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. రాజధాని మాస్టర్‌ప్లాన్ ప్రకారం రాజధానిలో పేదల కాలనీలు ఉంటే మురికివాడలు ఏర్పాటు అవుతాయని, అందువల్ల పేదవాడలకు అవకాశం లేని రాజధాని నిర్మాణం చేయాలనే లక్ష్యంతో మాస్టర్ ప్లాన్ రూపొందించడం వల్ల తాము ఈ ప్రతిపాదనకు వ్యతిరేకిస్తున్నట్టు టిడిపి నాయకులు చెబుతున్నారు. పేదల ముసుగులో వైసిపి నాయకులు రాజధానిలో స్థలాలు కాజేస్తారని రాజధాని ప్రాంతనాయకులు ధనేకుల రామారావు ఇటీవల వ్యాఖ్యానించారు.










