ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : రాజధాని గ్రామాల్లో ఆర్-5 జోన్, ఎస్-3 జోన్లలో గుంటూరు, ఎన్‌టిఆర్ జిల్లాలకు చెందిన 50,793 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి వేగంగా అడుగులేస్తోంది. అంతేగాక ఇళ్ల నిర్మాణానికి ముందే ఈ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పనకు సిఆర్‌డిఎ అధికారులు బుధవారం శ్రీకారం చుట్టారు. మంగళగిరి నియోజకవర్గం పరిధిలో ఫేజ్-1 కింద దాదాపు రూ.8 కోట్లు మంజూరయ్యాయి. వీటితో పాఠశాలలు, ప్రభుత్వ వైద్యశాలలు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. బేతపూడిలో ప్రాథమిక పాఠశాల, ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి రూ.2.70 కోట్లతో నిర్మాణాలు చేపట్టారు. కృష్ణాయపాలెంలో ప్రాథమిక పాఠశాల, ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణానికి రూ.2.90 కోట్లతో పనులు ప్రారంభించారు. కురగల్లు, నవులూరు గ్రామాల్లో ఆస్పత్రుల నిర్మాణానికి ఒక్కొ గ్రామానికి రూ.1.20 కోట్ల చొప్పున రూ.2.40 కోట్లు కేటాయించారు. ఈ మేరకు సంబంధిత స్థలాల్లో జంగిల్ క్లియరెన్సు, ఇతర పనులు ప్రారంభించారు.
మరోవైపు రాజధాని అమరావతి పరిధిలో గుంటూరు, ఎన్‌టిఆర్ జిల్లాలకు చెందిన 50,793 మంది పేదలకు కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి జులై 8న సిఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. గతనెల 26న ఇళ్ల పట్టాల పంపిణీని సిఎం జగన్ తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ప్రారంభించారు. గత నెల రోజులుగా పట్టాల పంపిణీ కొనసాగుతోంది. ఇంకా ఐదువేల మందికి పట్టాలు పంపిణీ చేయాల్సి ఉందని తెలిసింది. వారంలోగా పట్టాల పంపిణీని పూర్తి చేయాలని సిఎం జగన్ ఆదేశించగా నెల రోజుల్లో 45 వేల మందికి పట్టాలు పంపిణీ చేశారు.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాజధానిలో 40వేల మందికి ఇళ్లను మంజూరు చేసింది. సిఆర్‌డిఎ పరిధిలోని ఆర్-5 జోన్‌తో పాటు గృహనిర్మాణాలకు కేటాయించిన ఎస్-3జోన్‌లో కూడా భూములలో పేదలకు ఇళ స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం మొత్తం 25 లేవుట్లలో 50,793 మందికి స్థలాలు కేటాయించారు. తొలి దశలో 40 వేల మందికి ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం చురుగ్గా ఏర్పాట్లును చేస్తోంది.
మరోవైపు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి జగనన్న కాలనీల్లో మాదిరిగానే వాలంటీర్ల ద్వారా గృహ నిర్మాణ శాఖ అధికారులు లబ్ధిదారులకు మూడు ఆప్షన్లు ఇచ్చారు. మొదటి ఆప్షన్‌లో సొంతంగా ఇల్లు కట్టుకుంటే లభ్ధిదారుల బ్యాంకు ఖాతాలో విడతల వారీగా రూ.1.80 లక్షలు జమచేస్తారు. రెండో ఆప్షన్‌గా ఇంటి నిర్మాణానికి కావాల్సిన మెటీరియల్ అందించడంతో పాటు కూలీల ఖర్చును బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. మూడో ఆప్షన్‌గా ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వడంగా పేర్కొన్నారు. అయితే దాదాపు 70 శాతం మంది లబ్ధిదారులు మూడో ఆప్షన్‌కు మొగ్గు చూపారు.










