ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : రాజధాని గ్రామాల్లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈనెల 26న సిఎం జగన్ గుంటూరు, ఎన్‌టిఆర్ జిల్లాలకు చెందిన దాదాపు 50 వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు.
సిఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత వైఎస్ జగన్ తొలిసారి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భారీ సభను నిర్వహిస్తున్నారు. రాజధాని అమరావతి స్థానంలో మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి వచ్చిన తరువాత 1252 రెండు రోజులుగా రైతులు వివిధ రూపాల్లో ఉద్యమిస్తున్నారు. ఒకవైపు కోర్టులో న్యాయపోరాటం చేస్తూనే మరోవైపు ప్రభుత్వానికి తమ గోడు వెళ్లబోసుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సిఎం జగన్ మూడేళ్లుగా రాజధాని గ్రామాల్లో పర్యటించడానికి ఆసక్తి చూపలేదు. తొలిసారిగా శుక్రవారం ఆయన వెంకటపాలెం వస్తున్నారు. దీంతో భారీగా జనసమీకరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కనీసం 60 వేల మంది సిఎం సభకు వస్తారని అంచనా వేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
అధికార పార్టీలో తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలతో ఈసారి జనసమీకరణ బాధ్యతలను జిల్లా అధికారులకు అప్పగించారు. వాలంటీర్ల ద్వారా ఎన్‌టిఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన 50 వేలమంది లబ్ధిదారులు సభకు హాజరయ్యేలా చూడాలని ఆదేశాలిచ్చారు. ఈ మేరకు వాలంటీర్లు లబ్ధిదారులను కలిసి సిఎం సభకు రావాలని సూచించారు. ఇందుకోసం రవాణా సౌకర్యం కూడా కల్పించారు. గుంటూరు జిల్లా నుంచి 900 బస్సులు ఏర్పాటు చేశారు. ఎన్‌టిఆర్ జిల్లా నుంచి 500 బస్సుల వరకు ఏర్పాటు చేస్తున్నారు. వీరితో పాటు మంగళగిరి, తెనాలి, పెదకూరపాడు, తాడికొండ నియోజకవర్గాలకు చెందిన డ్వాక్రా మహిళలు, వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులను కూడా సభకు రప్పిస్తున్నారు.
భారీగా వాహనాలలో ప్రజలను తీసుకువస్తుండటంతో వాహనాలకు ఇబ్బందిలేకుండా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను మళ్లిస్తున్నారు. ఈ మేరకు ఐజి పాలరాజ్ ఒక ప్రణాళిక రూపొందించారు. ప్రకాశం, కృష్ణా జిల్లాల నుంచి వచ్చే వాహనాలను మంగళగిరి ప్రాంతానికి రానీయకుండా ట్రాఫిక్ మళ్లింపులు ప్రకటించారు.
మరోవైపు సిఎం రాజధానికి వస్తున్న నేపథ్యంలో ఎలా నిరసన తెలపాలనే అంశంపై రైతు ప్రతినిధులు తర్జనభర్జనలు పడుతున్నారు. పోలీసుల తీవ్ర నిర్బంధం మధ్య నిరసన సాధ్యంకాదనే అభిప్రాయానికి వారు వచ్చినట్టు తెలిసింది. బుధవారం తుళ్లూరులో పోలీసులు జులుం ప్రదర్శించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే సిఎం సభలో ఎటువంటి నిరసనా వ్యక్తం కాకుండా పోలీసు అధికారులు డేగ కన్నుతో పరిశీలిస్తున్నారు. నిఘా విభాగం అధికారులు అప్రమత్తమయ్యారు. సిఎం సభలో ఇబ్బందులేమీ లేకుండా చూసేందుకు మఫ్టిలో పోలీసులను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా వైసిపి ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాజధాని మార్పు వల్ల వ్యతిరేకత ఏమీ లేదని చెప్పుకునేందుకు భారీ సభ ద్వారా సిఎం కార్యాలయం నుంచి వస్తున్న సూచనలతో యంత్రాంగం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా మంగళగిరి తహశీల్దార్ రాం ప్రసాద్ 38 వేల పట్టాలకు సంతకాలు చేశారు.










